సింధు ప్రజల ఆహారపు అలవాట్లు ఇవేనా ?

Sharing is Caring...

Interesting facts revealed in the research……

సింధు లోయ ప్రజల జీవన విధానంపై జరిగిన పరిశోధనలు ఎన్నోఆసక్తికరమైన విషయాలను తెలియ జేస్తున్నాయి. నాలుగువేల ఏళ్ళ క్రితం హరప్పన్లు కాయధాన్యాలు, ఇతర పప్పులు (బఠానీలు, చిక్‌పీస్, పచ్చిశనగలు, నల్లశనగలు,మినుములు ) పండించే వారు.

వారి ప్రధాన ఆహార పదార్థాలు వరి, గోధుమ, బార్లీ. వీటిని బహుశా రొట్టెగా తయారు చేసుకుని తినేవారు. అలాగే వాటితో  గంజి కూడా చేసుకునేవారు.కొన్నిఆహారాలను ఉడకబెట్టుకుని లేదా వేయించుకుని తినేవారు. ఆ రోజుల్లో మాంసం ప్రధానంగా పశువుల నుండి లభించేది. 

హరప్పన్లు కోళ్లు, గేదెలు,గొర్రెలు, మేకలను కూడా పెంచేవారు. అలాగే అనేక రకాల అడవి కోళ్లు, జింకలు,అడవి పంది వంటి జంతువులను వేటాడేవారు. వారు నదులు, సరస్సులు, సముద్రం నుండి చేపలు పట్టేవారు.చేపలను ఎండబెట్టడం లేదా ఉప్పువేయడం చేసేవారు.

జాక్, క్యాట్ ఫిష్ వంటి సముద్రపు చేపల ఎముకలు కూడా  హరప్పాప్రాంత తవ్వకాలలో బయటపడ్డాయి. నాటి వంటపాత్రలను పరిశోధించినపుడు మాంసపు వంటకాల ఆనవాళ్లే కనిపించినందున  సింధూ ప్రజలు మాంస ప్రియులని  భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ వివిధ పరిశోధనల్లో వెలుగు చూశాయి. 

కొన్ని ప్రదేశాలలో ప్రత్యేకించి గుజరాత్ ప్రాంతంలో ప్రజలు కొన్ని స్థానిక మిల్లెట్లను కూడా సాగు చేశారని పరిశోధనల్లో బైటపడింది. బహుశా అది బ్రూమ్‌కార్న్ మిల్లెట్ అని .. అది దక్షిణ మధ్య ఆసియా నుండి పరిచయం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

2000 BC నాటి నుంచి హరప్పా అనంతర కాలం వరకు వరి ఒక ముఖ్యమైన పంటగా మారింది. అప్పటి ప్రజలు తమ జంతువులకు స్థానిక అడవి బియ్యాన్ని తినిపించారని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటికే వరి సాగు చేస్తూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

హరప్పా ప్రజలు ఆహరం లో పండ్లు, కూరగాయలు, మసాలా దినుసులను వినియోగించేవారు. వివిధ రకాల బ్రాసికా, గోధుమ ఆవాలు, కొత్తిమీర, ఖర్జూరం, జుజుబ్, వాల్‌నట్‌లు, ద్రాక్ష, అత్తి పండ్లను కూడా ఉపయోగించేవారు.మామిడి, బెండకాయ, మిరియాల లా ఉండే కేపర్, చెరకు, వెల్లుల్లి, పసుపు, అల్లం, జీలకర్ర, దాల్చినచెక్క వంటి అనేక ఇతరాలు స్థానికంగా లభించేవి.

ఇవన్నీ హరప్పన్‌లు పండించినవి లేదా సేకరించినవి అయిఉండవచ్చు.కానీ అందుకు ఆధారాలు లేవు. నువ్వులను మాత్రం నూనె కోసం పండించారు. అలాగే లిన్సీడ్ నూనె కూడా అప్పట్లో  వినియోగించి ఉండవచ్చు అని భావిస్తున్నారు.  
హరప్పా కాలంలో పట్టణాలు పక్కా ప్రణాళికతో నిర్మితమైనాయి. నాటి ప్రజలకు ఇటుక ఇళ్ళు ఉండేవి..అవి రోడ్ల పక్కన ఉండేవి..ప్రతి ఇంటికి మెట్లు, వంటగది, వేరువేరు గదులు ఉండేవి. వారి ప్రాంగణాలలో బావులు, స్నానపు గదులు ఉండేవి. సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉండేది. 

హరప్పన్లు వంటకు ప్రధానంగా కుండ పాత్రలు ఉపయోగించేవారు. కొంతమంది సంపన్న గృహాలలో లోహ పాత్రలు కూడా వినియోగించేవారట. పరిశోధనల్లో కొన్ని వ్యవసాయ ఉపకరణాలు కనుగొనబడ్డాయి. ఫ్లింట్ బ్లేడ్లు బహుశా పంటకోతకు ఉపయోగించేవారు.

3వ సహస్రాబ్ది BC ప్రారంభంలో నాగలి వాడుకలో ఉందని ఎర్లీ హరప్పా కాళీబంగన్ వద్ద దున్నిన పొలం తెలియజేస్తుంది. అప్పట్లోనే  ఒకే పొలంలో రెండు పంటలు కూడా పండించారని పరిశోధకులు అంటున్నారు.ఈ పద్ధతి ఆధునిక కాలంలో కూడా కొనసాగుతోంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!