‘‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ పోటీ చేస్తా. పోటీకి మీరు సిద్ధమా ?” అంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు విసిరిన సవాల్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో ? అసలు ఈ సవాల్ ఆయన దృష్టికి వెళ్లిందో… లేదో ? కానీ .. పవన్ కళ్యాణ్ స్పందించి సవాల్ కి సై అంటే మళ్ళీ రాజకీయాలు వేడెక్కుతాయి. ఏపీ లో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ప్రశ్నించే నాయకుడు అసెంబ్లీ లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్న అభిమానులు కూడా సంతోషపడతారు.
ఇక వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్ ఎందుకు విసిరారంటే …. ఆయన మాటలలోనే తెలుసుకుందాం. “గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారపేట మండలం సింగరపల్లిలో జనసేన కార్యకర్త ఆత్మహత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయమై వపన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలు, బెదిరింపు హెచ్చరికలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. సీఎం జగన్ ఆమోదంతో పదవికి రాజీనామా చేస్తా. పోటీకి పవన్‌కల్యాణ్ సిద్ధమై … గెలిస్తే న్యాయవ్యవస్థ ముందు లొంగిపోతా. అదే పవన్‌కల్యాణ్ ఓడిపోతే పార్టీని మూసేయాలి .”
“పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా .. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ విమర్శించడం లో అర్థం లేదు. చంద్రబాబు హయాంలో దారుణాలు, ఆకృత్యాలు చోటు చేసుకున్నప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు. వనజాక్షి ఉదంతంలో గానీ, నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నప్పుడు గానీ పవన్ కల్యాణ్ ఎందుకు బయటికి రాలేదు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసిన సమయంలో ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ? తాను ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవిని రాజకీయ గురువుగా గౌరవిస్తా.” అంటున్నారు అన్నా రాంబాబు.
కాగా మూడు,నాలుగు రోజుల క్రితం జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ” ఎమ్మెల్యే ను ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారా ?”అంటూ గట్టిగానే విమర్శించారు. వివిధ రూపాల్లో జనసేన కార్యకర్త ను ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది. ఫలితంగా మా కార్యకర్త వెంగయ్య ఆత్మహత్య చేసుకొన్నారని…అందుకు ప్రేరేపించిన ఎమ్మెల్యే రాంబాబు, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వెంగయ్య కుటుంబాన్ని పవన్ పరామర్శించి మృతుని కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ. 8.50 లక్షలను ఆర్ధిక సాయం కూడా చేశారు. అన్ని విధాలా ఆ కుటంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం వెంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై ఎస్పీకి జనసేన అధినేత ఫిర్యాదు చేశారు.
పవన్ కళ్యాణ్ అటు వెళ్ళాక రాంబాబు స్పందించి పై సవాల్ విసిరారు. మరి పవన్ ఈ సవాల్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.
—————– KNM