Subramanyam Dogiparthi ——————
ప్రముఖ దర్శకుడు బాలచందర్ మధ్య తరగతి కుటుంబ కథలను .. వ్యధలను అద్భుతంగా తెరకెక్కించడం లో అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన సినిమా ఈ అంతులేనికథ. పూర్తిగా బాలచందర్ మార్క్ సినిమా. జయప్రద నట జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిన సినిమా ఇది.
ఇందులో నటించిన నాటి రజనీ కాంత్ ,కమలహాసన్,జయప్రదలు తర్వాత కాలం లో స్టార్స్ అయ్యేరు.
1975 లో అరంగేట్రం చేసి భూమి కోసం , నాకూ స్వతంత్రం వచ్చింది సినిమాల్లో తళుక్కుమన్న జయప్రద పూర్తి స్థాయి కథానాయిక పాత్ర లో నటించిన తొలి చిత్రం ఈ అంతులేని కథ. ఈ సినిమా 1976 లో విడుదలై సంచలన విజయం సాధించింది.
ఇంట్లో బయటా అందరికీ రాక్షసి లాగా కనిపిస్తూ , పనికిమాలిన కుటుంబ సభ్యుల కోసం తనను తాను కర్పూరహారతిని చేసుకునే అభాగ్యురాలి కధ టూకీగా . ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర మొదటిసారే అయినా జయప్రద జయప్రదంగా చేసింది .
తమిళంలో సక్సెస్ అయిన అవల్ ఒరు తొడర్ కధై అనే సినిమాకు రీమేక్ అంతులేని కధ . తమిళంలో జయప్రద పాత్రను సుజాత పోషించింది. తెలుగులో కూడా సూపర్ హిట్టయ్యాక 1997 లో బెంగాలీలో కబిత అనే టైటిల్ తో రీమేక్ అయింది. కబిత అంటే కవిత. బెంగాలీలు వ ను బ అంటారు కదా ! జయప్రద పాత్రను మాలాసిన్హా నటించింది.
1983 లో కన్నడంలోకి రీమేక్ అయింది . కన్నడంలో సుహాసిని నటించింది . 1982 లో జీవన్ ధారా అనే టైటిల్ తో రీమేక్ అవ్వగా జయప్రద పాత్రను రేఖ నటించింది . అంత ట్రాక్ రికార్డు ఉన్న కధ ఈ సినిమా కధ . అయిదు భాషల్లో నిర్మితమైన ఈ సినిమాలో అందరికన్నా జయప్రదే బాగా నటించిందని అంటారు .
ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. ఆత్రేయ పాటలన్నిటిని అద్భుతంగా రాశారు. ముఖ్యంగా బాల సుబ్రహ్మణ్యం పాడిన తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల పాట . మిమిక్రీతో కూడిన పాట. బాల సుబ్రహ్మణ్యం తప్పితే ఈ ఫీట్ మరెవరికీ చేతకాదు. ఆ తర్వాత’ దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి’ పాట.జేసుదాసు బ్రహ్మండంగా పాడారు. ఈ పాటతో రజనీ కి తెలుగు నాట ఫాన్స్ ఏర్పడ్డారు.
యస్ జానకి , యల్ ఆర్ ఈశ్వరి పాడిన రెండు పాటలు జనం చెవుల తుప్పు వదిలించాయి . అరే ఏమిటి లోకం పలుగాకుల లోకం… కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ యం యస్ విశ్వనాథన్ జనరంజకమైన ట్యూన్స్ అందించారు.
ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . రజనీకాంత్ , నారాయణరావు , శ్రీప్రియలకు తెలుగులో మొదటి సినిమా . రజనీకాంత్ స్టైలుగా సిగరెట్ కాల్చటం ప్రేక్షకులకు బాగా నచ్చింది . వికటకవి పాత్రలో నటించిన నారాయణరావుకు మంచి పేరు వచ్చింది . ఇంక బెంగాలీ బాబు పాత్రలో కమల్ హసన్ మంచబ్బాయిగా చక్కగా నటించారు . బెంగాలీ సినిమాలో ఇదే పాత్రను తిరిగి పోషించారు . కన్నడంలో కూడా నటించారు.
ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నటి జయలక్ష్మి . ఈ సినిమా ద్వారానే ఫటాఫట్ జయలక్ష్మి గా గుర్తింపు పొందారు. ఈ సినిమాకు మాటలు వ్రాసిన ఆత్రేయకు ఈ ఫటాఫట్ పదం ఎక్కడ దొరికిందో కాని ఆంధ్ర దేశమంతా అప్పట్లో ఫటాఫట్ ఆడింది , ఇంకా ఆడుతూనే ఉంది . Careless యువతిగా , చలాకీగా , హుషారుగా జయలక్ష్మి బ్రహ్మాండంగా నటించింది . ‘అరె ఏమిటి లోకం’ పాటలో ఇరగతీసింది .
తల్లీకూతుళ్ళ మధ్య ఎన్ని విబేధాలయినా రావచ్చు కాని సవతి పోరు మాత్రం రాకూడదనే డైలాగ్ బాగా పేలింది. మరో నటుడు ప్రసాద్ బాబు . అతనికి కూడా ఇదే మొదటి సినిమా. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా విశాఖపట్నం లోనే జరిగింది . బాలచందర్ కు కూడా విశాఖ అంటే సెంటిమెంట్ లాగా ఉంది.
చరిత్ర సృష్టించిన మరో చరిత్ర సినిమా కూడా విశాఖలోనే తీసారు బ్లాక్ & వైట్ సినిమా అయినా సూపర్ హిట్టయింది. లోకనాథన్ కెమెరా పనితనం కూడా బాగుంటుంది. టివిలో ఇప్పటికీ వస్తూనే ఉంటుంది . చూడని వారు ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . యూట్యూబులో ఉంది .
మధ్య తరగతి కుటుంబాలలో ఏ పనీ చేయకుండా భూమికి భారమయ్యే కుటుంబ సభ్యుల బాధితులు అవుతున్న అభాగ్య అక్కలకు , తల్లులకు ,తండ్రులకు ఈ సినిమా అంకితం . వారి జీవితాలు అంతులేని కధే..