దినేష్ ఆ రోజు రాత్రి ఒంటరిగా మార్చురీ రూమ్ లోకి ప్రవేశించాడు.టైమ్ చూసాడు.పన్నెండు దాటుతోంది. అతడు ఒకసారి గదినంతా నిశితంగా పరిశీలించాడు.గదిలో చాలా ప్రశాంతంగా వుంది.ప్రాణంలేని ఎన్నో విగత జీవులమధ్య తనొక్కడే ప్రాణమున్న జీవి!
ఆ ఊహకి ఎందుకో అతనికి నవ్వొచ్చింది. మనిషి జీవితం శాశ్వతం కాదు. ‘జాతస్య మరణం ధృవం’ పుట్టినవానికి మరణం, మరణించినవానికి జన్మం తప్పదు. గీతలోని వాక్యాలు గుర్తొచ్చి కాసేపు మనసు భారమయ్యింది దినేష్ కి. వెంటనే తేరుకొని ఈ లోకంతో తమ కేమీ సంబంధం లేనట్లు తెల్లటి ముసుగుల్లో, శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్న డెడ్ బాడీసున్న ఒకో బెడ్ని మెల్లగా దాటుకుంటూ, మెడికో దినేష్ చక చకా ముందుకి సాగిపోసాగాడు.
అతని మనసు చాలా నిర్మలంగా వుంది.భవబంధాలను తెంచుకొని విగత జీవులుగా వున్న ఆ గది వాతావరణంలో అతని మనసు కాసేపు వైరాగ్యంలో కొట్టుమిట్టాడింది. నడుస్తూనే ఆలోచించసాగాడు దినేష్.అది ఒక ప్రముఖ నగరంలో గల మెడికల్ కాలేజ్. అమ్మాయిలు, అబ్బాయిలు జూ.డాక్టర్లుగా విద్య నభ్యసించి తమ బంగారు భవిష్యత్ కి బాటలు వేసుకొనే కళాశాలది.అందులో మెడికోలకి ప్రొఫెసర్ గా ఉంటున్న డా.కులకర్ణికి బెట్ లంటే పంచ ప్రాణాలు.
ఒకరోజు ఆయన లీజర్ పీరియడ్లో తన స్టూడెంట్స్ తో ఏదో విషయమై చర్చించసాగాడు. క్రమంగా వారి చర్చ మార్చురీ పైకి మళ్లింది.“రాత్రిపూట శవాల గది అయిన మార్చురీకి వెళ్లి, అక్కడ ఒంటరిగా సంచరించడమంటే మాటలు కాదు. అందుకు చాలా ధైర్య సాహసాలు కావాలి. అలా మీలో ఎవరైనా అక్కడకి ఒంటరిగా వెళ్లి ధైర్యంగా తిరిగి రాగలిగేవాళ్లున్నారా?” అన్నారు డా.కులకర్ణి.
ఎవ్వరూ సమాధానం చెప్పక పోయేసరికి మళ్ళీ ఆయనే, “డియర్ స్టూడెంట్స్! ఎప్పుడూ చదువులేనా? పుస్తకాలతో కుస్తీ పట్టడమేనా? రిక్రియేషన్ కావాలి. మధ్య మధ్యలో మైండ్ రెఫ్రెషెమెంట్ ఉండాలి. అంటే ఇలాంటి చిన్న చిన్న సాహసాలు చేస్తుండాలి. లైఫ్ లో థ్రిల్ అనుభవించాలి. ఇది కూడా అలాంటిదే! జస్ట్ ఫర్ ఫన్! అందరం కలిసి సరదాగా చిన్న బెట్ వేసుకుందాం.
నేను చెప్పినట్టుగా మీలో ఎవరైనా రాత్రి పన్నెండు దాటాక మార్చురీ రూమ్ లోకి వెళ్ళి, ధైర్యంగా తిరిగొస్తే వారిని విజేతగా ప్రకటించి, వారికి ఫైవ్ థౌసండ్ లిటిల్ కేష్ ఇస్తాను. అలా కాకుండా భయపడి వెనక్కి తిరిగొచ్చిన వాళ్ళు, తమ ఓటమిని ఒప్పుకొని ఆ మొత్తం నాకివ్వాలి. మీలో ధైర్య సాహసాలున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుకి రావచ్చును” అన్నారు మెడికోలను ఉద్దేశించి నవ్వుతూ.
ఆయన మాటలు విని మెడికల్ స్టూడెంట్సంతా మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే మొదటిది.. ఇది రిస్క్ తో కూడుకున్నది. అలా చేయడానికి చాలా ధైర్య సాహసాలుండాలి. రెండవది.. వారందరికీ డా.కులకర్ణి ప్రతిభా పాటవాలు గురించి బాగా తెలుసు. గతంలో కూడా ఆయన ఈ విధంగా పందాలు కాచి గెలిచి, తోటి మెడికోలు నుండి బాగా డబ్బులు గుంజిన దాఖలాలున్నాయి. తెలిసి తెలిసీ కొరివితో తల గోక్కోవటమెందుకని అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ గప్ చుప్ గా ఉండిపోయారు. వారు సైలెంట్ అయిపోవడం చూసి డా.కులకర్ణి ఫక్కున నవ్వాడు.
“హౌ షేమ్? నన్ ఆఫ్ యూ ఆర్ సచ్ ఏన్ ఎడ్వెంచరర్? నన్ ఆఫ్ యూ ఆర్ సో బ్రేవ్? మీలో ఒక్కరు… ఒక్కరు కూడా అలాంటి సాహసిలేరా? ధైర్యవంతులు లేరా?” అని వాళ్ళని రెచ్చగొడుతూ మాట్లాడేసరికి, ఆ సంవత్సరమే ఆ కాలేజీలో కొత్తగా జాయినయ్యిన మెడికో దినేష్ మాత్రం, డా.కులకర్ణి సవాల్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. ఆయనతో బెట్ కట్టడానికి రెడీ అయ్యాడు.
”శభాష్! మై డియర్ బ్రేవ్ బోయ్!” అంటూ డా.కులకర్ణి దినేష్ తో కరచాలనం చేసాడు. వారిద్దరూ అందరి సమక్షంలో తమ పోటీని ఖరారు చేసుకొన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆ రోజు రానే వచ్చింది.దినేష్ ఆలోచనలు సాగుతున్నాయి.తను డా.కులకర్ణి తో బెట్ కట్టింది కేవలం కేష్ కోసం మాత్రమే కాదు. ఆయనకి తనని ఎవ్వరూ, ఎలాంటి పందెం లోనూ ఓడించలేరని మితిమీరిన అహంకారం, గర్వం! అలాంటి అహంభావికి గట్టిగా బుద్ధి చెప్పటానికే తనీ రిస్క్ తీసుకున్నాడు.
దినేష్ నడుస్తూ ఒక్కొక్క బెడ్ని దాటుకుంటూ దాదాపుగా అన్ని బెడ్స్ దాటాడు.ఇంకాసేపట్లో విజయాన్ని వరించబోతున్నాడు. సంతోషంతో అతని మనసు ఊయలలూగసాగింది.ఇంకా ఒకే ఒక బెడ్ మిగిలి వుంది.దాన్ని కూడా తను దాటి వెళ్ళిపోతే తను విన్ అయిపోయినట్టే! విజయం తనని వరించినట్టే… అతడు ఆ బెడ్ దగ్గరగా వచ్చాడు. ఎందుకో అటువైపు చూడ కూడదనుకుంటూనే చూసాడు. అప్పటివరకు లేని పిరికితనం, భయం ఒకేసారి అతని మనసులో ప్రవేశించాయి.
అతడు ఆ బెడ్ దగ్గరికి పూర్తిగా చేరాక, దాన్ని దాటిపోయే చివరి క్షణంలో…సరిగ్గా ఆ చివరి క్షణంలో…
ముసుగుతో పాటూ ఆ బెడ్ మీద పడుకున్న శవం ఒక్కసారిగా పైకి లేచి కూర్చొని, మెడికో దినేష్ కేసి తల తిప్పి చూడసాగింది. అంతే! ఊహించని హఠాత్పరిణామానికి అతని గుండె గుభేల్మంది. శరీరం జలదరించింది. ఒళ్ళంతా ముచ్చెమట్లు పట్టాయి. ఒంటి మీద రోమాలు నిక్కబొడిచాయి. జరిగింది అర్ధమయ్యేసరికి అతని మెదడు మొద్దుబారి పోయింది.
అంతే! రెప్పపాటు కాలంలో మెడికో దినేష్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. గుండె ఆగిపోయింది! అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.. విగత జీవులమధ్య తనూ విగత జీవయ్యాడు మెడికో దినేష్!! డా.కులకర్ణి పోటీలో విజయం సాధించాడు. కానీ చట్టం దృష్టిలో అతడు పూర్తిగా ఓడిపోయాడు.నేరస్తుడయ్యాడు!
మెడికో దినేష్ పై ఎలాగైనా విజయం సాధించటం కోసం తనే శవంలా నటించి, ముసుగు కప్పుకొని బెడ్ పై పడుకొని, దినేష్ని భయపెట్టి విజయం సాధించాలనుకున్నాడు. కేవలం అతనిని భయపెట్టాలని మాత్రమే అలా చేసాడు. కానీ ఆయన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టి, దినేష్ భయకంపితుడై, అతని ప్రాణాలు పోయేంతవరకూ వస్తుందని ప్రొఫెసర్ కులకర్ణి కలలో కూడా ఉహించి వుండడు.