Balachandar mark movie …………
కథా నేపథ్యం మారినప్పటికీ ఇప్పటికి సినిమాను హాయిగా చూడవచ్చు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ అప్పటి కీలక సమస్య నిరుద్యోగం పై సంధించిన అస్త్రమిది. అదే “ఆకలి రాజ్యం”. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం.
నిజ జీవితంలో కనిపించే ఎన్నో పాత్రలు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. మధ్య తరగతి కుటుంబాల్లోని పాత్రల పై బాలచందర్ ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఈ సినిమాలో కూడా అంతే. నిరుద్యోగులైన ముగ్గురు మిత్రుల కథ ఇది.
కమల్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి రూపొందిన ఈ సినిమా తమిళ వెర్షన్ “వరుమైయిన్ నీరం శివప్పు”1980 నవంబర్ 6 న ముందు గా విడుదలయింది. రెండు నెలల తర్వాత తెలుగు సినిమా రిలీజ్ అయింది. తమిళ సినిమాలో కమల హాసన్ అపుడపుడు ‘సుబ్రమణ్య భారతి’ కవితలు వినిపిస్తుంటాడు. అదే తెలుగు వెర్షన్ కొచ్చేసరికి ‘శ్రీ శ్రీ’ కవితలను వినిపిస్తుంటాడు.
‘శ్రీ శ్రీ’ కవితలను ఉపయోగించడంలో మాటల రచయిత గణేష్ పాత్రో సమయస్ఫూర్తి చూపారు. ఇక సినిమాలో హీరో హీరోయిన్ మొదటిసారి బస్స్టాండ్ లో కలిసిన సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీదేవి తండ్రి పాత్ర జూదంలో ఆస్తి తగలేసి పని పాట లేకుండా తిరుగుతూ కనిపించిన వాళ్ళను అప్పులు అడుగుతుంటాడు. తల్లి చనిపోతే ఏడుస్తున్నట్టు నటిస్తూ ఆమె చేతికున్న బంగారు గాజులను కట్ చేసి తీసుకెళతాడు.
కమల్ కి నాటకంలో వేషం ఇప్పించేందుకు వచ్చిన శ్రీదేవిని .. కమల్ అతని మిత్రులు భోజనం చేస్తున్నట్టు నటించే సన్నివేశం హృద్యంగా ఉంటుంది. అలాగే పాస్ పోర్ట్ ఫోటో కోసం చెత్త కుండీ అంతా గాలించే సన్నివేశం … తొంగి చూస్తున్నాడని భావించి ఆర్టిస్టు ను కమల్ కొట్టే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలా సినిమా ఎక్కడా బోర్ లేకుండా బాలచందర్ కథను నడిపించారు.తెలుగులో ఈ సినిమా చాలా చోట్ల 100 రోజులు నడిచింది.
ఈ సినిమా వచ్చిన కొత్తల్లో కమల్ లాగ గడ్డం పెంచి టీ షర్టులు వేసుకుని తిరిగేవారు. అప్పట్లో యువతరం పై అంత ప్రభావం చూపింది. ఇక పాటలన్ని సూపర్ హిట్ మాత్రమే కాదు ఎవర్ గ్రీన్ హిట్ గా చెప్పుకోవాలి.
“సాపాటు ఎటూ లేదూ పాటైనా పాడు బ్రదర్ ” పాట 80 వ శతాబ్దపు పాటగా చరిత్ర కెక్కి పోయింది. ఆత్రేయ రాసిన ఈ పాటలో “స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే ” వంటి చమక్కులు వినిపిస్తాయి.
అలాగే ” కన్నెపిల్లవని … కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ ” పాట కూడా సంగీత ప్రియులను అలరిస్తుంది. ఈ పాట చిత్రీకరణ మనోహరంగా ఉంటుంది. ఇప్పటికి ఈ పాటను రింగ్ టోన్ గా పెట్టుకుని వినేవాళ్లున్నారు.. గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య.. కోపం మనిషికి ఎగ్గయ్య’… ఇవన్నీఆత్రేయ రాసినవే. ‘తూహీ రాజా మేహూ రాణీ’ పాట పీబీ శ్రీనివాస్ రాసారు.
ఎంఎస్ విశ్వనాథన్ మాస్టారు ఈ సినిమాకు అద్భుతమైన బాణీలు అందించారు. ఇక హిందీలో కూడా ” జరసీ జిందగీ”పేరిట ఈ సినిమా రీమేక్ అయింది. కమల్ మళ్ళీ నటించగా శ్రీదేవి బదులు అనితారాజ్ నటించారు. బాలీవుడ్ లోను అంతగా ఆడలేదు. అలా ఎపుడో 43 ఏళ్ళ క్రితం మూడు భాషల్లో ప్రేక్షకులను ఆకలి రాజ్యం అలరించింది.యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది .. చూడని వాళ్లు చూడవచ్చు .. చూసిన వాళ్ళు మళ్ళీ చూడొచ్చు.
————-KNM