డాక్టర్‌ కోట్నీస్‌కి అమర్ కహానీ !

Sharing is Caring...
Taadi Prakash  …………..  

SHOLAPUR TO BATTLE FIELDS OF CHINA

ఆకులూ పులూ రాలిపోతాయి… చూస్తుండగానే పొద్దు వాలిపోతుంది…. బంగారు వన్నె సాయంకాలం వెలుగు చీకటితో చేయి కలిపి వెళిపోతుంది…అలా కాదు కదా మరి, మానవజీవితం అంటే…80,90 సంవత్సరాల మహా ప్రయాణం కదా… కాంతిదారుల్లోనో…కన్నీటి పడవల్లోనో…త్యాగాల చైతన్యదీపాలై వెలిగి.. మానవత్వపు మైదానాల్లో మెలిగి .. పరులసేవే దీక్షగా, తపస్సుగా జీవించిన నిరాడంబరులు, నిజమైన మానవులు…. చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోవడం… మనసుని కలిచివేస్తుంది.

ఆ విషాదం… చరిత్ర మీద కన్నీటి చారికగా మిగిలిపోతుంది.అలాంటి వాడు, మనవాడు, మన షోలాపూర్‌వాడు… డాక్టర్‌ ద్వారకానాథ్‌ కోట్నీస్‌.అది 1938. మహోద్విగ్న స్వాతంత్ర్యపోరాటంతో భారతదేశం అగ్నిజ్వాలలా మండుతోంది. అటు చైనాలో మావో నాయకత్వాన కమ్యూనిస్టుల విప్లవ పోరాటం ప్రజ్వలిస్తోంది. భారత, చైనాలు యిలాంటి కల్లోలిత చారిత్రక దశలో వున్నవేళ, జపాన్‌ ఛైనా మీద దురాక్రమణకి పాల్పడింది. అప్పట్లో చైనాకి ఆధునిక వైద్యం తెలిసిన డాక్టర్లు లేరు.

వైద్యుల్ని పంపి ఆదుకోవాలని మిత్రదేశాల్ని,మావో, ఇతర నాయకులు ఆర్ధించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చైనా జనరల్‌ ఛూటే, జవహర్లాల్ నెహ్రూకి లేఖ రాశారు. అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వున్నారు. “కదిలిరండి,మనం చైనాకి సాయం చేద్దాం” అని 1938 జూన్‌ 30న బోస్‌ భారత ప్రజలకు పిలుపుయిస్తూ ఒక పత్రికా ప్రకటన చేశారు. అఖిల భారత చైనా నిధి పేరుతో జూలై 7,9 తేదీల్లో 22 వేల రూపాయలు సేకరించారు.

డాక్టర్లతో పాటు ఒక అంబులెన్స్‌ను పంప గలిగారు. చైనాపై జపాన్‌ దాడిని ఖండిస్తూ MODERN REVIEW పత్రికలో సుభాష్‌ చంద్రబోస్‌ వ్యాసం రాశారు. రెండు పెద్ద ఆసియా దేశాలు, స్వాతంత్ర్య పోరాటాలతో చరిత్ర తిరగరాస్తున్న సందర్భంలో మానవత్వంతో స్పందించాలని బోస్‌ పిలుపుయిచ్చారు. ఈ కర్తవ్య నిర్వహణ కోసం 1939లో నెహ్రు చైనాలో పర్యటించారు. అప్పటికే చైనా యుద్ధరంగంలో డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌ వైద్యసేవలందిస్తున్నారు.

ద్వారకానాథ్‌ శాంతారామ్‌ కోట్నీస్‌,1910 అక్టోబర్ పదో తేదీన,మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించారు. వాళ్ళదొక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. తండ్రి పేరు శాంతారామ్‌ కొట్నీస్‌. ఆయనకి ఇద్దరు అన్నయ్యలు. అయిదుగురు అక్కచెల్లెళ్ళు. యూనివర్శిటి ఆఫ్‌ బొంబాయి సేట్‌ జి.ఎస్‌.మెడికల్‌ కాలేజీలో వైద్యవిద్య చదివారు. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేద్దాం అని కొట్నీస్‌ అనుకుంటున్నపుడు, చైనా పిలుపు వినిపించింది.

అయిదుగురు డాక్టర్ల బృందాన్ని చైనా పంపించడానికి భారత జాతీయ కాంగ్రెస్‌ సిద్ధం అయింది.ఈటీమ్‌ నాయకుడు అలహాబాద్‌కి చెందిన డాక్టర్‌ ఎం.అటల్‌. ఎం. చోల్కర్‌(నాగ్‌పూర్‌ ), కోట్నీస్‌, కలకత్తా నుంచి బి.కె బసు, దేవేష్‌ ముకర్జీలు సభ్యులు. 1938 సెప్టెంబర్‌లో మన బృందం వుహాన్‌లో హంకో విమానాశ్రయానికి చేరుకుంది. గాయపడినవాళ్ళకి వైద్య సహాయం మొదలుపెట్టింది. 1939 లో ప్రధాన యుద్ధ రంగం, చైనా విప్లవానికి పుట్టిల్లు  యెనాన్‌ పర్వత లోయల్లోకి డాక్టర్లు అడుగుపెట్టారు. మావో, ఛుటే లతో సహా కమ్యూనిస్టు నాయకులంతా వీళ్ళకి స్వాగతం పలికారు.

సాటి ఆసియా దేశం నుంచి వచ్చిన తొలి వైద్య బృందాన్ని గుండెలకు హత్తుకున్నారు. డాక్టర్‌ కోట్నీస్‌ వయస్సు అప్పటికి 28 సంవత్సరాలు. సంచార వైద్యశాలల్లో సైనికులకు నిరంతరం చికిత్స చేస్తూనే వున్నారు. కోట్నీస్ దీక్షనీ, అంకితభావాన్నీ చూసి సైనికులూ, చైనా పార్టీ నాయకులూ చలించిపోయారు. చైనా విప్లవ చోదకశక్తిగా ప్రసిద్ధిగాంచిన, మావో నాయకత్వంలోని EIGHT ROUTE ARMYకి కోట్నీస్‌ వైద్య సేవలు ఆరంభించారు.

ఉత్తర చైనాలోని వుతాయ్‌ పర్వతశ్రేణుల సరిహద్దుల్లో పనిచేయడం అంటే ప్రాణాలతో చెలగాటమే. రాత్రీపగలూ తేడా లేదు. గాయపడిన వందలాది సైనికుల్ని తీసుకొస్తూనే వుంటారు. తీరిక, విశ్రాంతి అనే మాటలు అక్కడ అర్ధం లేనివి! ఒక్కొసారి కోట్నీస్‌ 72గంటలసేపు కంటిమీద కునుకులేకుండా ఊపిరి సలపని పని చేసేవారు. నిస్సత్తువ, అలసట కుంగదీస్తున్నా కర్తవ్యదీక్ష కొట్నీస్‌కి శక్తినీ బలాన్ని యిచ్చేది. దాదాపు అయిదు సంవత్సరాలు కోట్నీస్ అవిశ్రాంతంగా పనిచేశారు.

ఆ సమయంలోనే డాక్టర్‌ కోట్నీస్‌ని నార్మన్‌ బెతూన్ అంతర్జాతీయ శాంతి ఆస్పత్రికి డైర్‌క్టర్‌గా నియమించారు. ఆ ఆస్పత్రిలో గుయొ జింగ్లన్‌ అనే చూడచక్కని నర్సు పనిచేస్తోంది. 1940లో బెతూన్‌ స్మారక స్థూపం ఆవిష్కరణ సభలో ఆమె కోట్నీస్‌ని కలుసుకుంది. చురుకైన కోట్నీస్‌ని ఇష్టపడింది. చైనీస్‌ భాష మాట్లాడుతూ, చైనీస్‌లో రాయగలిగిన కోట్నీస్‌ని చూసి తెగముచ్చటపడింది. 1941 డిసెంబర్‌ లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. 1942 ఆగస్ట్‌ 23న వాళ్ళకో కొడుకు పుట్టాడు.

ఆ బిడ్డకి YINHUA అని పేరు పెట్టారు. YIN అంటే ఇండియా, HUA అంటే చైనా అని అర్ధం. చైనాలో జీవితం ఎంతో బావుందనీ, ఆనందంగా వున్నాననీ షోలాపూర్‌లోని అక్కయ్య మనోరమకి ఉత్తరాలు రాసేవారు కోట్నీస్‌. కొడుకు పుట్టేనాటికే కోట్నీస్‌ ఆరోగ్యం పాడయింది. యుద్ధరంగంలో రెప్పవాల్చని రాత్రుల పనివత్తిడి ఆయన్ని పట్టిపీడించింది. పుత్రుడికి మూడు నెలలు నిండేసరికి డాక్టర్‌ని మూర్చ వ్యాధి దెబ్బతీసింది.1942 డిసెంబర్‌ 9వ తేదీన ద్వారకానాథ్‌ కోట్నీస్‌ కన్నుమూశారు.

చిన్నారి కొడుకుతో ఆ చైనీస్‌ తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. కొట్నీస్‌ మరణించడానికి కొన్ని నెలల ముందు 1942 జూలై 7న చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. NANQUAN గ్రామంలోని మృతవీరుల శ్మశానవాటికలో కోట్నీస్‌ని ఖననం చేశారు. “ఆర్మీ సహయం చేసే చేతీనీ, చైనా ఒక మిత్రుణ్ణీ కోల్పోయింది. కోట్నీస్‌ అంతర్జాతీయ స్ఫూర్తి మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచివుంటుంది ” అన్నారు మావో. భవిష్యత్‌ కోసం పోరాడిన కోట్నీస్‌ని భావితరాలు మరింత గౌరవిస్తాయని మేడం సన్‌యెట్‌ సేన్‌ నివాళులర్పించారు.

చైనా హేబీ రాష్ట్రం, షిజియా జువాంగ్‌ నగరంలోని మృతువీరుల స్మారక ఉద్యానవనం ప్రసిద్ధి చెందింది. అందులో ఉత్తర తూర్పు భాగాలను కొరియా, జపాన్‌ యుద్ధాల్లో మరణించినవారికి అంకితం చేశారు. పశ్చిమ భాగాన్ని నార్మన్‌ బెతూన్‌,దక్షిణ భాగాన్ని కోట్నీస్‌కి అంకింతం చేశారు. గౌరవ సూచకంగా కోట్నీస్‌ శిల్పాన్ని ప్రతిష్టించారు. మ్యూజియం ఏర్పాటు చేశారు.

అందులో కోట్నీస్‌ వాడిన వైద్య పరికరాలు, ఆయన హేండ్‌బుక్‌, చైనా పార్టీ నాయకులతో, డాక్టర్లతో వున్న ఫోటోలు భద్రపరిచారు.తాతముత్తాల్నీ స్మరిస్తూ చైనాలో ప్రతియేటా క్వింగ్‌మింగ్ పండగ జరుగుతుంది. 2005లో ఆ పండగ సందర్బంగా చైనా ప్రజలు బెతూన్‌, కోట్నీస్‌ సమాధుల్ని రంగురంగుల పూలతో నింపివేశారు. తర్వాత చైనా నాయకులు ఎవరు ఇండియా వచ్చినా షోలాపూర్ వెళ్ళి కోట్నీస్‌ అక్క మనోరమని పలికరించేవారు. ఆమెని చైనా తీసికెళ్ళి ఒక సభలో గౌరవించారు.

కొట్నీస్‌ కొడుకు ఇన్‌హువా చైనాలో మెడిసిన్‌ చదువుకున్నాడు. 24 ఏళ్ళ వయసులోనే జబ్బు పడ్డాడు. మెడికల్ డిగ్రీ పొందడానికి ముందే మరణించాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అతను చనిపోయాడని అంటారు. 1949లో చైనా విప్లవం విజయవంతం అయ్యాక, కొట్నీస్‌ భార్య గుయొజంగ్లన్‌ మరో చైనీయుణ్ణి వివాహం చేసుకుంది. 2012 జూన్ 28న 96 ఏళ్ళ వయసులో ఆమె చనిపోయింది. కోట్నీస్‌ భార్యగా అక్కడామె ఎనలేని గౌరవం పొందింది.

MY LIFE WITH KOTNIS అని 2006లో ఒక పుస్తకం రాసింది. చైనా,ఇండియా కోట్నీస్ గౌరవార్ధం స్టాంపులు వేశాయి. ఆయనపుట్టిన షోలాపూర్‌లో 2012 జవవరి ఒకటో తేదీన కోట్నీస్‌ శిల్పాన్నీ, స్మారక మందిరాన్నీ షోలాపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.ప్రముఖ భారతీయ దర్శకుడు శాంతారామ్‌ 1946లో ‘డాక్టర్‌ కోట్నీస్‌కి అమర్ కహానీ ‘ అనే సినిమా తీశారు.

ఖ్వాజా అహ్మద్‌ అబ్బాస్‌ రచన,స్కీన్‌ప్లే. కోట్నీస్‌గా శాంతారామ్‌ నటించారు. చైనీస్‌ కూడా కోట్నీస్‌పై ఒక సినిమా తీశారు. కోట్నీస్‌తో పాటు చైనా వెళ్ళిన మిగతా నలుగురు డాక్టర్లూ క్షేమంగా ఇండియా వచ్చారు. “నేను చైనాలోనే వుండిపోతా” అని కోట్నీస్‌ వాళ్ళతో అన్నారు.

1940వ దశకంలో ఇండియా,చైనా రెండూ పోరాట పథంలో వున్నాయి. 1947లో మనకి స్వాతంత్ర్యం వస్తే. 1949లో వాళ్ళ విప్లవం గెలిచింది. ఈ రెండు మహత్తరమైన ఆసియా దేశాలకూ అపురూపమైన సాంస్కృతిక వారసత్వం వుంది. రెండు చోట్లా సాహిత్యం, సంగీతం, కళలు, కవిత్వం విరగగాసాయి. వాళ్ళకి మహానాయకుడు మావో.. మన గంగానది మహాత్మాగాంధీ. అటు జనరల్‌ ఛూటే… ఇటు సుభాష్‌ చంద్రబోస్‌… వాళ్ళకి మేడం సన్‌యెట్‌ సేన్‌.. కన్‌ ప్యూషియస్‌ తాత్విక బోధన చైనాని నడిపిస్తే… భారతీయ తత్వ చింతనాశిఖరంగా బుద్ధుడు నిలిచాడు.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, ప్రేమ్‌చంద్‌, శ్రీశ్రీ, సాదత్‌ హసన్‌మంటోలు మనకుంటే…. లూషన్‌ లాజూ లాంటి మహా రచయితలకీ, కవులకీ అక్కడ కొదవలేదు. ప్రజల పోరాటాలు గెలిచిన ఆ కాలం జ్వాజ్వల్యమానమయింది. యేనాన్‌ కొండవాలుల్లో ఎర్రజెండాలు ఎగిరితే, కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ దాకా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. త్యాగం ఒక్కటే నిలిచి వెలిగిన పవిత్రమైన కాలం అది. తర్వాత కాలంలో చైనా నాయకత్వం తలబిరుసు పెరిగింది. వియత్నాం మీద యుద్ధానికెళ్ళింది. భారతదేశంపై దురాక్రమణకి పాల్పడింది. సరిహద్దు గొడవలుంటే కూర్చుని, చర్చించుకుని పరిష్కరించుకోలేనంత దుర్గతి దాపురించిందా ఈ రెండు గొప్ప దేశాలకు ! ఎంత ఖర్మ పట్టింది !!

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూ.వి.రత్నం February 27, 2021
error: Content is protected !!