Mani Bhushan………………
పూరే పచాస్ హజార్. ఈ మూడు పదాలే 3 గం. 18 ని.ల షోలే సినిమాలో Mac Mohan డైలాగ్. పేజీలకొద్ది డయిలాగ్లు చెప్పిన హేమ మాలిని, ధర్మేంద్ర, అమితాబ్ తదితరుల కంటే మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. షోలే సినిమాలో ‘అరే ఓ సాంబ’ అంటే, ఒక బండరాయి మీద కూర్చున్న బక్క కేరెక్టర్ వేసిన నటుడే మెక్ మోహన్.
విభజనతో పాకిస్థాన్ నుంచి బొంబాయి వచ్చేసిన కుటుంబాల్లో అతనిదికూడా ఒకటి. మొదట్లో క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. అనుకోకుండా సినీ రంగంలోకి వచ్చాడు. ఇంగ్లీషులో అతని పరిజ్ఞానం చూసి దేవానంద్ అన్నయ్య చేతన్ ఆనంద్ చాలా ఇష్టపడి అసిస్టెంట్ డైరెక్టరుగా చేర్చుకున్నాడు.తర్వాత నటన వైపు మళ్లారు.
అన్నట్లు Mac Mohan మంచి డాన్సర్ కూడా .. ఇంతకీ… షోలే సినిమా ప్రివ్యూ షోకి రమేశ్ సిప్పీ పిలిస్తే ‘నాకు సరైన రోల్ ఇవ్వలేదు’ అని అలిగి వెళ్లలేదు. షోలే విడుదలైన వారం పది రోజులకే Mac Mohan ఎక్కడ కనిపించినా ‘అరే ఓ సాంబ’ అని జనం పిలిచేవారట! అంత popular అయ్యాడు.
అసలు ఆ సినిమాలో ప్రతి పాత్ర ముఖ్యమే అనిపిస్తాయి. ఏ ఒక్కటీ వేస్ట్ క్యారక్టర్ కాదు. ధర్మేంద్ర వాటర్ ట్యాంక్ పైకెక్కి సూసయిడ్ అని అరుస్తుంటే… కిందన ‘ఏ సుసయిడ్ సుసయిడ్ క్యా హోతా భాయ్’ అని అడిగేవాడు కూడా ముఖ్య పాత్రధారే అనిపిస్తాడు.
షోలే తర్వాత మోహన్ డాన్ (1978), కర్జ్ (1980) సత్తే పే సత్తా (1982) వంటి చిత్రాలలో ప్రధాన విలన్ అనుచరుడి పాత్రల్లో నటించారు.మోహన్ నటి రవీనా టాండన్ కి మామయ్య అవుతారు.ఆయన 1964లో ‘హకీకత్’ సినిమా ద్వారా నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 2010లో చివరిగా ‘తుమ్ కబ్ జావోగే’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు.
హిందీ సినిమాలతో పాటు, ఆయన భోజ్‌పురి, గుజరాతీ, హర్యాన్వి, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, సింధీ,స్పానిష్ రష్యన్ సినీమాల్లోను నటించాడు.ఏ భాషలోనైనా తన డబ్బింగ్ తానే చెప్పుకునేవాడట.
సుమారు రెండువందల సినిమాల్లో నటించిన మోహన్ 2010 లో లంగ్ క్యాన్సర్ తో కన్నుమూశారు. Mac Mohan కి ఇద్దరు కూతుళ్లు. ఒకరు అయాన్ ముఖర్జీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసి ఇప్పుడు ఏవో ప్రాజెక్టులు చేస్తోంది. మరో కూతురు సినిమా ప్రొడక్షన్ లో ఉంది.