అటెన్ బరో ఇరవైఏళ్ళ కృషి ఫలితమే ఆసినిమా !

Sharing is Caring...

అహింసా సిద్ధాంతంతో  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గాంధీజీ కి సినిమాల మీద సదభిప్రాయం లేదు.. ఆయనెపుడూ సినిమాలపట్ల ఆసక్తి చూపలేదు. గాంధీ జీవితం మొత్తం మీద రెండు సినిమాలు మాత్రమే చూసారు. వాటిలో ఒకటి ఇంగ్లీష్ ..మరొకటి హిందీ.1943లో విజయభట్ తీసిన  రామరాజ్య (హిందీ ) ఒకటి కాగా రష్యన్ సినిమా మిషన్ టు మాస్కో(ఇంగ్లిష్ ) రెండోది.

ఆ రెండు సినిమాలను కూడా ఆయన పూర్తిగా చూడలేదట. దేశమంతా చూసిన రాజా హరిశ్చంద్ర సినిమా గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదు.సినిమా వల్ల ఏమి మేలు జరుగుతుందో చెప్పలేను… చాలా సినిమాలు నాసిరకం భావాలు కలిగి ఉంటాయనే అర్ధం స్ఫురించేలా సినిమా పై తన అభిప్రాయాన్ని హరిజన్ పత్రికలో గాంధీ  రాశారు.

1931లో 2వ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి లండన్ వెళ్లినప్పుడు గాంధీజీ చాప్లిన్‌ను కలిశారు. చాప్లిన్ అప్పటికే పెద్ద నటుడు. గాంధీ చాప్లిన్‌తో యంత్రాల గురించి మాట్లాడారు.‘యంత్రాలనేవి మనిషి శ్రమను తగ్గించాలి. బానిసత్వం నుంచి విముక్తం చేయాలి. వారిని పని నుంచి తొలగించే, మరింత పని కల్పించే భూతాలు కారాదు’ అని అభిప్రాయపడ్డారు. గాంధీ ఆలోచనకు చాప్లిన్‌ ఇచ్చిన తెర రూపమే ‘మోడరన్‌ టైమ్స్‌’ సినిమా. 

అదలా ఉంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దరిమిలా  గాంధీజీ గురించి  సినిమా తీయాలని అప్పటి ప్రధాని నెహ్రు ఆశించారు. 1952 లో గాబ్రియేల్ ఫాస్కల్ అనే దర్శకుడు గాంధీ బయో పిక్ తీసేందుకు నెహ్రు తో మాట్లాడారు.ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

అయితే సినిమా ప్రారంభించక ముందే అనారోగ్యంతో ఫాస్కల్ కనుమూశారు. తర్వాత 1958లో డేవిడ్‌ లీన్ అనే దర్శకుడు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. తాను రాసిన స్క్రిప్ట్ నెహ్రు కి చూపారు. అది ఒకే కాలేదు. ది బ్రిడ్జి ఆన్ ది క్వాయి అనే సినిమా తీసి తో లీన్ మంచి పేరు సంపాదించారు. 

1962లో లండన్‌లో స్థిరపడి భారత్ హై కమీషన్ లో పనిచేస్తున్న మోతీలాల్‌ కొఠారి దర్శకుడు అటెన్ బరో ను కల్సి గాంధీ సినిమా నిర్మాణం గురించి మాట్లాడారు. లూయిస్ ఫిషర్ రాసిన గాంధీ జీవిత చరిత్ర  చదివిన పిదప అటెన్ బరో ఒకే అన్నారు. ఇండియా కొచ్చి నెహ్రు ..ఇందిరా గాంధీలను కలిసాడు. అప్పటినుంచి దాదాపు 20 ఏళ్ళు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి 80 నవంబర్ లో షూటింగ్ మొదలు పెట్టారు.

81 మే నాటికి షూటింగ్ ముగిసింది. ఈ మధ్య కాలంలో ఎన్నో అవాంతరాలు ఏర్పడ్డాయి. కొఠారి ,నెహ్రు చనిపోయారు. నిధుల సమస్య ఎదుర్కొన్నాడు. ఇందిర పూనుకుని  నేషనల్‌ ఫిలిమ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌  నుంచి నిధులు మంజూరు అయ్యేలా సిఫారసు చేసింది.

ఏ బ్రిటిష్ వారి మీద అయితే గాంధీ పోరాటం చేశారో .. అదే బ్రిటిష్ పౌరులకు గాంధీ సినిమా తీసే అవకాశం లభించింది. దర్శకుడు అటెన్ బరో కాగా గాంధీ పాత్ర పోషించే అదృష్టం బ్రిటిష్‌ నటుడు బెన్‌కింగ్‌స్లేకు దక్కింది. గాంధీ పాత్ర పోషించడానికే బెన్‌కింగ్‌స్లే జన్మించాడా అనే రీతిలో ప్రేక్షకులను తన నటనతో మైమరిపించాడు.

అతని తండ్రి పూర్వీకులు గుజరాత్‌కు చెందినవారే కావడం మరో విశేషం. 1982 నవంబర్‌ 30న విడుదలైన గాంధీ సినిమా ఘనవిజయం సాధించింది. బెన్‌కింగ్‌స్లేను ఆస్కార్‌ అవార్డు వరించింది. మరెన్నోఅవార్డులు ఆ సినిమాకు దక్కాయి. మొత్తం మీద దర్శకుడి 20 ఏళ్ళ కృషికి మంచి ఫలితం లభించింది.

గాంధీ స్వాతంత్య్రోద్యమం తీరు తెన్నులు చూసి బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పట్లో బెంబేలెత్తి పోయింది.. గాంధీని దెబ్బకొట్టాలని గాంధీ పై వ్యతిరేక చిత్రం తీసే ప్రయత్నాలు చేసిందని అంటారు కానీ వాటికి ఆధారాలు లేవు. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!