Sheik Sadiq Ali ……..
చరిత్రలో కాకతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయ రాజుల్లో గణపతి దేవుడు ప్రముఖుడు. తెలుగు ప్రాంతాలన్నింటినీ తన ఏలుబడిలోకి తెచ్చిన వీరుడు. 6 దశాబ్దాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. గణపతి దేవుడు అధికారపగ్గాలు చేపట్టక ముందు కొన్నేళ్లు దేవగిరి యాదవుల చేతిలో బందీగా వున్నాడు. ఆ వివరాల్లోకెళ్లి చూస్తే దేవగిరిని ఏలుతున్న యాదవరాజు జైత్రపాలుడు 1195లో కాకతీయ రాజైన రుద్రదేవుని చంపి … గణపతి దేవుడిని బంధించాడు.
ఆ సమయంలో రుద్రదేవుని తమ్ముడైన మహాదేవుడు ఓరుగల్లు ను పాలిస్తున్నాడు. బంధీగా వున్న గణపతి దేవుడిని విడిపించడానికి 1198లో దేవగిరిపై దండెత్తి విజయం సాధించాడు కానీ తన ప్రాణాలను కోల్పోయాడు. అతని మరణానంతరం రాజ్యంలో అరాచకం చెలరేగడం వల్ల అతని కుమారుడైన గణపతి దేవుడు 1198లో పట్టాభిషిక్తుడయ్యాడు.
గణపతిదేవుడు సింహాసనం అధిష్టించిన వెంటనే సేనాధిపతి రేచెర్ల రుద్రుడుతో కలిసి తన శక్తియుక్తులు ధారబోసి అరాచకాలను అణిచివేశాడు. తనదైన పాలనతో పరిస్థితులను చక్కదిద్దాడు. గణపతి దేవుని పాలనలోనే వ్యవసాయం, వర్తకాలు వృద్ధి చెందాయి. గణపతి దేవుడు వాణిజ్య వర్తకాలను ప్రోత్సాహించాడు. మోటుపల్లిలో వేయించిన అభయశాసనం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక కాకతీయ రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. వ్యవసాయాన్ని వృద్ధిచేయడానికి, నీటీపారుదల సదుపాయాలు కల్పించడానికి ఇతని సేనాని ‘‘పాకాల’’ చెరువును కట్టించాడు. అలాగే మరో సైనాని కూడా గౌండ సముద్రాన్ని నిర్మించాడు. ఇలా గణపతిదేవుడు ప్రజల ఆధారాభిమానాలు సంపాదించాడు.
ఇక రాజ్యవిస్తరణకు మరింత కృషి చేసాడు. సైనికబలాన్ని పెంచుకున్నాడు. సరిహద్దు రాజ్యాల రాజ కుటుంబాలతో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు. 1201లో మొదటి దండ్రయాత్రలో బెజవాడను స్వాధీనం చేసుకున్నాడు. అక్కడి నుంచి తిరిగి ‘అయ్య’వంశానికి చెందిన పినచోడి పాలిస్తున్న దివిసీమ పై దృష్టి సారించాడు. ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మళ్ళీ పినచోడికే రాజ్యాన్ని ఇచ్చేసాడు. పినచోడి కుమార్తెలను నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. ఎక్కడికక్కడ బలాన్ని పెంచుకునే వ్యూహాలను అనుసరించి 1212లో తూర్పుతీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి, గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు. క్రీ.శ.1248లో నెల్లూరుని పాలించే చోడ తిక్కన మరణించాడు.
ఇతడి కుమారుడైన రెండో మనుమసిద్ధి(వీరగండ గోపాలుడు), అతడి దాయాది విజయగండ గోపాలుడి మధ్య రాజ్యం కోసం తగాదాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో రెండో మనుమసిద్ధి గణపతిదేవుడి సహాయం కోరాడు. మహాకవి తిక్కన సోమయాజితో రాయబారం పంపాడు. దీంతో గణపతిదేవుడు సామంత భోజుని నాయకత్వంలో తన సైన్యాన్ని పంపాడు. ఆ తర్వాత గణపతి దేవుడు స్వయంగా నెల్లూరు వెళ్లి మనుమసిద్ధిని సింహాసనంపై అధిష్టింపజేశాడు. కొంత కాలం తర్వాత కాకతీయ సైన్యం ద్రావిడ మండలంలో ప్రవేశించింది. పళైయూరు(తంజావూరు జిల్లా) యుద్ధంలో విజయగండ గోపాలుడిని, కర్ణాటక సైన్యాన్ని ఓడించింది. ఈ విజయాలతో కాకతీయ సామ్రాజ్యం దక్షిణదేశంలో కాంచీపురం వరకు విస్తరించింది.
క్రీ.శ.1263లో జరిగిన ముత్తుకూరు యుద్ధం మినహా తన జీవిత కాలంలో గణపతిదేవుడు ఏనాడు అపజయం పొందలేదు. ఇక గణపతి దేవుడు కవిపండిత పోషకుడు. ఈయన ఆస్థానంలో అనేక మంది విద్యాంసులు ఉండేవారు. ఈయన సేనాని జాయప కళావేత్త. గీత రత్నావళి, వాద్య రత్నావళి, నృత్యరత్నావళి అనే సుప్రసిద్ధ గ్రంధాలను ఆయనే రచించాడు.
photo courtesy …. photoartinc.com/