అప్పట్లో ఈనాడు అంటే భలే క్రేజ్ !

Sharing is Caring...

అవకాశం దొరికితే చాలామంది ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుని ఇంటర్వ్యూ చేయాలనుకుంటారు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే జర్నలిజం లో 30 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆయనను కొన్ని ప్రశ్నలు అడగగలనని నమ్మకం. అయితే నాకు ఏ అనుభవం లేని రోజుల్లో నన్నే రామోజీరావు గారు ఓ 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. అది కూడా గొప్ప విషయమే కదా ! కొండొకచో దీన్నే ఎచ్చులు పోవడం అని కూడా అంటారు. అప్పట్లో ఈనాడు డెస్క్ సిబ్బంది ఇంటర్వూలలో కొన్ని రామోజీ గారే చేసేవారు.
అలా అప్పట్లో నాకు ఆ అవకాశం లభించింది. 80 దశకంలో ఈనాడు ఒక ట్రెండ్ సెట్టర్ . అందులో చేరాలని యువకులు ఉబలాటపడేవారు. నేనూ అంతే.ఇపుడు పేరు మోసిన జర్నలిస్టులందరూ( 80 శాతం ) మొదట్లో ఈనాడులో అక్షరాభ్యాసం చేసినవారే. 1985 లో పేపర్లో యాడ్ చూసి నేను కూడా దరఖాస్తు చేశా. పిలుపు వచ్చింది. విజయవాడ ఈనాడులో రిటెన్ టెస్ట్ పెట్టారు.బాగానే రాశాను. మరో నెల తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ కి హైదరాబాద్ రమ్మన్నారు. ఆరోజు ఇంటర్వ్యూలో భయం.. భయంగా ప్రశ్నలకు జవాబు చెప్పా. ఇంటర్వ్యూ అంతా ఇంగ్లీషులో సాగింది. తెలుగు మీడియంలో చదివిన నాకు ఆంగ్లంలో అంత పాండిత్యం లేదు. ఆ రోజు ఇంటర్వ్యూ చేసింది న్యూస్ టుడే డైరెక్టర్ ఎస్ ఆర్ రామానుజన్ గారు.ఆయనే న్యూస్ టైం పత్రిక ఎడిటర్ కూడా.

అప్పటికే న్యూస్ టైం లో బాల్య మిత్రుడు సాంబశివ సబ్ ఎడిటర్ గా చేస్తున్నాడు. వాడికి విషయం చెప్పాను. నేను వారం రోజుల్లో ఒంగోలు వస్తా… వచ్చేటప్పుడు రిజల్ట్ కనుక్కొని వస్తా అన్నాడు.మరుసటివారం సాంబ వచ్చి నేను సందేహపడినట్టే నువ్వు సెలెక్ట్ కాలేదని చెప్పాడు. నాకు వేరే ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు. అప్పటికే జాగృతి పత్రికకు కంట్రిబ్యూటర్ గా పని చేస్తున్నాను. జస్ట్ అనుభవం కోసం అందులోచేరాను. అది వీక్లి కాబట్టి ప్రతి వారం ఒక న్యూస్ లెటర్ పంపితే చాలు. మొదటి ప్రయత్నం లో ఓటమి నాలో కసి పెంచింది . ఎలాగైనా ఈనాడులో చేరాలని నిర్ణయించుకున్నాను. నాలుగు నెలల తర్వాత మళ్ళీ యాడ్ వేశారు . దరఖాస్తు చేసే ముందు ఒంగోలు ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ రామయ్య గారిని కలిసాను. కేవలం మెరిట్ పైనే సెలెక్షన్స్ ఉంటాయి. ట్రాన్సలేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయమన్నారు. తిరిగి వస్తుంటే .. మార్గదర్శి మార్కెటింగ్ లో పనిచేస్తున్నఒక మిత్రుడు కలిసాడు. వాడితో మాట్లాడుతుంటే వాడు “రెండో సారి నువ్వు అప్లై చేసినా నీకు పిలుపు రాదు. నీపేరు అడ్రస్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లి ఉంటాయి” అంటూ బాంబు పేల్చాడు.

ఆ మాటకు ఒక్కసారిగా నీరసం ఆవహించింది.” మరెట్లా “అన్నాను”ఓ పని చేయి … అడ్రస్ మార్చి దరఖాస్తు చేయి.. వర్కట్ కావచ్చు ” అన్నాడు . ఈ ఐడియా బాగుంది.మంచి సలహా ఇచ్చినందుకు వాడికి టీ ,సిగరెట్ ఇప్పించి థాంక్స్ చెప్పివచ్చేసాను. మరుసటి రోజే దరఖాస్తు పంపి… హిందూ పేపర్ కొనుక్కొని అనువాదాలు ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను .నెలరోజులు దాటాక కాల్ లెటర్ వచ్చింది. ఎగిరి గంతేశాను .విజయవాడ వెళ్లి రిటెన్ టెస్ట్ రాసాను. ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసాను కాబట్టి పరీక్ష బాగా రాసాను. దాదాపు వందమంది రాశారు. ఆ మరుసటి నెలలో అనుకున్నట్టే ఇంటర్వ్యూ కి రమ్మని పిలుపు వచ్చింది.హైదరాబాద్ సోమాజిగూడ ఆఫిసులో ఇంటర్వ్యూ ఉదయం 1 0 గంటలకు రమ్మన్నారు.నేను మేడ పైకి వెళ్ళేసరికి ఇంటర్వూస్ మొదలయ్యాయి. ఒక్కొక్కరు వెళ్లి వస్తున్నారు. బయటకు వచ్చిన వాడిని పట్టుకుని లోపల ఏమి అడుగుతున్నారని ఆరాతీస్తున్నారు. నా వంతు వచ్చింది .. మెల్లగా లోపలికి వెళ్లి రైట్ తిరిగాను.

ఎదురుగా రామోజీరావు గారు. గంభీరమైన వదనం. తెల్లటి చొక్కాలో ధగధగ మెరిసిపోతున్నారు. “నమస్తే సార్ “అన్నాను వినమ్రంగా . ఆయన ‘ కూర్చో’ అన్నట్టుగా చేతితో కుర్చీ చూపించారు.అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పు అని మా సాంబడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన నన్ను కిందనుంచి పైకి ఒక్కసారి నిశితంగా చూసి ప్రశ్నలు సంధించారు.”పేపర్ రీడింగ్ హాబీ అని రాసావు … రోజూ ఏయే పేపర్లు చదువుతావ్ ?””ఈనాడు , ఆంధ్రజ్యోతి, ప్రభ , పత్రిక” అని చెప్పాను.”అవన్నీ కొని చదువుతావా ?” మరోప్రశ్న. “ఈనాడు ఇంటికి వేయించుకుంటున్నా. మిగతావి లైబ్రరీ లో చదువుతాను.” అన్నాను “ఈనాడు గురించి నాలుగు మాటలు చెప్పు ?””ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతుంది. ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ అందిస్తుంది. ఫస్ట్ పేజీలో లోకల్ న్యూస్ కి ప్రాధాన్యమిస్తుంది. ఉదయం 5. 30 కి ఇంటికొస్తుంది ” అన్నాను.

“మొన్నటి ఎలక్షన్ లో ఎవరికి ఓటేశావ్ ?” “ఓటేసాను కానీ బయటికి చెప్పకూడదు కదా ?””ఎందుకని ? ” “సీక్రెట్ బ్యాలెట్ సిస్టం ” చెప్పాను. నా జవాబుకి ఆయన నవ్వారు. “ఎన్టీఆర్ పై నీ అభిప్రాయం ఏమిటి ?” “ఎన్టీఆర్ మంచి నాయకుడే.. ఇంకా రాజకీయాలు వంటబట్టలేదు” అన్నాను . ” ఉద్యోగం ఇస్తే … ఏ వూరు అయినా వెళ్తావా ? “”ఎక్కడైనా చేస్తా .. ఈనాడులో చేరడం నా లైఫ్ గోల్ .. ఇది రెండో సారి ఇంటర్వ్యూ కి రావడం సార్ “అన్నాను. ఆయన “రెండో సారా ?” అంటూ ఆశ్చర్యంగా చూసారు. అపుడు లైట్ వెలిగింది .. నోరు జారానని. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా “చిరునామా మార్చి దరఖాస్తు పంపా”నని నిజం చెప్పాను. చిరు మందహాసంతో “ఒకే. వెళ్లి రా” అన్నారాయన. సరిగ్గా నెలరోజులకు జాయినింగ్ లెటర్ పంపారు.తిరుపతి వెళ్లి జాయిన్ అయ్యాను. మొఫసిల్ డెస్క్ కి నవీన్ గారు ఇంచార్జి గా ఉండేవారు. డెస్క్ లో సౌదా .. త్రిపురనేని శ్రీనివాస్ ,వాసుదేవన్,బ్రహ్మయ్య , సుధాకరరెడ్డి , నాగేంద్ర , మరికొంతమంది మిత్రులు ఉండేవారు.

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. Gonuguntla Naga Prabhakara Rao September 13, 2020
error: Content is protected !!