కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లోనారాయణ స్వామి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం తో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి అక్కడ 7 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అన్నిసార్లు రాజకీయ సంక్షోభమే కారణంగా రాష్ట్రపతి పాలన వచ్చింది. రాబోయే మే నెల వరకు అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటుంది. మే లో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది.
పుదుచ్చేరి లో మొదటిసారిగా 1968 లో రాష్ట్రపతి పాలన వచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి — మార్చి 17,1969 వరకు 180 రోజులు రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఆ తర్వాత రెండో సారి 1974 జనవరి 3 నుంచి — మార్చి 6 వరకు 62 రోజులు పాటు ప్రెసిడెంట్ పాలన ఉన్నది. మూడో సారి 1974 మార్చి 28 నుంచి — 1977 జులై 2 వరకు పుదుచ్చేరి రాష్ట్రపతి పాలన కిందనే ఉంది. మూడోసారి మూడేళ్ళ 96 రోజులు ప్రెసిడెంట్ పాలన లో ఉంది. ఇక నాలుగో సారి 1978 నవంబర్ 12 నుంచి -1980 జనవరి 16 వరకు అంటే ఏడాది పైన 65 రోజులు రాష్ట్రపతి పాలనే కొనసాగింది. ఐదో సారి 1983 జూన్ 24 నుంచి –1985 మార్చి 16 వరకు (1 సం. 265 రోజులు )ఆరోసారి 1991 మార్చి 4 నుంచి -1991 జులై 3 వరకు రాష్ట్రపతి పాలనే ఉన్నది. దాదాపు 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ తాజాగా రాష్ట్రపతి పాలన విధించారు.
ఇక దేశంలో 1950 తర్వాత ఇప్పటివరకు ఎన్నోసార్లు వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. 2018 నాటి అధికారిక సమాచారం ప్రకారం వివిధ రాష్ట్రాలు 115 సార్లు ప్రెసిడెంట్ రూల్ కిందకు వెళ్లాయి. మొత్తం 29 రాష్ట్రాలలో తెలంగాణ , ఛతీస్ ఘడ్ మినహా మిగిలిన 27 రాష్ట్రాలు రాష్ట్రపతి పాలన ఎలా ఉంటుందో చూశాయి. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 10 సార్లు .. బీహార్ లో 9 సార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది. కేరళ,మణిపూర్,ఒరిస్సా , పంజాబ్ రాష్ట్రాల్లో 8 సార్లు ప్రెసిడెంట్ పాలన వచ్చింది. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు 5 సార్లు రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లాయి. ఉత్తరాఖండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఒక్కసారి మాత్రమే ప్రెసిడెంట్ రూల్ కిందకు వెళ్లాయి. 2016 లో ఉత్తరాఖండ్,అరుణాచల్ ప్రదేశ్ ల్లో రాష్ట్రపతి పాలన వచ్చింది.
పంజాబ్ రాష్ట్రం 10 ఏళ్ళు రాష్ట్రపతి పాలన లో ఉంది.1980 వ దశకం మొదట్లో .. తర్వాత 1987 నుంచి 1992 వరకు పంజాబ్లో ప్రెసిడెంట్ పాలన సాగింది. జమ్మూ కాశ్మీర్ లో కూడా 8 సార్లు ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. 1990 నుంచి 1996 వరకు ఆరేళ్ళు వరుసగా రాష్ట్రపతి పాలన కొనసాగింది. తర్వాత కాలంలో అడపా దడపా రాష్ట్రపతి పాలన వస్తూనే ఉంది. మామూలు గా మూడేళ్లకు మించి ప్రెసిడెంట్ రూల్ కొనసాగకూడదు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పొడిగించవచ్చు. ఉత్తర ప్రదేశ్ లో 1700 రోజులు, నాగాలాండ్లో 1545 రోజులు, కేరళలో 1515 రోజులు ప్రెసిడెంట్ రూల్ సాగింది. పది రాష్ట్రాల్లో 1000 రోజులకు మించి కొనసాగిన దాఖలాలు ఉన్నాయి. ఒక్క ఉత్తరాఖండ్ , అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనే 100 రోజుల కంటే తక్కువగా సాగింది.
2018 నాటి సమాచారం మేరకు దేశంలో మొత్తం 115 సార్లు ప్రెసిడెంట్ రూల్ విధించారు. అందులో కాంగ్రెస్ సర్కార్ అత్యధికంగా 84 సార్లు రాష్ట్రపతి పాలన విధించింది. మిగిలినవన్నీ ఇతర ప్రభుత్వాలు సిఫారసు చేసినవి.
————KNMURTHY