Thara Devi ……………………………………………….
సిమ్లాకు సమీపంలోని షోగీలో… పర్వత శిఖరాగ్రంపై కొలువైన తారాదేవిని కష్టాల నుంచి కాపాడే అభయ ప్రదాయినిగా భక్తులు కొలుస్తారు.అందాలకూ, ఆహ్లాదానికీ నెలవైన హిమాచల్ ప్రదేశ్ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్నిసేన్ వంశస్తులు నిర్మించారు
ఆలయ చరిత్ర ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన సేన్ వంశపు రాజు ఒకరోజు వేటకు వెళ్ళాడు. అడవిలో తిరిగి తిరిగి అలసి పోయాడు. అంతలో చీకటి పడింది. దారి తప్పాడు. అలసటతో ఒక బండరాయి మీద విశ్రమించాడు. రాజు ఎక్కడికి వెళ్ళినా తన వెంట తారా దేవి ప్రతిమను తీసుకుపోయేవాడు. ఆరోజు అలాగే చేసాడు.
ఆ రాత్రి తారాదేవి, క్షేత్ర పాలకులైన హనుమంతుడు, భైరవుడు రాజుకి కలలో దర్శనమిచ్చారు. ఈ ప్రాంతంలో తమకు గుడి కట్టి.. ప్రజలందరికి పూజలు చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. రాజుకి మెలకువ వచ్చి బయలు దేరుతుండగా పరివారం కూడా వెతుక్కుంటూ వచ్చింది.
తర్వాత కొన్నాళ్లకు తారా దేవి కలలో దర్శనమిచ్చిన ప్రదేశంలో ఆ రాజు ఆలయాన్ని నిర్మించి, దారు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అదే వంశానికి చెందిన రాజా బల్బీర్ సింగ్ కు కలలో… తారాదేవి కనిపించి, తారావ్ పర్వత శిఖరం మీద తన విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిందిగా ఆజ్ఞాపించింది. దీంతో కింద ఉన్న గుడి కొండపైకి మారింది.
1825లో అష్టధాతు విగ్రహాన్ని ఆ కొండపై బల్బీర్ సింగ్ ప్రతిష్టించాడు. తారాదేవి ఆలయం సుమారు రెండువందల యాభై ఏళ్ళ నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ ప్రాంతానికి చెందిన తారాదేవి విగ్రహం హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువై పూజలందుకుంటోందనే కథనం కూడా ప్రచారం లో ఉంది.
సముద్రమట్టానికి 1851 మీటర్ల ఎత్తయిన కొండ శిఖరంపైౖ ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో సరస్వతి, మహాకాళి, భగవతి, ఆంజనేయుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో ప్రధానంగా కలపనే ఉపయోగించారు. ఈ ఆలయంలో దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. నవరాత్రుల్లో అష్టమి రోజున సేన్ రాజవంశీకులు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని ప్రార్ధిస్తారు. తారా దేవికి విశేష పూజలు నిర్వహిస్తారు.
చుట్టూ కొండలు,లోయలు, చెట్లు,పచ్చదనం పరుచుకున్న ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
ఈ ప్రాంతం పర్యాటకంగానూ పేరుపొందింది. సిమ్లా కు 11 కి మీ దూరం లో ఉంటుంది. రైలు ,బస్సు మార్గాల్లో ఆలయానికి చేరుకోవచ్చు.