మళ్ళీ తెర పైకి ఘట్టమనేని రమేష్ !

Sharing is Caring...

సూపర్  స్టార్ .. సుప్రసిద్ధ నటుడు కృష్ణ కుమారుడు,హీరో మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నకొత్త సినిమాలో రమేష్ బాబు మంచి క్యారెక్టర్ లో నటించబోతున్నారు.  ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలకపాత్ర రమేష్ దే అంటున్నారు. రమేష్ సోదరి మంజుల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మంజుల ఇప్పటికే నిర్మాతగా,  నటిగా, దర్శకురాలిగా గుర్తింపు సంపాదించారు.’ మనసుకు నచ్చింది ‘సినిమాను డైరెక్ట్ చేసి తన ప్రతిభను చాటుకున్నారు. రమేష్ నటించబోతున్న సినిమాకు కథ కథనం కూడా మంజుల సమకూరుస్తున్నారని తెలుస్తోంది.ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. త్వరలో అన్నివివరాలు ప్రకటించనున్నారు.

ఇక రమేష్ గురించి చెప్పుకోవాలంటే బాలనటుడిగా కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చదువుకుంటూనే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో  వచ్చిన ‘నీడ’, ‘పాలు నీళ్లు’ చిత్రాల్లో  రమేష్ బాబు నటించారు. ఆ రెండు చిత్రాల ద్వారా రమేష్ కి మంచి గుర్తింపు వచ్చింది.1987 లో ‘సామ్రాట్’ సినిమా ద్వారా రమేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా తొలి విజయం అందుకున్న రమేష్  ‘చిన్ని కృష్ణుడు’, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్’ ‘ముగ్గురు కొడుకులు’, కృష్ణ గారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, ఆయుధం వంటి పలు చిత్రాల్లో నటించాడు. వీటిలో కొన్ని బాగా ఆడాయి. మరికొన్ని ఆశించిన స్థాయిలో ఆడలేదు. 1997 లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్‌కౌంటర్’ చిత్రంలో చివరసారిగా కనిపించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, ఆయుధం, ఎన్కౌంటర్ చిత్రాల్లో నటించారు. తమ్ముడు మహేష్ బాబుతో కలిసి ‘బజారు రౌడీ’, ‘ముగ్గురు కొడుకులు’ చిత్రంలో నటించారు. ఈ ముగ్గురు కొడుకులు సినిమాకు కృష్ణ దర్శకత్వం వహించారు.ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఎన్కౌంటర్  తర్వాత రమేష్ బాబు ఏ చిత్రంలో నటించలేదు. నటించిన సినిమాలు తక్కువే అయినా మంచి పాత్రల్లో నటించారు. అయితే కెరీర్ అనుకున్నస్థాయికి చేరుకోలేదు. అయినా రమేష్ నిరాశ పడలేదు. చిత్రసీమకు దూరంకాలేదు.

రమేష్ కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే మృదులతో పెళ్లి అయింది. సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన మృదుల తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అత్తమామలను బాగా చూసుకోవటమే కాకుండా మరిది మహేష్ బాబు,ఆడపడుచులు పద్మావతి,మంజుల,ప్రియదర్శిని పట్ల ఎంతో ప్రేమానురాగాలను చూపేది అంటారు. రమేష  కృష్ణ ప్రొడక్షన్ హౌస్ సంస్థను స్థాపించి మహేష్ బాబు హీరోగా ‘అర్జున్’ ‘అతిథి’ చిత్రాలను తెరకెక్కించాడు. అలాగే ‘దూకుడు’‘ఆగడు’వంటి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. సినిమా నిర్మాణంలో రమేష్ కు మృదుల సహాయ పడేవారు. ప్రొడక్షన్ వ్యవహారాలను చూసేవారు. రమేష్ బాబు,మృదుల దంపతులకు భారతి,జయకృష్ణ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జయకృష్ణ  కూడా త్వరలో  హీరోగా వెండితెర కు పరిచయం కానున్నారు.   ఇప్పటికే జయకృష్ణ  యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ లో శిక్షణ పొందుతున్నాడు. జయకృష్ణ  ‘నిజం’ సినిమాలో చిన్నప్పటి మహేశ్ బాబుగా కనిపించాడు. 

ఇక  రమేష్ నటించబోతున్న సినిమాకు దర్శకత్వం వహించనున్న మంజుల  కృష్ణ, ఇందిరాదేవీల మూడవ సంతానం, మొదటి కూతురు. ఈమెకు ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఈమె దర్శక నిర్మాత సంజయ్ స్వరూప్ ను వివాహం చేసుకున్నారు. మొదటి నుంచి మంజుల కు కూడా సినిమాలంటే ఆసక్తి ఎక్కువే. 1999 లో ‘రాజస్థాన్’ అనే తమిళ చిత్రంలో నటించడం ద్వారా  సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ‘సమ్మర్ ఇన్ బెత్లెహెం’ అనే మలయాళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించారు. 2002 లో ‘షో’ సినిమా నిర్మించి  అందరి మెప్పు పొందారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం,, ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాలు లభించాయి.

మంజుల తల్లి పేరిట ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు తీస్తున్నారు. నాని,పోకిరి,కావ్యాస్ డైరీ, ఏం మాయ చేసావే , మనసుకు నచ్చింది సినిమాలు తీశారు. మనసుకు నచ్చింది చిత్రాన్ని తానే డైరెక్ట్  చేశారు. ఒక సినిమా పూర్తికాగానే వెంటనే మరొకటి చేయడం మంజులకు నచ్చదు. మంచి కథ ఎంచుకుని … ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించేలా దాన్ని తయారుచేసుకుని షూటింగ్ కు వెళతారు. మొదటి సినిమా అలాగే చేశారు. ఇపుడు తీస్తున్న తాజా చిత్రం లో అన్న రమేష్ క్యారెక్టర్ పై మంజుల దృష్టి సారించారు. రమేష్ సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా మొదలు కావాలని ఆమె ఆశిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో కూడా ఒక సినిమా తీయబోతున్నారు. 

———– KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!