విలన్ పాత్రలో సూపర్ స్టార్ !

Sharing is Caring...

సాఫ్ట్ విలన్ గా సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రం ఒకటుంది. ఆ చిత్రం పేరు  ప్రైవేట్ మాష్టారు. ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ సినిమా ఇది. సూపర్ స్టార్ కి 9 వ సినిమా కాగా విశ్వనాథ్ రెండవ సినిమా ఇది. కెరీర్ బిగినింగ్ కాబట్టి కృష్ణ ఆ పాత్రను అంగీకరించి ఉండొచ్చు. నెగటివ్  షేడ్స్ ఎక్కువగా ఉన్నపాత్ర అది. మోసగాడి క్యారెక్టర్ అంతే.

అయినప్పటికీ సూపర్ స్టార్ ఆ పాత్రలో ఇమిడి పోయారు. తేనెమనసులు చిత్రం ద్వారా పరిచయమైన రామ్మోహన్ ఇందులో హీరో. చిన్న పాత్రలో శోభన్ బాబు కూడా ఇందులో నటించారు. కృష్ణ శోభన్ బాబు కలిసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. కృష్ణ కు రెండు పాటలు కూడా పెట్టారు. 1967 నాటి సినిమా ఇది.

కథలో గుమ్మడి కష్టపడి పైకొచ్చిన వ్యాపారవేత్త. ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కాంచన కాగా రెండో కూతురు సుకన్య. రామ్మోహన్ గుమ్మడి స్నేహితుడు నాగయ్య కుమారుడు. నాగయ్య సహాయం తో పైకొచ్చిన గుమ్మడి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తుంటాడు.

రామ్మోహన్ గుమ్మడి ఇంట్లో ప్రైవేట్ మాస్టారు గా చేరి చిన్నకూతురు కి పాఠాలు చెబుతూ పెద్ద కూతురిని ప్రేమిస్తాడు. గుమ్మడి తండ్రి రేలంగి ఈ విషయం గమనించి మందలిస్తాడు. రామ్మోహన్ తాను ఫలానా నాగయ్య కుమారుడిని అని చెబుతాడు. దాంతో కాంచన కు రామ్మోహన్ కు పెళ్లి చేయాలని రేలంగి అనుకుంటాడు. ఈ లోగా కృష్ణ పాత్ర ఎంటరవుతుంది.

క్లబ్ లో గుమ్మడికి కృష్ణ పెద్ద బిజినెస్ మేన్ కుమారుడిగా పరిచయం అవుతాడు. బుద్ధిమంతుడిగా నటిస్తాడు. కృష్ణను చూడగానే గుమ్మడి తన పెద్ద కూతురు కాంచన కు తగిన జోడీ .. ఇద్దరికీ పెళ్లి చేయాలనీ నిర్ణయించుకుంటాడు.ఒకరోజు టీ కని ఇంటికి పిలిచి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు.

రేలంగి కాంచన రామ్మోహన్ ప్రేమలో పడిన విషయం చెబుతాడు. అతడు నీ మిత్రుడు నాగయ్య కుమారుడే అని చెప్పినా గుమ్మడి అంగీకరించడు. తండ్రి మాట వినకుండా పెళ్లి ముహూర్తం పెట్టిస్తాడు. దీంతో రేలంగి కాంచన రామ్మోహన్ లకు గుళ్లో పెళ్లి చేయిస్తాడు.

కుటుంబం పరువు పోయిందని గుమ్మడి బాధపడుతుంటే సుకన్య చొరవ తీసుకుని తనను చేసుకోమని కృష్ణను అడుగుతుంది. కృష్ణ చేసుకుంటాడు. అక్కడనుంచి కథ మలుపు తిరుగుతుంది. కృష్ణ మామగారిని నమ్మించి ఆస్తులు మొత్తం కాజేస్తాడు. చివరికి తప్పు తెలుసుకుంటాడు. అదెలా జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. యూట్యూబ్ లో సినిమా ఉంది. ప్రింట్ కూడా బాగుంది.

నెగటివ్ షేడ్స్ ఈ పాత్రను కృష్ణ బాగా చేశారు. డైలాగ్ మాడ్యులేషన్ కూడా బాగుంటుంది. దర్శకుడు విశ్వనాథ్ కాబట్టి ఎంతవరకు కావాలో ఆ మేరకు  నటనను రాబట్టుకున్నారు. కృష్ణ తొలి చిత్రం “తేనెమనసులు” కు కో డైరెక్టర్ .. అప్పట్లో డైలాగ్స్ ఎలా చెప్పాలో నేర్పింది విశ్వనాథే. ముళ్ళపూడి వెంకటరమణ ఈ సినిమాకు సంభాషణలు సమకూర్చగా .. మహదేవన్ మ్యూజిక్ అందించారు. సినిమా పెద్దగా ఆడలేదు కానీ ప్లాప్ మూవీ కాదు.

ఈ సినిమా తర్వాత విశ్వనాధ్ డైరెక్షన్ లో ఉండమ్మా బొట్టుపెడతా (68).. నేరము శిక్ష (73) చిత్రాల్లో కృష్ణ నటించారు. ఉండమ్మా కృష్ణ నటించిన 19 వ చిత్రం కాగా నేరము శిక్ష 89 వ సినిమా. ఆ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రాలేదు. తర్వాత కాలంలో విశ్వనాధ్ వేరే జోనర్ లో సినిమాలు తీయగా కృష్ణ వేరే జోనర్ లో కెళ్లారు.

మొత్తం మీద సూపర్ స్టార్ సాఫ్ట్ విలన్ గా నటించిన సినిమా ఇదొక్కటే. ఇక ఛత్రపతి శివాజీ పాత్రలో నటించాలన్న కృష్ణ చిరకాల వాంఛ నెరవేరలేదు. అయితే . డాక్టర్ సినీ యాక్టర్ సినిమాలో  శివాజీ గా కాసేపు కనబడతారు. చాలాసార్లు అనుకున్నారు కానీ  ఎందుకో ఆ సినిమా అలా అలా పెండింగ్ లో పడింది. మనవడు గౌతమ్ కృష్ణ తో కూడా నటించాలన్నది సూపర్ స్టార్ కోరిక.

————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!