థ్రిల్లర్ స్టోరీ ని మరిపించే మర్డర్ కేసు !

Sharing is Caring...

A gruesome murder story…………………………………

శ్రద్ధా వాకర్ హత్య  తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. కొడుకు సాయంతో కట్టుకున్న భర్తను కిరాతకంగా హతమార్చిన భార్యను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త బాడీని 10 ముక్కలుగా నరికిన ఆమె వాటిని ఫ్రిజ్ లో స్టోర్ చేసింది. ఆ తర్వాత ముక్కలను తీసుకెళ్లి ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలో తల్లీ కొడుకు కలిసి వెళ్లి పారేశారు.

జూన్ లో  ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. హత్య జరిగిన తీరు, ఆపై నేరాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు నేరస్తులు పడిన పాట్లు క్రైం థ్రిల్లర్ స్టోరీ ని మరిపించే విధంగా ఉన్నాయి.

జూన్ 5న పాండవ్ నగర్లోని ఒక ప్రాంతంలో దుర్వాసన వస్తోందని పెట్రోలింగ్ టీం పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. ఆ దుర్వాసన వస్తున్న వైపుగా వెళ్లి వెతకగా.. పొదల్లోని ఒక బ్యాగ్ లో మనిషి దేహపు ముక్కలు కనిపించాయి.బ్యాగ్ లో కుళ్లిపోయిన స్థితిలో మనిషి బాడీ పార్ట్స్ ను పోలీసులు గుర్తించారు.

అయితే.. ఆ బాడీ పార్ట్స్ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది గుర్తించడం పోలీసులకు సవాల్ గా మారింది. సమీప పోలీస్ స్టేషన్లకు వెళ్లి మిస్సింగ్ కేసు ఫిర్యాదులు అందాయేమోనని దర్యాప్తు బృందం ఆరా తీసింది. అయితే అలాంటి ఫిర్యాదులేవీ అందలేదని సమాధానం వచ్చింది. దీంతో.. ఈ కేసు అంత తొందరగా తేలేది కాదని పోలీసులు భావించారు.

యూపీ తో పాటు సమీప పొరుగు రాష్ట్రాల్లో కూడా రికార్డులను పరిశీలించారు. ప్రయోజనం లేకుండా పోయింది.మొత్తానికి అంజన్ దాస్ అనే వ్యక్తి కనిపించడం లేదని పోలీసులు విచారణలో గుర్తించారు. త్రిలోక్ పరి ప్రాంతంలో భార్య పూనం, దీపక్ తో కలిసి అంజన్ దాస్ కలిసి ఉండేవాడని కనుగొన్నారు. అయితే.. అంజన్ దాస్ కనిపించకపోయినా భార్య, కొడుకు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులకు అనుమానమొచ్చింది.

అంజన్ దాస్ కనిపించకుండా పోవడం, గుర్తు తెలియని మృతదేహపు ముక్కలు బ్యాగ్ లో లభించడంపై పూనమ్, దీపక్ ను పోలీసులు విచారించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఈ మర్డర్ మిస్టరీ గుట్టును పూనమ్ బయటపెట్టింది. అంజన్ ను తామే చంపేసినట్లు ఒప్పుకుంది. అంత కిరాతకంగా చంపడానికి కారణం కూడా పోలీసులకు చెప్పింది.

తన కొడుకు దీపక్ భార్యపై అంజన్ దాస్ కన్నేశాడని, అంతేకాకుండా విడాకులు తీసుకుని తమతో పాటే ఉంటున్న కూతురిని కూడా లైంగిక వాంఛతో చూసేవాడని పూనమ్ చెప్పింది.ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. పూనమ్ అంజన్ దాస్ మొదటి భర్త కాదు. ఆమెకు చాలా చిన్న వయసులో బీహార్ కి చెందిన  సుఖదేవ్ తివారీ అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లైన కొన్నాళ్లకు సుఖ్ దేవ్ బతుకుదెరువు కోసం ఒక్కడే ఢిల్లీకి వెళ్లాడు.

నెలలు గడుస్తున్నా సుఖదేవ్ రాకపోవడంతో అతనిని వెతుక్కుంటూ పూనమ్ కూడా ఢిల్లీకి వెళ్లింది. సుఖదేవ్ కనిపించలేదు. ఆ సమయంలోనే ఢిల్లీలో కల్లూ అనే వ్యక్తితో పూనమ్ సహజీవనం చేసింది. కల్లూ పూనమ్ ని హింసించేవాడు. కొన్నాళ్లకు అనారోగ్యం కారణంగా కల్లూ చనిపోయాడు.

ఆ తర్వాత ఒంటరిగా ఉంటున్న పూనమ్ లిఫ్ట్ ఆపరేటర్ అయిన అంజన్ దాస్ తో సహ జీవనం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇలా పూనమ్, అంజన్ దాస్ కలసి జీవిస్తున్నారు. అయితే.. తన కొడుకు భార్యపై అంజన్ దాస్ కన్నేశాడని గుర్తించిన పూనమ్ విషయాన్ని దీపక్ కి చెప్పింది.

ఇద్దరూ కలిసి అంజన్ హత్యకు కుట్ర పన్నారు. ఈ కుట్రలో భాగంగా.. మే 30న అంజన్ తో పూనమ్, దీపక్ మందు తాగించారు. అందులో ముందుగానే అంజన్ కు తెలియకుండా నిద్రమాత్రలు కలిపారు. అంజన్ స్పృహ కోల్పోయాక ఇద్దరూ కలిసి అంజన్  ను దారుణంగా గొంతులో, ఇతర శరీర భాగాల్లో పొడిచి పొడిచి చంపారు. ఆ రాత్రంతా అంజన్ శవాన్ని ఇంట్లోనే ఉంచారు.

మరుసటి రోజు రక్తపు మరకలైన ఇంటిని శుభ్రం చేశారు. ఆ తర్వాత.. అంజన్ మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికారు. నరికాక ఆ బాడీ పార్ట్స్ ను ఫ్రిడ్జ్ లో ఉంచారు. ఆ తర్వాత ప్రతిరోజు రాత్రి ఒక బ్యాగ్లో కొన్నికొన్ని బాడీ పార్ట్స్ వేసుకుని పాండవ్ నగర్ వెళ్లి ఆ సమీప ప్రాంతాల్లో పడేసి వచ్చేవారు.

తల్లీకొడుకు ఇద్దరూ వెళ్లేవారు. ఇలా 10 రోజుల్లో బాడీ పార్ట్స్ ను పడేసారు. ఇలా.. బాడీ పార్ట్స్ పడేయటానికి ఈ తల్లీ కొడుకులు వెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పూనమ్, దీపక్ లను అరెస్ట్ చేశారు. కేసు నడుస్తోంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!