ఉషాకిరణ్ మూవీస్ పతాకం పై పత్రికాధిపతి రామోజీరావు నిర్మించిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ ప్రతిఘటన. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాలు రామోజీ తీసినప్పటికి అవి అంత పెద్ద హిట్స్ కావు. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు వంటి సినిమాలు తీసి సంచల దర్శకుడిగా ఎదిగిన టీ. కృష్ణ (హీరో గోపీచంద్ తండ్రి ) డైరెక్షన్లో రామోజీ ఈ ప్రతిఘటన చిత్రం నిర్మించారు.
1985 లో ఒక రోజు చెన్నైలోని ఒక హోటల్ లో ఫ్రెండ్స్ తో కూర్చొని కబుర్లు చెబుతున్న టీ. కృష్ణ ను గమనించి అట్లూరి రామారావు వెళ్లి పరిచయం చేసుకున్నారు. “మీతో ఒక సినిమా తీయాలని ఉంది … హైదరాబాద్ వస్తే రామోజీని పరిచయం చేస్తా”మన్నారు.
ఈ అట్లూరి రామారావు రామోజీ బాల్య స్నేహితుడు. ఇద్దరిది ఒకే వూరు. రామోజీ మార్గదర్శి పెట్టినప్పటినుంచి ఆయన వెంటనే ఉండి సహాయపడుతుండేవారు. ఉషాకిరణ్ మూవీస్ ను స్థాపించాక సినీ నిర్మాణ బాధ్యతలు చూసేవారు.
కొద్దీ రోజుల తర్వాత కృష్ణ రామోజీని కలిశారు. రాజకీయ నాయకులు నేరప్రవృత్తి .. గుండాలు .. సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల బ్యాక్ డ్రాప్ లో కథ తయారు చేస్తే సినిమా చేద్దామని రామోజీ చెప్పారు. అప్పటికే హక్కులు కొనుగోలు చేసిన “ఊరికో రాక్షసుడు”నవలను కూడా కృష్ణకు రామోజీ ఇచ్చారట. అందులోని మూల కథకు మరికొన్ని క్యారెక్టర్లు చేర్చి మసాలా పెట్టి కృష్ణ కథ తయారు చేశారు.
ఈ కథ రూపకల్పనలో రచయిత హరనాథరావు తదితరులు సహాయపడ్డారు.అప్పటికే నాటక రచయిత గా పేరు గాంచిన హరనాథరావే ఈ సినిమాకు మాటలు రాశారు. సినిమాలో ఆయన మాటలు తూటాల్లా పేలాయి. కథ కథనం అద్భుతంగా కుదరడం తో ప్రేక్షకులు “ప్రతిఘటన” కు నీరాజనాలు పట్టారు.
నటి విజయ శాంతి ఝాన్సీ పాత్రలో జీవించింది. విజయశాంతి డేట్స్ దొరక్కపోతే వేరే నిర్మాతలతో మాట్లాడి కృష్ణ 30 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశారు. విజయ శాంతి నటనకు నంది పురస్కారం లభించింది. “ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రువులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ” అంటూ వేటూరి రాసిన పాట ఎవర్ గ్రీన్ హిట్. ఇప్పటికి ఈ పాట ఎక్కడో ఒక చోట వినబడుతూ ఉంటుంది.
ఈ పాట పాడిన జానకి కి కూడా నంది పురస్కారం లభించింది. అలాగే మాటల రచయిత హరనాథరావు కి నంది అవార్డు లభించింది. కాశయ్య గా కోట నటన ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. తెలంగాణ యాస తో విలనిజం కోట బాగా పండించారు. సుత్తి వేలు తన కిచ్చిన పాత్రలో జీవించారు. దేశోద్ధారకులు చిత్రంలో పద్మనాభం నటించిన పాత్ర వంటిదే ఇది కూడా.
ఈ సినిమా హీరోయిన్ విజయ శాంతి, విలన్ పాత్రధారులు కోట శ్రీనివాసరావు, చరణ్ రాజ్, హీరో రాజశేఖర్, రచయిత హరనాథరావులకు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకొవాలి. కన్నడ సినిమాల్లో అప్పటివరకు హీరో పాత్రలు వేసిన చరణ్ రాజ్ ఇందులో విలన్ పాత్ర పోషించారు. ఫలితంగా తర్వాత కాలంలో చరణ్ రాజ్ కు తెలుగులో ఎన్నో విలన్ పాత్రలు లభించాయి. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ నటన అందరిని ఆకట్టుకుంది.
తర్వాత కాలంలో రాజశేఖర్ కి ఎన్నో మంచి పోలీస్ ఇనస్పెక్టర్ పాత్రలు వచ్చాయి. రొటీన్ చిత్రాలకు భిన్నంగా చక్రవర్తి ఈ సినిమాకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్స్ లేని సినిమాగా 25 కేంద్రాల్లో ప్రతిఘటన శతదినోత్సవం జరుపుకుంది. అప్పట్లో అదో రికార్డు. తెలుగులో భారీగా వసూళ్లు చేసిన ప్రతిఘటన 1987 లో ప్రతిఘట్ గా హిందీ లో రూపొందింది. రామోజీ నే రీమేక్ చేశారు.
అక్కడ కూడా ఆ రోజుల్లో 8 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీ చిత్రాని కి అంకుష్ ఫేమ్ ఎన్ . చంద్ర దర్శకత్వం వహించారు. సింపుల్ బడ్జెట్లో తీసిన ఈ సినిమాలో సుజాత మెహతా , చరణ్ రాజ్ ,మోహన్ భండారీ తదితరులు నటించారు. తెలుగు ప్రతిఘటన విడుదల అయి 37 ఏళ్ళు అయింది. ఈ సినిమా తర్వాత రామోజీ కి ఆ స్థాయిలో ఒకటి రెండు మించి కమర్షియల్ హిట్స్ లేవు. ఈ ప్రతిఘటన లో సంఘటనలు ఇప్పటికి దేశంలో అక్కడడక్కడా జరుగుతున్నాయి.
మా మిత్రులు ట్.కృష్ణ, mvs హరనాథ్ రావు ఎంతో వ్యయ ప్రసాసలతో తీసిన చిత్రం. హరణధారవు కి
కృష్ణ గారికి మొదటి చిత్రం, నటించి న కోట, సుత్తి వేలు
ఇంకా ఇతర నటులకు చిత్రం ఒక మైలు రాయి.
కొన్ని జ్ఞాపకాలు అలాగే మిగిలిపోతాయి.
మా మిత్రులు ఇద్దరు లేరు, వారి జ్ఞాపకాలు మా గుండెలలో పదిలం
యు.వి.రత్నo, ఒంగోలు.