ఆ జలపాతం అంచుల్లో ప్రయాణం ఓ అద్భుతం !

Sharing is Caring...

హౌరా నుండి గోవా వెళ్లే అమరావతి ఎక్స్ ప్రెస్. ఒకప్పుడు గుంటూరు నుండే మొదలవుతున్నందున దీనికి ఆ పేరు. మన చాలా రైళ్ళను ఒడియా వారు, బెంగాలు వారూ పొడిగించుకున్నట్టు దీన్నికూడా కలకత్తా దాకా పొడిగించారు. అక్కడనుంచి ఆగుతూ  ఆగుతూ మన స్టేషన్లు చేరుకునేసరికి ఈ బండ్లలో కాలుకూడా మోపలేము. రిజర్వేషనుంటేనే కొద్దిగా కాళ్ళు చాపుకోవచ్చు.

పోనీలే ఇలాగయినా మన తెలుగు రాజధాని పేరు పరాయి నోళ్ళలో పలుకుతుంది. నేను ఆ  రైల్లో కర్ణాటకలోని చివరి స్టేషనయిన కాజిల్ రాక్ దగ్గర దిగాలి. కాలి నడకన  ఆ కొండ,కోనల మద్యనున్న దూద్ సాగర్ జలపాతం చూడాలి.ఆ తర్వాత 13 కిలోమీటర్ల అవతల గోవాలోని కుళెం అనే ఊరు చేరుకోవాలి. – ఇది నా ప్రణాళిక.  రహదారికి ఏ మాత్రం చేరువుగా లేకుండా, రైలుకట్ట మీదుగా మాత్రమే చేరుకునే ఈ నాలుగు పాయల  గంభీరమైన జలపాతం అసలు పేరు మహాదయి, (మాండోవి) నది. పాలపొంగులా జలజలా జారుతుంది కాబట్టి దూద్ సాగర్ [ పాలకడలి] అంటారు.

ఈ నది కర్ణాటక బెలగావిలో పుట్టి 77 కిలోమీటర్లు సాగి గోవా రాజధాని పనాజిలో అరేబియా సాగరాన్ని కలుస్తుంది. ఈ జలపాతం దగ్గరే రైలు రోడ్డు వారు తూర్పునుండి పశ్చిమ కనుమలను చేదించి పడమటి తీరాలను చేరగలిగారు. ఇక్కడ ఉన్న మిర్రును బ్రగాంజా ఘాట్ అంటారు. ఈ 26 కి.మీ. ఘాటు ప్రయాణంలో రైలు 1700 అడుగులు ఎక్కి దిగుతుంది.

ఈ దారిలో ఉన్న నాలుగు రైళ్ళలో నిజానికి ఒక్కటి కూడా ఇక్కడ ఆగేవి కావు. కాకపోతే ఇక్కడనుండి అంతా దిగుడు దారి కాబట్టి బ్రేకులు చివరిసారిగా పరిశీలించుకోవడానికి అన్ని బండ్లు ఇక్కడ ఆగుతాయి. మాలాంటి సాహసికులకు ఆ మాత్రం అదను చాలు,… దిగిపోయి ఈ అందమైన కోన లో  కాలియాత్ర మొదలుపెట్టడానికి.

కొందరయితే దిగి జలపాతాన్ని తనివితీరా చూసుకొని ఇక్కడే వెనకగా వచ్చే రైలు ఎక్కి ప్రయాణం కొనసాగిస్తారు. ఇవాల్టి నా రైలు ఆలస్యం అయినందున నేనూ అలాగే వెనక రైలు ఎక్కదామనుకున్నాను. కాని అలా చేస్తే నేను నేనెందుకవుతాను? అంటే నేను ఈ దట్టడివిలో, ఉక్క పోతలో, రైలుకట్ట బాటలో 13 కి.మీలు రెండు గంటల తక్కువ వ్యవధిలో పూర్తి చెయ్యాలి. అందులో ఇక్కడ చీకటి చటుక్కున అలుముకొంటుంది.

రైలు ధార్వాడ కు కొద్ది దూరంలో ఉంది. ఇక్కడనుండే పల్లం ముగిసి కొండ ప్రాంతం మొదలవుతుంది. మెరక పోయి చిత్తడి మొదలవుతుంది. తలుపుదగ్గర నిలబడిన నేను ఆలస్యాన్ని కొద్దిసేపు పక్కకిపెట్టి ఆ పచ్చదనంలోకి జారిపోయాను.ఇంతలో శశాంక్ దగ్గర నుండి ఫోన్. ధార్వాడ్ స్టేషన్ లో నీ కోసం ఎదురుచూస్తున్నాను అని.శశాంక్ నేను ఇండియన్ రైల్వే ఇన్ఫో కామ్ లో సభ్యులం.ప్రతి ఏడాది ఈ రైల్వే ఇన్ఫో సభ్యులు ఏర్పాటు చేసుకునే సమావేశాలకు తప్పనిసరిగా హాజరు అవుతాం. మా ఇద్దరికీ మన రైళ్లన్నా,అందులో ప్రయాణాలన్నా చాలా ఇస్టం.

ఇంతలో ధార్వాడ్ స్టేషన్ వచ్చింది.శశాంక్ తో పాటు 70 ఏళ్ల  డాక్టర్ కార్తికేయన్ (హార్ట్ స్పెషలిస్ట్ ) ఎదురు చూస్తున్నారు.రైల్వే ఇన్ఫో లో సభ్యులైన డాక్టర్ గారు అందులో ఇచ్చిన నా ప్రయాణం గురించి తెలుసుకుని వచ్చారు. శశాంక్,నేను,కార్తికేయన్ గారు మన రైల్వేలు,వాటి శుభ్రత,వెబ్ సైట్ పనితీరు గురించి కాసేపు మాట్లాడుకున్నాము.

ఇంతలో రైలు కూత వేసింది.డాక్టర్ గారు తెచ్చిన పండ్లు,బ్రెడ్ పాకెట్  అందించారు. శశాంక్ తెచ్చిన టిఫిన్ బాక్స్ ,వాటర్ బాటిల్ తీసుకుని ….రైలెక్కాను. అక్కడ నుండే పల్లం ముగిసి,కొండ ప్రాంతం మొదలైంది. మెరక పోయి చిత్తడి మొదలైంది.తలుపు దగ్గర నిలబడిన నేను ఆలస్యాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి, ఆ పచ్చదనం లోకి జారిపోయాను.

కాజిల్ రాక్ స్టేషనురానే వచ్చింది. ఇది అస్సలు స్టేషనే కాదు. ఇది ఒకప్పుడు ముఖ్య అంతర్జాతీయ హద్దు. ఇక్కడనుండి పోర్చుగీసు రాజ్యం మొదలు గోవా వారి ఆధీనంలో ఉన్నప్పుడు. అప్పటికీ ఇప్పటికీ ఈ జననివాసం లేని ఈ ఊరు వచ్చే పోయే ప్రయాణికులకు మాత్రం మజిలియే.

ఇక్కడ రైలు అదనపు బ్రేకింగ్ పెట్టెను తగిలించుకుని గునగునా దిగుడు మార్గంలోకి పరిగెత్తింది. అంటే పొగరుమోతు బర్రెగొడ్లను అదుపు చేయడానికి ముందుకాళ్ళ మధ్య గుదిబండను వేళ్లాడదీసినట్టు ఈ ‘ఆపుడు పెట్టె’ అన్న మాట. రైలు అక్కడక్కడా చిమ్మచీకటి సొరంగాలను దాటుకుంటు పోతోంది.ఇదంతా ఏదో లోకంలో పయనిస్తున్నట్లుంది. దానికితోడు ఫోను సిగ్నలు లేదు. ఇంకేం. అంతరాయం లేని విహారం.

హోరు సవ్వడితో ఇహ లోకంలోకి తిరిగి వచ్చాను. ఏంటా అని చూద్దును గదా…  దూరంగా 1017 అడుగుల ఎత్తు నుండి దూకుతున్న దూద్ సాగర్ జలపాతం.  నా ఊరు వచ్చింది. దిగి, రైన్ కోట్ తొడుక్కుని రైలుకట్టపై జాగ్రత్తగా  నడవడం మొదలుపెట్టా.ఒక పక్క వాన..  ఇంజిన్ల నుండి కారిన నూనె, జారుడు, చేపట్టులేని అంచు, వీటన్నింటిని  జాగ్రత్తగా దాటుకుంటూ జలపాతం కిందకు చేరుకున్నాను. ఆ ఆనందంలో అన్ని ఆపసొపాలు మరచి దూద్ సాగర్ పాల నురుగు చూస్తూ కూర్చుండిపోయాను.

ఆ అందమైన జలపాతాన్ని చూస్తూ నన్ను నేను మర్చిపోయాను.పాలనురుగు లాంటి ఆ నీళ్ళను చూస్తుంటే,ఇక్కడి స్థానికులు  చెప్పే కత ఒకటి గుర్తు కొచ్చింది. ఒక్కానొక రోజుల్లో ఈ మాండవి నది చుట్టుపక్కల వున్న కొండలను ఒకరాజు పరిపాలిస్తూ వుండేవాడట.అతనికి ఒక అందమైన కూతురు ఉండేది.

ఆమె స్వచ్చమైన మనసు ఆమె అందాన్ని రెండింతలు చేసేది.కోటలో తామరపూలతో నిండివున్న అందమైన కొలను వుండేది.రాకుమారి తన చెలికత్తెలతో కలిసి అందులో స్నానం చేస్తుండేది.స్నానం చేశాక ఆ కొలను ఒడ్డున కాసేపు సేదతీరేది.అప్పుడు చెలికత్తెలు రాకుమారికి బంగారం,వజ్రాలతో చేసిన అందమైన చెంబుతో పాలను తాగటానికి ఇచ్చేవారు.

ఒకరోజు  ఆ మార్గాన ఒక అందమైన రాకుమారుడు వెళ్తూ వున్నాడు.అతనికి కొలనులో జలకాలాటలు ఆడుతున్న రాకుమారి,ఆమె చెలికత్తెల నవ్వులు,మాటలు వినపడ్డాయి.దూరంగా వస్తున్న రాకుమారుని గమనించిన రాకుమారి తన వంటిమీద సరైన దుస్తులు లేనందున సిగ్గుపడ్డది.రాకుమారుడు దగ్గరకు వచ్చేసరికి చెలికత్తెలు ఆమె కనిపించకుండా పాలను ధారగా ఆ కొలనులో గుమ్మరించారట..

దాంతో పాలు ఒక తెరలాగా ఏర్పడి రాకుమారి అతనికి కనిపించలేదట.ఆ కొలనులోని నీళ్లే కొండల మీద నుండి దూకుతున్న ఇప్పటి దూద్ సాగర్  అంటారు. ఎంత అందమైన కత. ఒక గంట తర్వాత ఆ ఆనందం నుండి నన్ను నేను బలవంతంగా లాక్కుపోవడం మొదలు పెట్టాను. మరి రెండు గంటల ఆలస్యాన్ని పూడ్చాలి కదా.

కొద్ది మలుపులు, మరికొన్ని గుహలు తర్వాత వెనక్కి తిరిగితే జలపాతం ఇంకా కనపడుతూనే ఉంది. చిన్నగానైనా పూర్తిగా. ఇక చాలునని తిరిగి చూడక బిరబిరా కాలు సాగించాను.  అప్పుడప్పుడూ ఇక్కడ గూడ్సు డ్రైవర్లు, ఆపి జనాలని ఎక్కించుకుంటారు. మామూలుగా అయితే ఎక్కించుకోకూడదు. కాని కొండల్లో సహాయం చేసే మనసు లెక్కువన్నట్లు డ్రైవరన్నలు కూడా. కాని ఈ రోజు నాకు ఏ రైలూ ఎదురుపడలేదు.

నిజానికి నాకు రైలు ప్రయాణం ఇష్టమయినా, కాలినడక తర్వాతే. ఎనిమిది కిలోమీటర్ల నడక తర్వాత కుళెం స్టేషన్ కనుచూపు మేరలోకి వచ్చింది. ఇక రెండు గుహలే దాటాలి. అసలే చీకటి పడుతుంది. ఒకప్పుడు మీటర్ గేజి రైళ్ళకోసం తవ్విన సన్నటి గుహలు. ఎదురుగా రైలు వచ్చిందంటే పక్కన మనిషి నిల్చోవటానికి కూడా చోటుండదు. అందునా ఈ రెండు గుహలు ఆ కొండల్లో ఉన్న ముప్పై గుహల్లోకల్ల పోడుగాటివి. అడుగు తీసి అడుగేయడం మొదలు పెట్టా. పైకప్పు నుండి టపటపా నీటి బొట్లు. ఇంకా వింత శబ్దాలేవో తోడు.

లోపలికి పోను పోను వాటి సవ్వడి ఎక్కువవుతుంది. కాలు సాగుతుందిగాని అడుగు మాత్రం ఆగిపోయినట్లనిపించింది. ఫోనువైపు చూసా. సిగ్నలు ఎందుకుంటుంది. ఉన్నా ఎవరినని పిలుస్తాం? దానిలోనే ఉన్న టార్చ్ లైటు వేసి, కాస్త  ధైర్యం తెచ్చుకున్నా. అన్ని చీకటి ప్రదేశాల్లాగా ఇక్కడ ‘ఓస్, ఇవి గబ్బిలాలా’ అనడానికి లేదు. పాములకి కూడా పశ్చిమ కనుమలు పేరు. చివరికి తెలిసింది, అవి కోతులు అని. నవ్వుకోబోయి, సంచిలో పండ్లున్నవిషయం గుర్తొచ్చి తమాయించుకున్నా. నన్ను … మట్టి గొట్టుకుపోయిన నా వాలకం చూసి అవయితే నవ్వుకుని ఉంటాయి.

మెల్లిమెల్లిగా రైలుగుహ ముగిసింది. బయటపడ్డాను. వాన ఆగింది. చీకటయింది. రైలు గేటు, ఊరు, మనుషులు, దూరంగా స్టేషను లైట్లు, ఏదో ఆగి ఉన్న రైలు. మరో ప్రపంచంలో నుంచి  బలవంతంగా ఈ లోకంలోకి నన్ను నేను తెచ్చుకోసాగాను. ఫోను మోగింది, నువ్వు ఏ లోకంలోకీ పోలేదన్నట్టు వెక్కిరిస్తూ.

“ఒరేయ్, ఎక్కడున్నావురా, తిరుగు ప్రయాణం టిక్కెట్లు అన్నీ వెయిటింగ్ లిస్టు” తేజస్ గాడి గొంతు మోగుతుంది. నేనెక్కిన గూడ్సు కూతకి వంతగా..
(ఇప్పటికే దాదాపు భారత దేశాన్ని తమ పర్యటనలతో చుట్టేసిన నా ఇద్దరు కుమారులలో పెద్దోడు డాక్టర్.విక్రమాదిత్య పర్యావరణ వ్యాసాలు రాస్తుంటాడు..చిన్నోడు విజయా దిత్య యాత్రా కథనాలు ఇంగ్లీష్ లో రాస్తుంటాడు..అతను రాసిన ఈ దూద్ సాగర్ కథనాన్ని నేను తెలుగులోకి అనువాదం చేశాను.)

——- పూదోట శౌరీలు .. బోధన్

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!