తిరుమలగిరి సురేందర్…………………………………………….
పాత్రికేయులు, వారి కుటుంబాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాల్సిన ప్రెస్‌క్లబ్ అవినీతికీ, కుళ్లు రాజకీయాలకు వేదికగా మారింది. రెండు దశాబ్ధాలుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రహసనంగా మారిపోయాయి. కొద్దీ రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో దౌర్జన్యకాండ చోటు చేసుకోవడం క్లబ్ రాజకీయాల పతనావస్థకు పరాకాష్టగా భావించవచ్చు.
ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులు ఎగబడటం, ప్రచార ఖర్చులు చూస్తుంటే వెనకాల ఏదో మతలబు ఉందా? అనే అనుమానాలు కలగడం సహజం. ఏరకంగానూ ప్రెస్ క్లబ్ ఉన్నతికి పాటుపడని యూనియన్లు, పత్రికా సంస్థలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడం చిత్రం. ఇదంతా దేనికి అనే సందేహం కలుగక మానదు.
పత్రికల ఎడిటర్లు, బ్యూరో చీఫులు, ప్రభుత్వ సలహాదారులు, వచ్చి ఎన్నికల రోజు గేటు దగ్గర నిలబడి ఓట్లు వేయించడం దేనికి సంకేతమో అర్థం కాని పరిస్థితి. రెండు ప్రధాన పత్రికలు ఈ ఎన్నికలలో తమ స్టాఫ్ తప్పనిసరిగా గెలవాలనే పట్టుదలతో వ్యవహరించాయని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పొరుగు రాష్ట్రంలో క్యాబినెట్ హోదాతో పనిచేస్తున్న ఒక సీనియర్ పాత్రికేయుడు కూడా వచ్చి నిలబడి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని పట్టుదలతో ర్యాంపు మీద తిరగడం మరో వైచిత్రి.
ఇవన్నీ చూసేవారికి చాలా ఎబ్బెట్టుగానూ, వింతగానూ, కొండొకచో వికృతంగా అనిపించాయి. ఈ ఎన్నికల్లో చెల్లని ఓట్ల పై అభ్యంతరాలను పట్టించుకోకపోవడం, దుండగులు బ్యాలెట్ బాక్స్ ఎత్తుకొని పోవడం, అందులో నీళ్లు పోసి తీసుకువచ్చి అప్పగించడం, లెక్కింపు పూర్తయినా ఫలితాలు ప్రకటించగలిగే పరిస్థితి ఎన్నికల అధికారులకు లేకపోవడం చూస్తుంటే అసలు ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఎందుకు జరుగుతాయి.దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే ప్రశ్నలు పదేపదే తలెత్తుతాయి.
పైగా కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఆధిపత్యపోరు సాగుతోంది. విజ్ఞత గల సభ్యులు నిస్సహాయంగా చూస్తూ భరిస్తున్నారు. దీనిపై సహకార చట్టం కింద విచారణ జరిపించి, లోపలి వ్యవహారాలపై లోతైన దర్యాప్తు కూడా జరిపిస్తే కొంతయినా స్పష్టత వస్తుందేమో. అవినీతికి, కుళ్లు రాజకీయాలకూ, కులాల కుట్రలకూ ఆలవాలమైన ప్రెస్ క్లబ్ ఎన్నికలను రద్దు చేయాలని పలువురు పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా ప్రెస్‌క్లబ్ ఎన్నికల ఫలితాలపై నాంపల్లి సిటీ సివిల్ కోర్టుస్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఫలితాలు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాలకు కారణమయ్యాయి.