మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆంత పెద్ద సంఖ్యలో అక్కడే ఎందుకు కవలలు పుడుతున్నారనేది మిస్టరీ గా మారింది. దీన్ని ఛేదించడానికి దేశ విదేశాలనుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆ గ్రామానికి వచ్చారు.
పలు వివరాలు సేకరించుకుని వెళ్లారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఒక్క గ్రామంలోనే అంతమంది కవలలు ఎందుకు ఉన్నారనే విషయాన్ని కనుక్కోలేకపోయారు. గ్రామంలో ఉన్న వారి జన్యువులను పేరు పొందిన లేబరేటరీల్లో కూడా పరిశీలించారు. మరెన్నో పరీక్షలు చేసారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
ఆ గ్రామం మొత్తం జనాభా 2000 మంది. 480 మంది కవలలు ఉన్నారు. అధికారుల లెక్కల మేరకు 2008 వరకు 280 మంది కవలలే ఉన్నారు. తర్వాత కాలంలో వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. జాతీయ కవలల సగటు జననాల రేటు ప్రతి వెయ్యిమందికి 9 మాత్రమే. కానీ ఈ గ్రామంలో మాత్రం చిత్రంగా చాలా ఎక్కువగా ఉన్నాయి.
2016 లో యూనివర్సిటీ అఫ్ లండన్ అండ్ జర్మనీ ,కేరళ యూనివర్సిటీ ,సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ వారు సంయుక్తంగా ఈ మిస్టరీ ఏమిటో తెల్సుకోవడానికి వచ్చారు. గ్రామ ప్రజలనుంచి సలైవా, వెంట్రుకలను సమీకరించి జన్యు పరీక్షలు చేశారు. అయినా కారణాలు కనుక్కోలేకపోయారు.
కొందరైతే అక్కడి వాతావరణం లోను , నీటిలోను .. గాలిలోనూ ఏదో ప్రత్యేకత ఉందని అందుకే అక్కడ కవలలు ఎక్కువగా పుడుతున్నారని కూడా అన్నారు. ఈ మాటలు నిజమైతే గ్రామంలోని అన్ని కుటుంబాలలో కవలలు ఉండాలి. కానీ అలా లేరు. కవలలు జన్మించడం కొన్ని కుటుంబాలకే పరిమితం అయింది.
గ్రామ ప్రజలు కూడా ఈ చిత్రంపై ఇతమిద్ధం గా ఏమి చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలోనే గ్రామం పేరు “కవలల గ్రామం కోడిన్హి” గా మారిపోయింది. ఆ విధంగా బోర్డు కూడా పెట్టారు. 2021 నాటికి కవలల సంఖ్య మరింత పెరిగి ఉంటుంది.