రావణాసురుడిని మరో కోణంలో పరిచయం చేసిన పుస్తకం ఇది “రావణ్ ద కింగ్ ఆఫ్ లంక”. ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి దీనిని రాశారు. ముఖ్యంగా రావణాసురుడి పాలనా దక్షత, ఆనాటి శ్రీలంక దేశ శాస్త్ర-సాంకేతిక పురోగతి , వైభవాన్ని , పాలనా విశేషాలను మునుపెన్నడూ తెలియని కోణంలో చెబుతోంది.
స్వతహాగా పండితుడైన రావణుడు విశిష్ట పరిపాలన అందించారట. ఆ కాలంలోనే శ్రీలంక లో ప్రణాళికా బద్ధమైన నగరీకరణ విలసిల్లినట్లు సమాచారం. రాజ్యపరిరక్షణ కోసం విస్తారంగా సొరంగమార్గాల్ని ఏర్పాటు చేశారట . రావణుడి ఆస్థానంలో విశేష ప్రావీణ్యం ఉన్న శాస్త్రవేత్తలు ఉండేవారట.
వాళ్లు రాళ్లను సైతం బన్నులంతా తేలిగ్గా మార్చే రసాయన విద్యల్లో నిష్ణాతులట . రావణుడు బండరాళ్లపై రసాయనాలు ప్రయోగించి., సముద్రాల్లోనూ సొరంగ మార్గాలు నిర్మించినట్లు ప్రతీతి. చారిత్రక పరిశోధనలు ఇదే విషయాన్ని రుజువు చేసే పనిలో ఉన్నాయి.
రాజ్య పరిరక్షణకు సుశిక్షితులైన సైన్యాన్ని రావణుడు ఏర్పాటు చేశారట.యుద్ధ పరిసరాల్లో కలిసిపోయేలా దుస్తుల్ని ధరించటం మొదలు పెట్టిన మొట్టమొదటి సైన్యం రావణాసురుడిదే అట . ఆయన సైన్యం యుద్ధాల్లో త్రాచుపాము విషం కలిపిన మారణాయుధాల్ని ఎక్కువగా ఉపయోగించే వారట.
ప్రపంచం లో మొట్టమొదటి విమానాన్ని కలిగి ఉన్న పాలకుడు రావణుడే. బలమైన నావికాదళాన్ని సైతం ఆయన నిర్మించుకున్నాడట . ఆ రోజుల్లో తీవ్ర నేరాలు చేసిన వాళ్లను సజీవంగా సమాధి చేయటం వంటి కఠిన శిక్షల్ని అమలు చేసినట్లు ఆ రచయిత పుస్తకంలో పేర్కొన్నారు.
మనకు తెలిసిన రామాయణం ప్రకారం రామబాణం వేటుకు రావణాసురుడు కుప్పకూలాడు . అయితే మిరాండో పరిశోధనల్లో మాత్రం రావణుడు రామ-రావణయుద్ధంలో చావలేదు. విషపూరితమైన రాముడి బాణాలు తగిలి., కొంత కాలం తర్వాత చనిపోయాడు. అలాగే అజేయమైన సైన్యం … అనన్య అస్త్రాలున్న రావణాసురుడు ఓ సామాన్య రాజైన రాముడి చేతిలో చనిపోవటానికి అంతఃపుర కుట్రలు కారణం అని పుస్తకం వెల్లడిస్తోంది.
రావణాసురుడి భార్య మండోదరి, తమ్ముడు విభీషణుడు రాముడి పక్షం వహించటంతో., రావణుడి యుద్ధ వ్యూహాలన్నీ ముందుగానే రాముడి శిబిరానికి తెలిసిపోయేవి. ఫలితంగా రావణాసురుడితో పోలిస్తే., ఏ మాత్రం సరితూగలేని రాముడి వానరసైన్యం .., సునాయాసంగా విజయం సాధించారట.
ముల్లోకాల్ని గడగడలాడించిన రావణుడు కేవలం అంతఃపుర కుట్రలకు, సొంతవాళ్ల నమ్మకద్రోహం కారణంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నట్లు ఆ పుస్తకం వివరిస్తోంది.ఉత్తరాది నుంచి వచ్చిన ఓ ఆర్యన్ తెగ దాడులతో శ్రీలంక చరిత్రలోనే విశిష్టమైన రావణాసురుడి శకం ముగిసినట్లు రచయిత చెప్పారు. అంతర్జాలంలో చూస్తే బోలెడు పుస్తకాలు రావణుడి పై రాసినవే ఉన్నాయి. ఇలాంటి పుస్తకాల వలన రావణుడి ఇమేజ్ పెరుగుతుందా ? అనేది సందేహమే.