వాచ్ మాన్ కనిపించిన దృశ్యాన్ని చూసి కంగారుగా పోలీసులకు ఫోన్ చేసాడు.హాల్లో టేబిల్ పైన మందు సీసాలు, గ్లాసులూ, జీడిపప్పు ప్లేట్ , శివరాం టేబిల్ పైకి వాలి విగత జీవిగా కనబడ్డాడు, అక్కడకు చేరిన పోలీసులకు. “శవాన్ని మొదట చూసినదెవరూ?” అని ప్రశ్నించిన ఇనస్పెక్టర్ కు తనేనంటూ కన్నీళ్ళతో చెప్పాడు వాచ్ మన్.
“ఏం జరిగింది? ఎప్పుడు?” గద్దింపుగా అడిగిన ఇనస్పెక్టర్ మాటలతో అరికాళ్ళలో వణుకుపుట్టింది వాచ్ మన్ కు.
“అప్పుడప్పుడు ఆనంద్ బాబు, అయ్యగోరు ఈడ కూకోని మందేసుకుంటా మాటాడతారండి. సాయంత్రం అట్టానే యియన్నీ తెమ్మంటేతెచ్చేనండి. మా సిన్నోడికి జొరం, వాంతులు, సొమ్మసిల్లిపోనాడు” అని మా ఇంటిది ఏడుత్తా ఫోన్ సేసిందయ్య.
“రెండేలిచ్చిపిల్లగాడిని డాట్రు కాడికి తీసుకుపోయి సూపీమనీ, ఇంటికాడే ఉండమనీ సెప్పేరయ్య.
టిఫిన్, గట్రా తేవాలని పొద్దున్నే వచ్చేసానండి, తలుపులు సేరేసున్నాయ్, అయ్యగారేమో ఇలా ” గొల్లుమన్నాడు.
“మీ అయ్యగారు ఎలాటివారు?”
“దేవుడేనయ్యా”
“ఆనంద్ ను రమ్మను, ఇంకేం చెప్పకు ” ఇనస్పెక్టర్ కు అనుమానించ తగినవేమీ కనబడలేదు, ఫారెన్సిక్ టీం, వేలి ముద్రల నిపుణులూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. శివరాం ఒంటి మీద గాయాలు కానీ, పెనుగులాడిన దాఖలాలు కానీ లేవు. ఇనస్పెక్టర్ కు హతుడు గుండె ఆగి మరణించాడేమోఅన్న సందేహం కలిగింది. కానీ గదిలో ఏర్పాట్లు, ఇంకో వ్యక్తి ఉన్నారనిపిస్తోంది.
***
“ అదిగో ఆనంద్ బాబొచ్చేసాడు. బాబూ! అయగారు ” గొల్లుమన్నాడు.
“శివరాం కి ఏమైంది? ” కంగారుగా అడిగాడు శవం దగ్గరగా వెళ్ళబోతూ.
“మిస్టర్ ఆనంద్ .. వెళ్ళకండి, ఆధారాలు చెరిగిపోతాయి, రాత్రి ఇక్కడకు వస్తానన్నారట, వచ్చారా!”
“లేదు సర్, పిల్లలు గొడవచేస్తే సినిమాకు వెళ్ళాము, రాలేకపోయాను “
“ఆ విషయం శివరాంకు చెప్పారా!”
“ఆ! ఫోన్ చేసాడు, స్కాచ్ తెమ్మని. ఇలా సినిమాకు వెడుతున్నానని చెబితే, ‘ రెండు రోజులుంటా, కలుద్దాం, ఎంజాయ్’ అని ఫోన్పెట్టేసాడు. కానీ… ” బాధగా అన్నాడు.
“మీరు రాలేదంటారు?” అనుమానంగా అడిగాడు.
“వచ్చి ఉంటే సమయానికి ఆసుపత్రికి తీసికెళితే, బ్రతికి ఉండేవాడు కదా! “
” అదేమిటీ! ఎలా చనిపోయారో తెలిసినట్టే మాట్లాడుతున్నారు? “
“సాధారణంగా గుండె పోటే అయి ఉంటుంది కదా!” తడబడ్డట్టు అనిపించింది..
” సినిమాకు వెళ్ళినట్టు ఋజువు చేయగలరా! ” అడిగాడు.
“నా మీద అనుమానమా! అంత అవసరం నాకేమిటి సర్, ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా” మొబైల్ తీసి చూపెట్టాడు.
“టికెట్ తీసినంత మాత్రాన వెళ్ళినట్టు కాదు. సరే! ఊరు వదిలి వెళ్ళకూడదు, మీ అడ్రెస్, ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళండి” .. ఆ సినిమా హాల్లో సి.సి.టీ.వి పుటేజ్ మొత్తం చూసి అతను చివరిదాకా అక్కడే ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. శవ పరీక్ష ఫలితాలు వచ్చేసాయి, ఆర్సినిక్ , రాత్రి ఎనిమిదిన్నరకు చనిపోయాడు. ఇంట్లోకి వాచ్ మన్ తప్ప ఎవరూ వెళ్ళలేదు, అన్ని వస్తువులూ పరీక్షించేరు. దొరకలేదు. వాచ్ మన్ ని కష్టడీ లోకి తీసుకున్నారు. విచారణలో వాచ్ మన్ కథనం నిజమే అని తేలింది, వదిలేసారు.
ఫ్రిజ్ డోర్ మీద శివరాం వేలిముద్రలతో బాటు లెదర్ గ్లవ్స్ వాడిన ఆనమాళ్ళు ఉన్నాయి. గ్లవ్స్ వాడి తినే ఐటంస్ విషమయం చేసారా! కానీ ఎందులోనూ విషం కలవలేదు. మరి .. ఇనస్పెక్టర్ కి పిచ్చెక్కినట్లుంది. సీ.సీ పుటేజ్ అంతా చూసారు, ఏ ఆధారం దొరకలేదు. మర్నాడు శివరాం కొంటానన్నస్థలం యజమాని చెప్పిన విషయం ‘అడ్వాన్స్ గా పది లక్షలు ఇవ్వాల్సి ఉందని’.ఆ కోణంలో పరిశోధన మొదలయింది.
కారులో,ఇంట్లో డబ్బు దొరకలేదు.ఖాతానుంచి ఆ రోజు పదిహేను లక్షలు తీసినట్టుతెలుస్తోంది. ఆ డబ్బు ఏమైంది? అనుమానం ఆనంద్ చుట్టే తిరుగుతోంది. ఇద్దరూ వ్యాపార భాగస్వాములు, వ్యాపారంలో నష్టానికి ఆనంద్ నిర్లక్ష్యం, వ్యసనాలేకారణం. దాని గురించే గొడవపడ్డ విషయం విచారణలో తేలింది. అతనే హంతకుడు అనిపిస్తోంది, కానీ సాక్షాలు లేవు, ఎలా నిరూపించడం? ఇనస్పెక్టర్ మరోసారి హత్యాస్థలాన్ని చూడవచ్చాడు . అణువణువూ చూసి యథాలాపంగా వెనక వైపు వచ్చాడు. జాగ్రత్తగా చూస్తున్నఅతనికి గోడ దగ్గర షూ ముద్రలు కనబడ్డాయి. హంతకుడు వెనక వైపు వచ్చాడు. షూ ముద్రలు అన్ని కోణాల్లోంచీ ఫోటోస్ తీసాడు. ఆలోచిస్తూ తిరుగుతున్న అతనికి చెత్తబుట్ట కనబడింది. చెత్తేం లేదు, వాడి పడేసిన రెండు వస్తువులు తప్ప.
ఇంట్లోకి ఎవరో వచ్చారు. వచ్చి ఏం చేసారు? హతుడి వంట్లోకి ఆర్సెనిక్ ఎలా చేరింది? ఆలోచనలతో అతను ఇల్లు చేరి, ఫ్రెషప్ అయి భోజనానికి వచ్చాడు.
“ఏమిటీ ఆలోచిస్తున్నారు? క్లూస్ దొరకలేదా? ఇదిగో! మర్చిపోతే ఎలా? ” ఎదురుగా పెట్టిన ఆ వస్తువులు చూడగానే ఒక్కసారిగామెదడులో మెరుపు మెరిసింది. ‘ఇప్పుడే వస్తా’ పావుగంటలో హత్యాస్థలాన్ని చేరాడు. చెత్తబుట్ట నుంచి ఆ వస్తువులను జాగ్రత్తగా తాకకుండా తీసి కవర్లో వేసి టెస్టింగ్ లాబ్ లో ఇచ్చేసాడు. రిపోర్ట్ త్వరగా కావాలనిచెప్పాడు. ఆ షూ సోల్ ఏ కంపెనీది? హతుడి పరిచయస్తుల్లో దానిని వాడేదెవరు? ఆర్సెనిక్ కొన్నవారెవరూ? రహస్య దర్యాప్తు సాగింది. రెండూ ఆనంద్ దగ్గరకొచ్చి ఆగాయి..
రిపోర్ట్స్ వచ్చాయి. ఇన్స్యులిన్ సీసా ద్వారానే విషం హతుని ఒంట్లో చేరింది. సీసాలో ఆఖరి డోస్ వలన అది ఇంజెక్ట్ చేసుకుని డస్ట్బిన్ లో పడేసాడు. మరో పావుగంటకి చనిపోయాడు. చాలా తెలివిగా ప్లాన్ చేసిన పెర్ఫెక్ట్ మర్డర్. ఆనంద్ ని అదుపులోకి తీసుకుని, ఇల్లు సోదా చేస్తే రహస్య స్థలంలో పదిహేను లక్షలూ దొరికాయి. పోలీసుల లాఠీదెబ్బలు జరిగిన విషయాన్ని కక్కించాయి.
“వ్యాపారాలనుంచి తొలగించాడన్న అక్కసుతో, అప్పుగా ఇస్తానన్న ఐదు లక్షలతో బాటు, స్థలం కొనుగోలు కోసం తెచ్చిన పదిలక్షలూ కాజేయాలన్న దుర్బుద్ధితో నేనే ఆ ఇన్స్యులిన్లో ఆర్సెనిక్ కలిపి అతని మరణానికి కారణం అయ్యాను.” భోరుమన్నాడు ఆనంద్.