తర్జని కథల పోటీ లో ఎంపికైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ !

Sharing is Caring...

‘ట్వియ్.. ట్వియ్.. ట్వియ్..’మంటూ సౌండ్ వస్తోంది, ఆ అమ్మాయి మొబైల్‌లో నెంబర్ డైల్ చేస్తుంటే. అప్పటికి తొమ్మిది అంకెలు డయల్ చేసింది. పదో అంకె దగ్గర బొటన వేలు గాలిలోనే ఆపి స్నేహితురాలి వైపు చూసింది. ఆ స్నేహితురాలు ఆ అమ్మాయి కళ్లలోకి బితుకు, బితుకుమంటూ చూసింది.

స్నేహితురాలి నుంచి జవాబు రాకపోయేసరికి, ఆ అమ్మాయి పదో అంకె నొక్కకుండా.. ఫోన్ పక్కన పెట్టేసింది. ఎండాకాలం మధ్యాహ్నం ఆ అపార్ట్‌మెంట్ ఆవరణలో భయంకరమైన నిశ్శబ్దం నెలకొని ఉంది. ఆ అమ్మాయిలు ఊపిరి తీసుంటున్న శబ్దం వారికే వినిపిస్తోంది. కాసేపాగి ‘‘చేద్దామా?’’ అంది స్నేహితురాలు, చాలా నెమ్మదిగా.

ఆ నెంబర్ డయల్ చేయాలంటే ఇద్దరికీ చేతులు వణుకుతున్నాయ్, గొంతులు తడారిపోతున్నాయ్. ఆ అమ్మాయి ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఇంతలో హఠాత్తుగా ఓ కాకి రెక్కలు అల్లాడిస్తూ వేగంగా వచ్చి వాళ్లకి ఎదురుగా వున్న ఓ పోల్‌పై విసురుగా వాలింది. స్నేహితురాళ్లిద్దరూ ఒక్కసారి కంగారుపడ్డారు.ఆ అమ్మాయి ఫోన్ అన్ లాక్ చేసి నెంబర్ డయల్ చేయసాగింది. పదంకెల మొబైల్ నెంబర్లో రెండు అంకెలు డయల్ చేసేసరికి.. ఆ కాకి ‘కావ్.. కావ్’ అంటూ కర్ణ కఠోరంగా అరిచి, రివ్వున ఎగుర్తూ వారికి దగ్గర్లోని గోడపైన వాలింది.

భయంతో ఆ అమ్మాయి చేతిలోని ఫోన్ జారవిడిచేసింది. ఇద్దరూ ఆ కాకివైపు చూశారు. అది ఆయాసపడుతున్నట్టు నోరు తెరుచుకుని వీరినే చూస్తోంది. నల్లటి ఆ కాకి నోరు రక్తం ఓడుతున్నట్టు ఎర్రగా వుంది.స్నేహితురాళ్లిద్దరినీ ఒక్కసారిగా భయం ఆవహించింది. ఇద్దరూ ఒకరి చేతినొకరు గట్టిగా పట్టుకున్నారు. భయం.. భయంగా లేచి నిలబడ్డారిద్దరూ. వెంటనే కాకి రివ్వున ఎటో ఎగిరిపోయింది. ఆ పిల్లల కళ్లల్లో ఒక్కసారి మృత్యుభీతి కదలాడింది.

* * *
ఆ పిల్లలిద్దర్నే కాదు, ఆ అపార్ట్‌మెంట్‌లోని చాలామందిని చావు భయం వెంటాడుతోంది. అందుకు కారణం నాలుగు రోజుల క్రితం జరిగిన వాళ్ల మరో స్నేహితురాలి బర్త్ డే పార్టీయే.బర్త్ డే పార్టీ అనంతరం స్నేహితులందరినీ సాగనంపడానికి తన ఫ్లాట్ నుంచి హుషారుగా కిందకు వచ్చింది ఆ పిల్ల. మాటల్లో స్నేహితుల మధ్య వాట్సప్ మెసేజ్ ప్రస్తావన వచ్చింది. చాలామంది అది ఫేక్ అన్నారు. కొంతమంది నిజమేనేమో అన్నారు. ‘అలా ఎలా జరుగుతుంద’ని వారిలో వారు తర్కించుకున్నారు.

ఒకడు హీరోలా ముందుకు వచ్చి ‘దాని సంగతి నేను తేల్చెస్తా’ అన్నాడు ఫోన్‌లో ఏవో నెంబర్లు నొక్కుతూ. అందరూ ‘వద్దురా’ అని అడ్డుకున్నారు. అప్పటికే అర్థరాత్రి దాటి చాలాసేపయింది. చివరికి ‘బర్త్ డే బేబీకి’ బాయ్ చెప్పి, పిల్లలందరూ ఇంటిముఖం పట్టారు. ‘బర్త్ డే బేబీ’ కూడా ఫోన్ చూసుకుంటూ లిఫ్ట్ వరకూ వెళ్లింది. లిఫ్ట్ వచ్చేలోగా వాట్సప్‌లోని ఆ మెసేజ్‌ని మళ్లీ చూసింది. తన ధైర్యాన్ని చాటుకోవాలనే ఉబలాటంతో, అందులోని నెంబర్‌కు డయల్ చేస్తూ లిఫ్ట్‌లోకి వెళ్లింది. అంత రాత్రి వేళ ‘కావ్.. కావ్’ మంటూ కాకి అరుపు వినిపించడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది.

* * *
స్నేహితులను సాగనంపడానికి వెళ్లిన పిల్ల ఇంకా రాలేదేంటాని వాళ్లమ్మ బాల్కనీలోంచి చూసింది. కింద ఎవరూ కనిపించలేదు. ఎందుకో ఆవిడ మనసు కీడు శంకించింది. ఆమె వెళ్లి వాళ్లాయనను తీసుకుని బయటకు వచ్చింది. భార్యా భర్తలిద్దరూ లిఫ్ట్ దగ్గరకొచ్చి బటన్ నొక్కారు. లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ డోర్లు తెరుచుకోగానే, లోపలకు వెళ్లబోయిన దంపతులిద్దరూ ఒక్కసారిగా గావుకేకలు పెట్టారు. అందుకు కారణం లిఫ్ట్‌లో వాళ్లమ్మాయి స్పృహ లేకుండా పడి వుంది. హడావిడిగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆ అమ్మాయి చనిపోయిందని డాక్టర్లు తేల్చేశారు. కానీ, కారణమేంటో డాక్టర్లకు సైతం అంతుచిక్కలేదు.
* * *
‘ఎండలు మండిపోతుంటే, ఎక్కడ పెత్తనాలు చేస్తున్నారు. తిండి తినరా?’’ అని స్నేహితురాలి తల్లి కేకలు వేయడంతో, ఆ అమ్మాయి ‘బాయ్’ చెప్పేసి ఇంటికి వెళ్లిపోయింది. భోజనం చేసి, భయాందోళనల నుంచి తప్పించుకోవడానికి నిద్రను ఆశ్రయించింది. అప్పటికి ఆ అమ్మాయికి తెలీదు, సాయంత్రం తాను లేచేసరికి తన కోసం మరో విషాద వార్త సిద్ధంగా ఉంటుందని.
* * *
‘ఏం చేస్తున్నారే, ఇంత ఎండలో కిందకెళ్లి..’’ స్నేహితురాలి తల్లి నిలదీసింది.
‘‘ఏం లేదు’’ అని ఆగి, ‘‘వాట్సప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. దాన్లోని నెంబర్‌కి కాల్ చేయడం వల్లే బర్త్ డే నాడు మా ఫ్రెండ్ చనిపోయిందని అందరం అనుకుంటున్నాం. దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నాం’’ అంది. లోపలి నుంచి ఆ మాటలు విన్న తండ్రి కోపంగా ‘‘నాన్సెన్స్.. నెంబర్‌ డయల్ చేస్తే చనిపోవడం ఏంటి? పిచ్చా? ఏదా నెంబర్..’’ అని అడిగి తీసుకున్నాడు.

ఆయన తన ఫోన్ నుంచి ఆ నెంబర్ డయల్ చేస్తుండగా, బాల్కనీలోంచి కాకి అరుపు వినిపించింది. ఆ పిల్ల భయంతో బిర్రబిగుసుకుపోయి తండ్రి ముఖంలోకే చూస్తూ నుంచుంది. ఆయన చెవి దగ్గర పెట్టుకున్న ఫోన్ తీసి, అందులోకి చూస్తూ..
‘‘ఎవరూ ఎత్తడం లేదు. దీని సంగతి నేను చూస్తాగానీ, మీరిలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి చదువుకోండి’’ అని ఆయన హాలులోకి వెళ్లి టీవీ ముందు కూర్చున్నాడు. అంతే, ఆ తర్వాత ఆయన అక్కడ్నించి ఇక లేవలేదు.
* * *
స్నేహితురాలి తండ్రి కూడా చనిపోవడంతో ఆ అమ్మాయే కాదు, అపార్ట్‌మెంట్‌లోని వారందరూ భయంతో కంపించారు. వెంటనే పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. ‘98xxx0xx79 అనే నెంబర్‌ నుంచి ఫోన్ వస్తే ఎత్తొద్దని, ఆ నెంబర్‌కు ఫోన్ చేయొద్దని.. అలా చేస్తే అదే వారికి లాస్ట్ కాల్ అవుతుందని, వాళ్లందరూ చనిపోతార’న్నది ఆ వాట్సప్ మెసేజ్ సారాంశం. విచారణ కోసం అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఎస్ఐ ఆ మెసేజ్‌లోని నెంబర్‌ను కంట్రోల్ రూమ్‌కు, టెక్నికల్ టీంకు ఫార్వర్డ్ చేశాడు. ఎన్నో భయంకరమైన నేరాలను శోధించి, సాధించిన ఆ ఎస్ఐ నిర్భయంగా తన ఫోన్ నుంచి ఆ నెంబర్‌ డయల్ చేయసాగాడు.

వెంటనే ఎక్కడ్నించో ఓ కాకి ‘కావ్.. కావ్’మని అరుస్తూ గోడపై వాలింది. అప్పటికే ఎస్ఐ తొమ్మిది అంకెలను డయల్ చేసేశాడు. కాకి మళ్లీ గట్టిగా ‘కావ్.. కావ్’మని అరుస్తూ అతడి తల మీదుగా ఎగిరింది. దాంతో కాకిని తోలడానికి చేయి విదిలించాడతను. ఆ సందర్భంలో అనుకోకుండా పదో అంకె కూడా డయల్ అయిపోయింది.

చేయి విదిలించడంలో పొరపాటున ఫోన్ జారిపోయింది. కింద పడుతున్న ఫోన్‌ను గబుక్కున అందుకోబోయి ఎస్ఐ కూడా ఆ అపార్ట్‌మెంట్ పదమూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. నెత్తుటి ముద్దలా మారిని ఎస్ఐని చూసేసరికి, అపార్ట్‌మెంట్ వాసుల్లోని ముఖాల్లో నెత్తురు ఇంకిపోయింది. ఆ పక్కనే కరెంట్ తీగపై వాలిన కాకి ముక్కుతో కాలిని గోక్కుంటూ ‘కావ్.. కావ్’మని మూల్గటం ఎవరికీ వినిపించలేదు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!