A film that broke old records ……………
‘దేవుడు చేసిన మనుషులు’….సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన తొలి మల్టీ స్టారర్ సినిమా ఇది. ఎన్టీఆర్, కృష్ణ నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ ఇద్దరు మొత్తం ఐదు చిత్రాల్లో కలసి నటించారు. అన్నింటిలో ఎన్టీఆర్ కి కృష్ణ తమ్మునిగానే నటించారు.
సూపర్ స్టార్ ఎన్టీఆర్ అభిమాని అనే విషయం తెలిసిందే .విజయవాడలో జరిగిన ‘పండంటి కాపురం” చిత్రం శతదినోత్సవానికి ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా కృష్ణ ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్,కృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ సందర్భంగానే ఎన్టీఆర్ తో భారీ చిత్రాన్ని నిర్మిస్తానని కృష్ణ ప్రకటించారు.ఎన్టీఆర్ కూడా అందుకు ఒకే అన్నారు.
కృష్ణ డైరెక్టర్ వి.రామచంద్రరావు ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కృష్ణ తమ్ముడు హనుమంతరావు చెప్పిన స్టోరీ లైన్ ఆధారంగా మోదుకూరి జాన్సన్, అప్పలాచార్య, ప్రభాకరరెడ్డి కథ అల్లుకొచ్చారు. మహారధి చేత మాటలు రాయించారు. ఇక టైటిల్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ మీద సినిమా ప్రారంభం లోనే ఓ పాట తీశారు. అదే ‘దేవుడు చేసిన మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్ళారా’ పాట..దాన్ని మహాకవి శ్రీశ్రీ రాశారు. ముగింపు సన్నివేశాల్లోను అదే పాట వస్తుంది.
ఆ పాట లోని పదాలు నచ్చడంతో ‘దేవుడు చేసిన మనుషులు’ అని సినిమాకి పేరు పెట్టేసారు. సినిమాలోని క్లయిమాక్స్ సన్నివేశాలను మచిలీపట్నం మెయిన్ రోడ్లో చిత్రీకరిస్తే బాగుంటుందని దర్శకుడు రామచంద్రరావు సూచించారు. ఆయన, హనుమంతరావు ముందుగా ఆ ఊరు వెళ్లి అక్కడి రోడ్డు .. ట్రాఫిక్ పొజిషన్ చూసొచ్చారు. పోలీసుల పర్మిషన్ తీసుకున్నారు.
భారీ వినాయక విగ్రహాన్ని తయారు చేయించి, క్లయిమాక్స్ సాంగ్ ని భారీ జనసందోహం మధ్యలో చిత్రీకరించారు. సినిమా కు ఆపాటే కీలకం గా మారింది. ఇక కొన్ని పాటలను ఊటీ లో తీశారు. ఓ పాటలో జమున, మంజుల హీరో కృష్ణ సరసన నటించారు.
భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమైంది.ఎస్వీ రంగారావు, జయలలిత, విజయ నిర్మల, ఎస్. వరలక్ష్మి, నిర్మలమ్మ. కాంచన, సత్య నారాయణ,కొంగర జగ్గయ్య, కాంతారావు ,అల్లు రామలింగయ్య తదితరులు నటించారు.
ఇక సినిమా ఎన్టీఆర్ ‘దేవుడు చేసిన మనుషుల్లారా’ అనే పాట పాడే సీన్ తో మొదలవుతుంది. పాట మొదట్లో ఎన్టీఆర్ సన్యాసి గెటప్ లో కనిపిస్తారు..అక్కడ విగ్రహాన్ని దొంగిలిస్తారు. తర్వాత బ్యాండ్ మేళం సభ్యుడిగా బ్యాంక్ దోపిడీ చేస్తారు. క్లబ్ లో ప్లేబాయ్ గా పాడుతూ మహిళలను మత్తు లో ముంచి నగల దోపిడీ చేస్తారు.
తర్వాత విమానాన్ని హైజాక్ చేసి విగ్రహాన్ని దొంగిలించే సన్నివేశం వరకు పాట సాగుతుంది. పాట చిత్రీకరణ బాగుంటుంది. సినిమా ప్రారంభం నుంచే కథలో ఏం జరగబోతుందా ? అన్న ఆసక్తి ప్రేక్షకులకు కలిగేలా రామచంద్రరావు సన్నివేశాలను కూర్చుకున్నారు.
సినిమాలో నవరసాలు సమపాళ్ళలో కుదిరాయి .. సెంటిమెంట్ సీన్లు అద్భుతంగా తెరకెక్కాయి.ఎస్.వి.రంగారావు, ఎన్టీఆర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో భావోద్వేగంగా ఉంటాయి.గర్వంతో ఉన్న తమ్ముడు (కృష్ణ)ని, అన్న (ఎన్టీఆర్) తన తప్పులు తెలుసుకునేలా చేసే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
జగ్గయ్య, కాంతారావుల విలనిజం, విగ్రహాల దొంగతనం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సత్యనారాయణ తాగుబోతుగా చేసే నటన, అల్లు రామలింగయ్య కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి.ఈ సినిమా క్లైమాక్స్ లో భారీ విగ్రహ ఊరేగింపు సన్నివేశాలను వేలాది జనం మధ్య అద్భుతంగా చిత్రీకరించారు.
‘దేముడు చేసిన మనుషుల్లారా’ పాట రెండో వెర్షన్ ఎన్టీఆర్,కృష్ణ, జగ్గయ్య,కాంతారావులపై చిత్రీకరించారు. డప్పుకళాకారులు,కోలాట బృందాలు కూడా ఈ పాటలో కనిపిస్తాయి. విలన్లు దేముడి విగ్రహాలను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాన్ని అన్నదమ్ములు (ఎన్టీఆర్ & కృష్ణ) అడ్డుకుని, వారిని అంతం చేయడంతో సినిమా ముగుస్తుంది.
సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ తనదైన శైలిలో స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ నటనను ప్రదర్శించారు. ఎన్టీఆర్ వంటి లెజెండరీ నటుడి పక్కన నటిస్తున్నప్పటికీ, తన ప్రత్యేకతను ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రమేష్ నాయుడు అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. “మసక మసక చీకటిలో”, “దేవుడు చేసిన మనుషుల్లారా” వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. మిగతా పాటలు కూడా బాగుంటాయి. నటీ నటులందరూ బాగా నటించారు.
వి ఎస్ ఆర్ స్వామి కెమెరా పనితనం అద్భుతం అని చెప్పుకోవాలి. పుష్పాల గోపికృష్ణ , గోపాల్ రెడ్డి కెమెరా అసిస్టెంట్లుగా పనిచేశారు. మహారథి సంభాషణలు సందర్భోచితంగా రాశారు.శ్రీ శ్రీ టైటిల్ సాంగ్ రాయగా మిగిలిన పాటలు ఆరుద్ర,దాశరధి రాసారు.
ఈ సినిమా ఆ కాలంలో భారీ వసూళ్లను సాధించి నాటి రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం లైఫ్ టైమ్ రన్ లో సుమారు ₹2.75 కోట్ల గ్రాస్, ₹1.35 కోట్ల షేర్ వసూలు చేసింది. 27 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమై, అంతకుముందు ‘లవకుశ’ (1963) పేరిట ఉన్న 26 కేంద్రాల రికార్డును అధిగమించింది.1973లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
మచిలీపట్నంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ హోటల్ లో ఉండకుండా, సొంత గ్రామమైన నిమ్మకూరు (బందరుకు దగ్గరలో ఉన్న గ్రామం) నుండే షూటింగ్‌కు వచ్చేవారు. యూనిట్ సభ్యులందరికీ తన గ్రామంలోనే విందు ఏర్పాటు చేశారని అంటారు.ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది .. చూడని వారు చూడ వచ్చు.

