Behind the scenes ………………………
దర్శకుడు రమేష్ సిప్పీ తీసిన షోలే (1975) సినిమా కథ కాపీ అని కొన్ని క్యారెక్టర్స్ ను ఇంగ్లీష్ సినిమాల నుంచి తీసుకొచ్చారనే విమర్శలు ఉన్నప్పటికీ ఆ సినిమా సాధించిన విజయం అపూర్వమే. ఆ విజయం వెనుక కళాకారుల ,సాంకేతిక నిపుణుల కృషి ఉంది.ఆ స్థాయిలో మరే సినిమా ఇప్పటివరకు రికార్డ్స్ సృష్టించలేదు.ఈ సినిమాకు సంబంధించిన తెర వెనుక విశేషాలు,చాలామందికి తెలియని సంగతులు చాలానే ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
@ షోలే ముంబైలోని మినర్వా థియేటర్‌లో 1975 నుండి 1980 వరకు ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా ప్రదర్శితమైంది.@ షోలే భారతదేశంలో మొట్టమొదటి 70 mm, స్టీరియో ఫోనిక్ సౌండ్ ఫిల్మ్. కానీ మినర్వా థియేటర్‌లో ప్రీమియర్ 35 mm ప్రింట్‌తో నే ప్రదర్శితమైంది.
@ కథ ఫైనల్ అయ్యాక సంజీవ్ కుమార్ ‘గబ్బర్’ పాత్రను పోషించాలని ఉబలాటపడ్డాడు. దర్శకుడు రమేష్ సిప్పీ అతగాడిని ఒప్పించి ఠాకూర్ పాత్ర చేయించాడు. అలాగే ధర్మేంద్ర కూడా ఠాకూర్ పాత్రను పోషించాలనుకున్నాడు. ఠాకూర్, గబ్బర్ పాత్రలే కథలో కేంద్రబిందువులని ధర్మేంద్ర భావించాడు.
పాత్రలను మార్చుకుంటే, సంజీవ్ కుమార్ హేమ మాలినికి దగ్గరై పోతాడని వివరించడం ద్వారా దర్శకుడు రమేష్ సిప్పీ ధర్మేంద్రను వీరు పాత్రకు తెలివిగా ఒప్పించాడు. ధర్మేంద్ర-హేమ ప్రేమ అపుడే ప్రారంభమైంది. సంజీవ్ అప్పటికే ఒకసారి హేమకు ప్రపోజ్ చేశాడని అంటారు. .
@ జై పాత్రకు మొదట శత్రుఘ్నసిన్హా ను అనుకున్నారు. జై పాత్రకు అమితాబ్ బచ్చన్‌ను సిఫార్సు చేసింది సలీం ఖాన్. జంజీర్ సినిమా లో అమితాబ్ పెర్ఫార్మన్స్ గురించి తెలుసుకుని దర్శకుడు రమేష్ సిప్పీతుది నిర్ణయం తీసుకున్నాడు.ధర్మేంద్ర కూడా అమితాబ్ గురించి చెప్పాడు.
@ నటుడు దిలీప్ కుమార్ ను మొదట ఠాకూర్ బల్దేవ్ సింగ్ పాత్ర చేయమని కోరారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు.సినిమా సూపర్ హిట్ అయ్యాక తాను బాధపడ్డాడని సలీం ఖాన్ ఒక సందర్భంలో చెప్పారు
@ డానీ డెంజోంగ్ప ను మొదట గబ్బర్ సింగ్ పాత్రకు అనుకున్నారు..అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ‘ధర్మాత్మ’ షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నాడు.. డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమని చెప్పారట.
@ సూర్యాస్తమయ సమయంలో రాధ (జయ బచ్చన్) దీపాలు ఆర్పివేస్తుండగా, జై (అమితాబ్ బచ్చన్) హార్మోనికా వాయించే ఒక నిమిషం సన్నివేశాన్ని సినిమాటోగ్రాఫర్ ద్వారకా దివేచా చిత్రీకరించడానికి 20 రోజులు పట్టింది. ఎందుకంటే ఈ సన్నివేశాలకు సూర్యాస్తమయం.. రాత్రి మధ్య కొన్ని నిమిషాలు ఆకాశంలో బంగారు రంగు కిరణాలు అవసరమని రమేష్, దివేచా భావించారు.
@ గబ్బర్ ఠాకూర్ కుటుంబాన్ని నిర్మూలించే మారణహోమం సన్నివేశం – మూడు షెడ్యూల్‌లలో ఇరవై మూడు రోజుల్లో చిత్రీకరించారు. @సలీం ఖాన్ తండ్రి బంది పోటు గబ్రా గురించి చెప్పాడు..సలీం మరి కొన్ని వివరాలు సేకరించారు..అలా గబ్బర్ సింగ్ పాత్ర పుట్టుకొచ్చింది. కథలో ఠాకూర్ బల్దేవ్ సింగ్ పాత్ర మొదట రిటైర్డ్ సైనికుడు తర్వాత పోలీసు అధికారి గా మార్చారు.
@ షూటింగ్ ప్రారంభంలో ఆరు నెలల్లో సినిమా తీయడం అయిపోతుందనుకున్నారు.అయితే ఒక సంవత్సరం పాటు కొనసాగింది. వివిధ నటుల డేట్స్ సర్దుబాటు కావడం కష్టమైంది. ఈ నటులతో సినిమాలు పూర్తి చేయాల్సిన చాలా మంది నిర్మాతలు తమ నిర్మాణాన్ని బెంగళూరుకు తరలించారు.
@ గబ్బర్ రహస్య స్థావరం సీన్స్ బెంగళూరు సమీపంలోని రామనాగ్రలో చిత్రీకరించారు.అక్కడ కొంత భాగానికి దర్శకుడు రమేష్ సిప్పీ గౌరవార్థం సిప్పీ నగర్ అని పేరు పెట్టారు.
@ గబ్బర్ సింగ్ ను సైనిక దుస్తులు ధరించే ఆధునిక దోపిడీదారుడిగా చూపించారు. గతంలో బందిపోట్లు చంబల్ లోయలో ధోతీ-కుర్తా ధరించేవారు. ముంబైలోని చోర్ బజార్ నుండి కొనుగోలు చేసిన యూనిఫాం గబ్బర్ సింగ్ కి బాగా సూట్ అయింది.
@ గబ్బర్ సింగ్ పాత్ర ఎంత పాపులర్ అయిందంటే ‘బ్రిటానియా బిస్కట్స్’ సంస్థ అంజాద్ ఖాన్ బిస్కెట్లు తింటున్నట్లు ఒక వాణిజ్య ప్రకటన విడుదల చేసింది. ఒక కంపెనీ తన ఉత్పత్తులను ప్రచారం చేయడానికి విలన్ పాత్రను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఈ ప్రకటన పిల్లలను బాగా ఆకట్టుకుంది. ఫలితంగా అమ్మకాలు రెట్టింపు అయ్యాయి.
@ గ్లూకోజ్ బిస్కెట్ నుండి గ్రైప్ వాటర్ వరకు, మార్కెట్లో విస్తృత శ్రేణి వస్తువులను విక్రయించడానికి ‘షోలే’ను ఉపయోగించారు. ఐవా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రకటనలలో…ఛానల్ V స్పూఫ్‌లలో కాపీ రైటర్లు దీనిని ఉపయోగించారు.
@ షోలే కథ మొదట దర్శకుడు ప్రకాష్ మెహ్రా వద్దకు వెళ్ళింది. ఆయన ‘జంజీర్’తో బిజీగా ఉన్నాడు.చివరికి కథ రమేష్ సిప్పీ చేతుల్లోకి వచ్చింది. @ ఒకదశలో నటుడు ప్రాణ్ ను ఠాకూర్ పాత్రకు అనుకున్నారు. కానీ రమేష్ సిప్పీ సంజీవ్ కుమార్ ప్రతిభను నమ్మాడు.
@ సినిమాలో జై పాత్ర నాణెం తిప్పే ట్రిక్ నేరుగా గార్డెన్ ఆఫ్ ఈవిల్ లోని గ్యారీ కూపర్ నుండి తీసుకున్నారు. ఆ చిత్రంలో, గ్యారీ కూపర్, రిచర్డ్ విడ్మార్క్ అపాచెస్ తో పోరాడటానికి ఎవరు ముందు వెళతారో ?ఎవరు వెనుక ఉంటారో నిర్ణయించడానికి నాణేన్ని గాల్లోకి ఎగుర వేస్తారు.
@ ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ ఊచకోత కోసే సన్నివేశం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్’ నుండి తీసుకున్నారు. సలీం-జావేద్లు హాలీవుడ్ వెస్ట్రన్ సినిమాలను ప్రేరణగా తీసుకున్నారు.. కొన్నిపాత హిందీ సినిమాలను ప్రేరణ గా ఎంచుకున్నారు.ఉదాహరణకు, రాజ్ ఖోస్లా 1971లో నిర్మించిన ‘మేరా గావ్ మేరా దేశ్’ చిత్రంలో ఒక చేయి ఉన్న వ్యక్తి పాత్ర ఒకటి ఉంది .ఆ పాత్ర ప్రేరణతో ఠాకూర్ పాత్ర కు రూప కల్పన చేశారు.
@ముందుగా సినిమాలో మెహబూబా పాటను అనుకోలేదు ..తర్వాత పెట్టారు.. ఈ సినిమాకు తొలుత అనుకున్న టైటిల్ ‘అంగారే‘ తర్వాత షోలే గా మారింది షోలే పేరు మీద ప్రముఖ దర్శకుడు 1953 లో ఒక సినిమా తీశారు. ఆ కథకు ఈ కథకు సంబంధం లేదు.
——- KNM