An ideal village…………………………………………………
మాధపర్….. ఇదొక గ్రామం పేరు … గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఇదే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా .. ఇది నిజం. ఈ మాధపర్ గ్రామంలో 7600 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వారి డబ్బు దాచుకోవడానికి ఆ గ్రామంలో 17కి పైగా బ్యాంకులు ఉన్నాయి.
ఈ బ్యాంకుల్లో గ్రామ ప్రజలు 5000 కోట్ల రూపాయల సొమ్మును డిపాజిట్ చేశారు. అంటే గ్రామంలో సగటు తలసరి డిపాజిట్ సుమారు 15 లక్షల రూపాయలు అన్నమాట. ఈ గ్రామంలో 17 బ్యాంకులతో పాటు పాఠశాలలు, కళాశాలలు, సరస్సులు, ఆనకట్టలు, ఆరోగ్య కేంద్రాలు, దేవాలయాలు ఉన్నాయి.
ఈ గ్రామంలో అత్యాధునిక గోశాల కూడా ఉంది. ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. దేశంలోని సంప్రదాయ గ్రామాల కంటే ఈ గ్రామం భిన్నంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం గ్రామస్థుల కుటుంబ సభ్యులు, బంధువులలో ఎక్కువ మంది యూకే ,యుఎస్,ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో సెటిల్ కావడమే. అందరికి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఉండటమే.
పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. 65% కంటే ఎక్కువ మంది ఎన్ ఆర్ ఐ లు అక్కడ నుంచి తమ కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బును పంపుతున్నారు.ఆ గ్రామ ఎన్ ఆర్ ఐ లలో చాలా మంది డబ్బు సంపాదించిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి గ్రామంలో తమ సొంత వెంచర్లను ప్రారంభించారు.
మాధపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థను 1968లో ఏర్పాటు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న మాధపర్ గ్రామస్తుల మధ్య సమావేశాలను సులభతరం చేయడమే ఈ సంస్థ లక్ష్యం. అలాగే ప్రజల మధ్య మంచి సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు.
చాలామంది గ్రామస్థులు విదేశాల్లో స్థిరపడినప్పటికీ వారు తమ మూలాలను ఎన్నడూ మరిచిపోలేదు. వారు నివసిస్తున్న దేశం కంటే గ్రామ బ్యాంకుల్లో తమ డబ్బును దాచుకోవడానికి ఇష్టపడతారు. వ్యవసాయం ఇప్పటికీ ఇక్కడ ప్రధాన వృత్తిగా ఉంది.
ఇక స్కూళ్లు కాలేజీలు,ఆనకట్టలు, పార్కులు హోటళ్లు,ఆసుపత్రులు అలా ఒక్కటేమిటీ మెట్రో నగరాలను తలదన్నేలా సకల సౌకర్యాలు సమకూర్చారు. విదేశాలకు వెళ్లిన చాలామంది పుట్టిన ఊరుపై మమకారంతో భారీగా విరాళాలు ఇచ్చి గ్రామాన్ని డెవలప్ చేసారు. అందుకే మాధపర్ గ్రామం సుసంపన్న గ్రామంగా వార్తల్లోకెక్కింది.