Dedicated leader…………………………………………….కరోనా మొదటి దశలో విధించిన లాక్ డౌన్ సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏమాత్రం భయపడకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రెండో దశలోనూ తనదైన శైలిలో సీతక్క దూసుకుపోతున్నారు. నిత్యం ఎక్కడికో ఒక చోటకు వెళ్లి ప్రజలకు రేషన్, ఇతర వస్తువులు అందించి వస్తున్నారు.
ఈ సహాయ కార్యక్రమాలకు స్వచ్చందం గా కొంతమంది యువకులు టీమ్ గా ఏర్పడి సీతక్క అండగా నిలుస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో కనీస అవసరాలకు నోచుకోని అడవి బిడ్డలను ఆదరిస్తున్నారు. కొద్దీ రోజులుగా మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి అవసరమైన నిత్యావసర సరుకులు సీతక్క పంపిణీ చేస్తున్నారు. రహదారులు సరిగ్గా లేకపోతే నాలుగైదు కిలోమీటర్లు కూడా నెత్తిన మూటలు పెట్టుకుని నడుచుకుంటూ అడవుల్లోకి వెళ్లి గిరిజనులను కలుస్తున్నారు.
మొన్నొక రోజు ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల పంచాయితీ రాపట్ల గొత్తి కోయగూడెం వెళ్లారు. రాపట్లకు రోడ్డుమార్గం లేకపోవడంతో లింగాల నుంచి నెత్తిన సరుకుల మూటలతో 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ చేరారు సీతక్క. అక్కడ పదహారు కుటుంబాలకు పిల్లలకు బట్టలు, దుప్పట్లు,బియ్యం, కూరగాయలు అందించారు. అలాగే గిరిజనులతో ముచ్చటిస్తూ .. వైరస్ గురించి వారికి వివరించి చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. అలాగే ములుగులో కరోనా తో ఒక వ్యక్తి చనిపోతే అంత్యక్రియలకు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ విషయం తెలిసి సీతక్క తన టీమ్ తో వెళ్లి డెడ్ బాడీని శానిటైజ్ చేయించి .. ట్రక్కులో శ్మశానానికి తరలించి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీతక్క పెద్ద మనసును నెటిజనులు మెచ్చుకుంటున్నారు. కరోనా భయంతో ప్రజాప్రతినిధులంతా ఇళ్లలోనే ఉంటుంటే సీతక్క మటుకు ప్రాణాలకు తెగించి ప్రజలకు అండగా ఉంటున్నారు. సీతక్క మొదటి నుంచి ప్రజల మనిషే. 20 ఏళ్ళ వయసులో ఆమె నక్సలైట్లలో కలిసి పోయారు. తుపాకీ పట్టి పేదల కోసం పోరాడారు. సీతక్కగా పాపులర్ అయ్యారు.తర్వాత జన జీవన స్రవంతిలోకి వచ్చారు.
రాజకీయాల్లోకి ప్రవేశించాక 2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే అజ్మీరా చందూలాల్ పై కాంగ్రెస్ తరపున గెలిచారు. ఓడినా గెలిచినా .. ఎన్నికలకు దూరంగా ఉన్నా సీతక్క ఎపుడూ ప్రజలమనిషే.