అక్కడ అడుగడుగునా అద్భుత శిల్పాలే !

Sharing is Caring...

Beautiful sculptures at every step ………………………….

ఉనకోటి…   ప్రముఖ శైవ క్షేత్రమది … ఈ క్షేత్రం పెద్ద కొండలు, అడవులు నడుమ లోయ ప్రాంతంలో ఉంది. ఇది త్రిపుర లోని అగర్తలా కు 178 కిమీ దూరంలో ఉన్న జాంపూయి పర్వతాలకు దగ్గరలో ఉన్నది. 11 వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్టు చెబుతారు. ఇక్కడ అడుగడుగునా ఓ అందమైన శిల్పాలు కనిపిస్తాయి. అలా సుమారు కోటి శిల్పాలు అక్కడ ఉన్నాయి.

ఆ శిల్పాలన్నీ అద్భుత సౌందర్యంతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తమ హావభావాలతో కనువిందు చేస్తాయి. బెంగాలీలో ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థం.ఇక శిల్పాల విషయానికి వస్తే… ఇవి 30–40 అడుగుల ఎత్తున ఉంటాయి. అయితే అన్నీ అసంపూర్తిగా ఉంటాయి.

వీటి పళ్లు, కళ్లు అలంకరణ, హావభావాలు అన్నీ కూడా అక్కడి గిరిజనులను పోలి ఉంటాయి. ఈ పర్వత ప్రదేశంలోని ప్రతి మూలకూ వెళ్లడానికి ఎగుడు దిగుడుగా, అడ్డదిడ్డంగా మెట్లు, పర్వతాలను అనుసంధానిస్తూ వంతెనలూ ఉన్నాయి. ఇక్కడ కాలు పెట్టగానే ఇంతటి అద్భుతమైన సుందరప్రదేశాన్ని ప్రపంచం ఎందుకు విస్మరించిందా అనిపిస్తుంది.

ఇక్కడి శివుడిని  ఉనకోటీశ్వర కాలభైరవుడని పిలుస్తారు. మహాదేవుని విగ్రహం దాదాపు ముప్ఫై అడుగుల ఎత్తులో చెక్కి ఉంటుంది. ఒకవైపు సింహవాహనంపై పార్వతి, మరోవైపు గంగ ఉంటారు. పాదాల చెంత మూడు పెద్ద పెద్ద నంది విగ్రహాలు భూమిలో కూరుకుపోయినట్లుగా ఉంటాయి. ఉనకోటీశ్వరుడికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి.

పూజారులు ఇక్కడికి దగ్గరలో ఉంటారు. ఇక్కడి రాతి విగ్రహాలకు పైన,కిందా చక్కటి పచ్చిక అల్లుకుని ఉంటుంది. అలాగే గలగల పారే సెలయేళ్లు లేదా పైనుంచి కిందికి పరవళ్లు తొక్కుతూ పడే జలపాతాలు ఉంటాయి. ఇవన్నీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌లో ఇక్కడ పెద్ద ఎత్తున జరిగే అశోకాష్టమి ఉత్సవాలకు త్రిపుర నుంచే గాక చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

అసలు ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది ?  ఇన్ని శిల్పాలు ఎలా వచ్చాయో ? తెలియ జేసే పురాణ కథనాలు ప్రచారం లో ఉన్నాయి. ఓసారి మహాదేవుడు కోటిమంది దేవతలతో కలసి కైలాసానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యానికి పరవశించాడు. ఆయన వెంట వచ్చిన దేవతలందరూ కూడా ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని శివుడికి విన్నవిస్తారు.

అందుకు శివుడు సమ్మతిస్తాడు. అయితే మర్నాడు సూర్యోదయానికి ముందే అక్కడి నుంచి బయలుదేరాలని, లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని షరతుపెడతాడు. దేవతలందరూ తీవ్రమైన అలసట కారణంగా గాఢనిద్రలో మునిగిపోయి సూర్యోదయానికి ముందు మేలుకోలేకపోతారు. దాంతో శివుడు వారిని అక్కడే శిలలై పడి ఉండండని శపించాడని చెబుతారు.

మరో కథ ఏమిటంటే ……. అప్పట్లో ఈ ప్రాంతంలో కుల్లు కంహార అనే శిల్పి ఉండేవాడు. అతను శక్తి ఉపాసకుడు. ఓసారి శివగణాలతో పార్వతీ పరమేశ్వరులు ఈ మార్గం గుండా పయనిస్తున్నారు. అది తెలిసి అక్కడికి చేరుకున్న కుల్లు తననూ వారితో తీసుకువెళ్లమని వేడుకున్నాడు. అందుకు శివుడు అనుమతించలేదు.

తన భక్తుడు కావడంతో  తెల్లవారేలోగా కోటి శిల్పాలను చెక్కగలిగితే శివుణ్ణి ఎలాగైనా ఒప్పించి తమతో తీసుకు వెళ్తామని పార్వతి అతగాడితో చెప్పింది. అతను ఆనందంతో విగ్రహాలు చెక్కడం మొదలు పెట్టాడు. అయితే దురదృష్టవశాత్తూ అవి కోటికి ఒకటి తక్కువగా ఉన్నాయి. దాంతో పరమేశ్వరుడు అతన్ని కైలాసానికి రానివ్వలేదు.

కాగా తాను గొప్పశిల్పినని అతగానికి గర్వం.పైగా బొందితో కైలాసానికి వెళ్లాలన్న కోరిక  అసంబద్ధమైనది కాబట్టి  అందుకే శివుడు అతడిని అనుగ్రహించలేదు. 

అతగాడు చెక్కిన శిల్పాలే అక్కడ ఉన్నాయని అంటారు. ఈ ఉనకోటిలో చూసేందుకు మరేమీ లేవు. అగర్తలా వెళ్ళినవారు ఈ ప్రాంతాన్నీ చూసి రావచ్చు.

 

——-– Theja

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!