Constraints of opponents……………………………….
చైనా అధ్యక్షునిగా మూడోసారి జీ జిన్‌పింగ్ నియమితులయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఆయన గద్దె దిగిపోవాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు బీజింగ్‌లోని సిటాంగ్ ఫ్లై ఓవర్‌పై రెండు బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ విధమైన నిరసనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. వైరల్ అయ్యాయి.
కాగా ఒక బ్యానర్ లో “మాకు ఆహారం కావాలి, కోవిడ్ పరీక్షలు కాదు. స్వేచ్ఛ కావాలి, లాక్‌డౌన్‌లు కాదు. మాకు గౌరవం కావాలి, అబద్ధాలు కాదు. సంస్కరణలు కావాలి, సాంస్కృతిక విప్లవం కాదు. మాకు ఓటే కావాలి, నాయకుడు కాదు. మేము బానిసలుగా కాకుండా పౌరులుగా జీవించాలనుకుంటున్నాం.” అని రాశారు.రెండవ బ్యానర్లో ‘‘పాఠశాలలను బహిష్కరించండి. సమ్మె చేయండి, నియంత జీ జిన్‌పింగ్‌ను తొలగించండి’’ అంటూ రాశారు.
ఈ బ్యానర్లు ఉన్న ఫోటోలు పాశ్చాత్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది గమనించిన అధికారులు చైనా ఇంటర్నెట్ “గ్రేట్ ఫైర్‌వాల్” ప్లాట్‌ఫారమ్‌ల నుండి వాటిని తొలగించారు.
కాగా జీ జిన్‌పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు జిన్ పింగ్ కఠిన ఆంక్షలను అమలు చేశారు.
లక్షలాది మందిని క్వారంటైన్‌లో పెట్టారు. ప్రజలకు సదుపాయాలు కల్పించకుండా ఇళ్లలో కట్టడి చేశారు. దీంతో ఆయనపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నెల 16న ఆయన పునర్నియామకం జరగవచ్చు.
ఈ నెల 16 న జరగనున్న కీలక రాజకీయ సమావేశానికి ముందుగా అసమ్మతి వాదులను అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ విమర్శకులపై నిఘా పెట్టి ,వేధింపులకు గురి చేస్తున్నారు.సెప్టెంబరు నుంచే ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న అనేక మంది కార్యకర్తలను చైనా అంతటా నిర్బంధించారు.కొందరిని గృహనిర్బంధంలో ఉంచారు.ఈ క్రమంలోనే చాలామంది మంది మానవ హక్కుల న్యాయవాదులను బెదిరించారు.వేధింపులకు గురిచేశారనే వార్తలు ప్రచారం లో ఉన్నాయి.