Inscriptions of Deva Raya………………………………
విజయనగర సామ్రాజ్య పూర్వ రాజధాని నగరమైన పెనుకొండ లోని ప్రాచీన శివాలయం – ఐముక్తేశ్వర స్వామి గుడిలో ఒకటో దేవరాయకు చెందిన సంస్కృత శాసనాన్ని. ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి గుర్తించారు. ఇటీవల ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించిన ఆయన రంగమండపం పై కప్పు కి వాడిన రాతిదూలoపై శాసనాలు చెక్కి వుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
పైకప్పు బండలపై, రాతి దూలాలపై శాసనాలు అరుదుగా వుంటాయి. ఐముక్తేశ్వరాలయం పైకప్పుపై ఉన్న సంస్కృత శాసనాలు అత్యంత అరుదైనవిగా మైనాస్వామి అభివర్ణించారు. ఎందుకంటే శాసన భాషతో పాటు లిపి కూడా “దేవనాగరి(సంస్కృతం భాషకు రాత)” వుండడం సాధారణ మైన విషయం కాదు.
సుమారు 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు వున్న రాతి దిమ్మెలపై.. ఒక్కోదానిపై 5 వరుసల్లో శాసనాలు రాశారు. “దేవనాగరి” అక్షరాలు అందంగా, పదాలు పొందికగా వున్నట్టు ఆయన వివరించారు. ఆలయంలో తెలుగు, కన్నడ శాసనాలు కూడా వున్నా.. అవి చదవడానికి వీలు కానంతగా అక్షరాలు చెరిగిపోయాయి. సంస్కృత శాసనాలు మాత్రం భద్రంగా వున్నాయి.
రెండో హరిహరరాయల కుమారుడైన ఒకటో దేవరాయలు (క్రీ.శ.1406-1422) విజయనగర రాజ్య చక్రవర్తి కాక మునుపు పెనుకొండ సీమకు రాజ ప్రతినిధిగా వ్యవహరించేవారు. ఒకటో దేవరాయలు పెనుకొండలో వున్నట్టు ఆధారాలున్నాయి. విజయనగర రాజ్య ఆవిర్భావ కాలానికి చెందిన ఐముక్తేశ్వరాలయాన్ని పునర్ నిర్మించి, శివలింగాన్ని పునః ప్రతిష్ఠ చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు ఒకటోదేవరాయ.
శాలివాహన శకవర్షం 1328 పార్థివ నామసంవత్సరం ఫాల్గుణ మాసం లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గర్భగుడిలో శివలింగాన్ని పునః ప్రతిష్ఠ చేశారు. శాసనాలు. ఆవిషయాలను స్పష్టం చేస్తున్నాయి. పెనుకొండ సీమ రాజ ప్రతినిధిగా వ్యవహరించిన ఒకటో దేవరాయ తన పట్టాభిషేకోత్సవానికి గుర్తుగా ఐముక్తేశ్వర గుడిని పునర్ నిర్మించి వుండవచ్చునని మైనాస్వామి అంటున్నారు.
ఇంగ్లీషు తేదీ ప్రకారం… క్రీ.శ.1406 ఫిబ్రవరి 26 బుధవారం శివ లింగ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగి వుంటాయని వివరించారు . విజయనగర సామ్రాజ్య కాలంలో కొన్ని సంస్కృత శాసనాలు ఉన్నప్పటికీ .. అందులోని లిపి కన్నడ, తెలుగు. కానీ పెనుకొండలో మాత్రం లిపి దేవనాగరిలో వుండడం గమనించదగ్గ అంశం.” శ్రీగణాధి పతయే నమః” అని శాసనం మొదలవుతుంది.
కాగా చరిత్ర, శాసనాలు, భాషల గురించి పరిశోధించే వారికి ఇటువంటి శాసనాలు ఎంతో ఉపయోగపడతాయని, శాసనాలను పరిరక్షించిన వారు సమాజానికి మేలు చేసినవారని చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి వివరించారు. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్న పెనుకొండ ఐముక్తేశ్వరాలయాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కేంద్ర పురాతత్వ శాఖ ముందుకు రావాలని మైనాస్వామి విజ్ఞప్తి చేశారు.
గర్భగుడి, అంతరాళం, ముఖమండపం, మహామండపం, రంగమండపం, యాగ మండపాలతో ముక్తేశ్వర సన్నిధి సంపూర్ణ గుడిగా భాసిల్లుతున్నది. గుడి గోపురం, ప్రవేశం పడమర వైపున్నా, ఆలయం తూర్పునకు అభిముఖంగా వుంది. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంది. విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన అరుదైన ఆలయాల్లో ఐముక్తేశ్వర సన్నిధి ఒకటి.