సుదర్శన్ టి ………..
అతీతశక్తులవల్ల ఎదో అద్భుతం జరుగుతుందని నమ్మిన వారు నిరక్షరాస్యులు మాత్రమే కారు చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.ఇందుకు ఉదాహరణగా మదనపల్లి లో జరిగిన దారుణ ఘటనను చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నతల్లితండ్రులు ఎదిగిన తమ పిల్లలను కర్కశంగా ఎలా చంపారో అర్ధం కాని పరిస్థితి. అదీ మూఢ నమ్మకాలతో పిల్లలను అలా ఎలా చంపగలిగారో ? అందుకు చేతులు ఎలా వచ్చాయో ? మూఢభక్తి తో ఆ వయసులో ఏమి సాధించాలని ఈ అకృత్యానికి ఒడిగట్టారో ?
ఒక కుమార్తెను శూలంతో పొడిచి చంపేశారు. మరో కుమార్తె నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు.ఎంత మూఢ భక్తి అయినా ఇంత అనాగరికంగా చంపుతారా ? పైగా చనిపోయిన కుమార్తెలు మళ్ళీ బతికి వస్తారని పోలీసులకు చెప్పడం ఏమిటో ? పెద్ద చదువులు చదివిన వారిలో కూడా ఇలాంటి మూఢులు ఉంటారా ? లేక వీరికి ఏదైనా మానసిక అస్వస్థత ఉందా ?
ఇక క్వాలిఫికేషన్ సంపాదించుకోవడం, ఎడ్యుకేషన్ రెండూ వేర్వేరు. ఎంత చదువుకున్నోళ్లయినా మానసిక అస్వస్థత విషయంలో దాదాపుగా నిరక్షరాస్యులుగానే ఉన్నారు. జ్వరం, తలనొప్పి అస్వస్థత ఎలాగో మనసుకు సంబందించిన అస్వస్థత కూడా అలాంటిదే అని తెలుసుకోలేకపోవడం ఈ 21వ శతాబ్దంలో ఓ ముఖ్యమైన ప్యాండెమిక్ గా ఉండబోతోంది.
గణాంకాల ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు, ప్రతి 5 మంది మగాళ్లలో ఒకరు జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక అస్వస్థతకు గురవుతున్నారు. కాస్త జోక్ గా చెప్పుకుంటే మనకు ఇటువైపు అటువైపు ఉన్న ఇద్దరు మామూలుగా ఉన్నట్టు కనబడితే ఎవరు మానసికవైద్యున్ని సంప్రదించాలి?
ఈ మానసిక అస్వస్థత ను గుర్తించడం చాలా సులువు. అలా అస్వస్థతకు గురైనప్పుడు మనకే తెలుస్తుంది. అలాగే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడైనా వ్యక్తులను ఓ రెండు నిముషాలు గమనిస్తే మానసిక అస్వస్థతకు గురైనవారు ఎవరో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. సమస్య వైద్య సహాయం తీసుకోవడం/ఇప్పించడంలోనే ఉంది.మానసిక రోగ వైద్యులను సంప్రదించడంలో ఇంకా మన సొసైటీలో చాలా అపోహలు ఉన్నాయి. అలాగే ఒకసారి వైద్య సహాయం పొంది నయమైన వ్యక్తిని సొసైటీ మామూలు మనిషిగా దాదాపుగా గుర్తించకపోవడం ఇంకో సమస్య.జీవిత భాగస్వామి ప్రవర్తన మారితే అన్నీ సర్దుకుంటాయి అనుకోవడం అలాగే తలిదండ్రులు సఖ్యతగా ఉంటే పిల్లల మానసిక సమస్యలు తొలగిపోతాయి అనుకోవడం పొరబాటు. చిన్న, పెద్ద సమస్య ఏదైనా వైద్య సహాయం తీసుకోవడం మాత్రమే సరైన పరిష్కారం.
మానసిక సమస్య ఒక మరక అనే దృక్పథం మారనంత వరకూ ఇలాంటి విషాద ఘటనలు ఆగవు.