Is it true to sit on a corpse and worship?………..
అఘోరాలు లేదా మాంత్రికులు శవ సాధన చేస్తుంటారు అని వాళ్ళు వీళ్ళు చెప్పగా విని ఉంటాం. లేదా ఏదైనా పుస్తకాల్లో చదివి ఉంటాం. అసలు ఇది నిజమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది. అవును అది నిజమే. అఘోరాలు /మాంత్రికులు శవసాధన చేస్తుంటారు.
ఇది రహస్యంగా చేసే ఒక తాంత్రిక సాధన. వామాచార తంత్రం. ఇందులో సాధకుడు శవం మీద కూర్చుని ధ్యానం చేస్తాడు. దీన్నే శవ సాధన అంటారు. శవ సాధన అత్యంత కష్టమైనది. సాధకులకు ఎంతో గుండె ధైర్యం కావాలి. ఎవరికి కనబడకుండా రహస్యంగా చేయాలి. ఇదొక తంత్ర విద్య. తాంత్రిక గ్రంధాల్లో దీని వివరాలు లభ్యమౌతాయి.
దేని కోసం ఈ శవ సాధన ?
సాధకులు రక రకాల ప్రయోజనాల కోసం ఈ శవ సాధన చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో లక్ష్యం కోసం చేస్తారు. మూలాధార చక్రంలో నిద్రాణమైన కుండలినీ శక్తిని మేల్కొలిపి.. సుషుమ్నా నాడి ద్వారా పైపైకి సహస్రధార చక్రం వరకు తీసుకెళ్లి ఆ కుండలిని శక్తిని పరమశివుడితో కలపడం శవ సాధన లక్ష్యం. ఇది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు.
సాధనలో ఢక్కామొక్కీలు తిన్న సాధువులు మాత్రమే చేయగలరు. అకుంఠిత దీక్ష.. కఠోర సాధన ఇందుకు అవసరం. పార్వతి దేవి, కాళీ, ఆది పరాశక్తి వంటి శక్తులను ప్రసన్నం చేసుకోవాలంటే శవసాధన ద్వారానే ఆరాధించాలని అంటారు. అలా చేయకపోతే నరక లోకానికి వెళ్తారట. వివిధ కోరికల నిమిత్తం తాంత్రిక పూజలు చేసేవారు అందుకే శ్మశానాల్లో /నదీ తీరాల్లో శవసాధన చేస్తుంటారు.
శవ సాధన చేయడానికి కొన్ని నియమాలు,నిబంధనలు ఉన్నాయి. ఏదో ఒక శవం సాధనకు పనికి రాదు.శవం పాడై పోకుండా ఉండాలి. శవానికి ఎలాంటి అంగ వైకల్యం ఉండకూడదు. (అంటే కళ్ళు, చెవులు,ముక్కు ,కాళ్ళు, చేతులు బాగుండాలి) శవాలలో ఛండాల జాతికి చెందిన శవం శ్రేష్టమైనది. దీన్ని మహా శవం అంటారు.
(ఛండాల జాతి అంటే బ్రాహ్మణ స్త్రీకి శూద్రునికి పుట్టిన వారు.) నీటిలో మునిగి చనిపోయిన .. పిడుగుపాటు కి గురైన వ్యక్తి శవం … కత్తితో లేదా కర్రతో గాని చంపిన వ్యక్తి శవం .. శత్రువులతో పోరాడుతూ చనిపోయిన యువకుల శవాలను ఈ శవ సాధనకు ఎంచుకుంటారు. బ్రాహ్మణుని శవం .. మహిళ శవం… ఆకలితో చనిపోయిన వారి శవం .. వృద్ధుల శవాలు శవ సాధనకు పనికి రావు.
పై నియమాలను బట్టి చూస్తే శవ సాధన అంత సులభం కాదు. ఖచ్చితంగా అర్హతలున్న శవం దొరకడం కష్టమే. అయితే యేవో మినహాయింపులు ఉండే ఉంటాయి. దాన్నిబట్టి తాంత్రికులు,అఘోరాలు శవసాధన చేస్తున్నారని భావించాలి.
కలకత్తా లో, వారణాసిలో,ఉజ్జయినిలో ఈ తరహా సాధన చేసే వారు ఉన్నారని అంటారు. వీరు అసలైన సాధకులో … ఆ పేరు చెప్పుకుంటూ చలామణి అవుతున్న నకిలీలో ఎవరికి తెలీదు. ఇలాంటి ప్రక్రియ ఖచ్చితంగా తెలిసిన వారు దేశం మొత్తం మీద కొద్దిమందే ఉన్నారని .. వారు ప్రలోభాలకు లొంగరని అంటారు.
———— K.N.MURTHY