సూర్యుని శబ్దం “ఓంకారం”… నిజమెంత ?

Sharing is Caring...

పులి ఓబుల్ రెడ్డి………………………………………………….

అనంత విశ్వంలో ఉన్న ప్రతి నక్షత్రం తనకంటూ ప్రత్యేకమైన ఒక శబ్దాన్ని వెలువరిస్తుందనీ ( ఆ నక్షత్రం పై జరిగే రసాయన చర్యలను శబ్దరూపంలోకి మార్చితే ) ఆ శబ్దం మరి ఏ ఇతర నక్షత్రాలతో సరిపోలదనీ నాసా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అలాగే వారు సూర్యుని నుండి వెలువడే శబ్దాన్ని కూడా బహిరంగపరిచారు.

అది “ఓంకారం”ని పోలి ఉందని కొందరు ప్రచారం కల్పించినా, అది అసత్యమని నిర్థారణ అయింది. వివరాలకై ఈ వీడియోని చూడగలరు. https://youtu.be/CRu_hG3X3bI

నిజానికి “ఓంకారం” అనేది భౌతికమైన సూర్యునికో, భౌతికమైన మరే దానికో మన సనాతన ధర్మ శాస్త్ర విజ్ఞానంలో ఎక్కడా అన్వయింపబడలేదు. అది భౌతికత్వానికి అతీతం.

సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్యత : 8

ధ్వనులలో లేదా అక్షరాలలో ఓంకారానికి ఇంత ప్రత్యేక ప్రశస్తి ఎందుకు వచ్చిందని ప్రశ్నస్తే,  ” మన మనసులో ఉన్న ప్రతి భావానికీ సంబంధించి భౌతిక ప్రపంచంలో ఏదో ఒక వస్తువు ఉండి తీరుతుంది.” అనే సమాధానం వస్తుంది.
ఒక భావన వచ్చినప్పుడు ఆ వస్తువే స్ఫురిస్తే అది శబ్దం అవుతుంది.

అక్షరాలు కలిసినదే శబ్దం కదా. అంటే భావము, అక్షరము అవిభాజ్యమైనవి. “ఓంకారం” విషయంలో గమనించాల్సిందిదే. ఇది సమస్త సృష్టి వైవిధ్యానికి బీజరూపం. ఒకరకంగా సంకేత ప్రకటన. “ఓం” అనే అక్షరం అకార, ఉకార, మకారాలు కలిసి ఏర్పడినది.

వీటిలో ‘అ’ అక్షరం నోటి నుండి నాలుక సహాయం లేకుండానే వెలువడుతుంది. ఇది నిరామయం, నిరావలంబ స్థితి. ‘మ’ అక్షరం రెండు పెదవుల కలయికతో వెలువడుతుంది. ‘ఉ’ అక్షరం నోటిలోని స్వరస్థానపు ఆధారస్పర్శతో వస్తుంది. ఈవిధంగా “ఓం” అక్షరం సృష్టి, స్థితి, లయలకు సంకేతం.

దీనికి రూపం లేదు. అనాదిగా ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ఇలా భారతదేశంలోని అన్ని సాంప్రదాయాల వారు తాము ఏ భగవతారాధన చేసినా, రూపార్చన చేసినా  “ఓం” కారాన్ని నిరంకార పదార్థ, నిరాకార పదార్థ, సత్య నిత్య స్వరూప నిగమాగమంగా సంభావన చేస్తున్నారు.

ఈ “ఓం”కారమే అహం ( నేను – ఓంకారో హమేవ ), ఈ అహమే ఆత్మ, ఆత్మయే పరమాత్మ / బ్రహ్మం. ఓంకారానికి ప్రణవం, ఉద్గీథం, ఏకాక్షరం, తారకం, శబ్ద బ్రహ్మం అనే నామాంతరాలు ఉన్నాయి. “ఓం” అనే అక్షరం త్రిమూర్త్యాత్మకమనీ, సృష్టి – స్థితి – లయలకు సంకేతమనీ, ఇందులో భగవంతుడి సర్వవ్యాపకత్వం, పోషకత్వం, యథార్థరూపం ఉన్నాయనీ బ్రహ్మవేత్తల అభిప్రాయం.

ఓంకారం జ్ఞానరూపంలో ఉండే చైతన్యం. అందువల్ల ప్రపంచంలో జరిగే సమస్త కార్యకలాపాలకు సాక్షిగా ఉంటుంది. సత్య స్వభావం దీని లక్షణం. పరమానందం దీని పరమావిధి. కాబట్టి మోక్షదాయకం అవుతుంది. సర్వ వేదాలకు మూలమైనదీ, సారమైనదీ ఓంకారమే ( ఓంకార సర్వవేదానాం సారః ). అది బ్రహ్మతత్వాన్ని ప్రకాశింపజేస్తుంది ( తత్వ ప్రకాశకః ). మోక్షం కోరేవారికి చిత్త సమాధానం కలిగిస్తుంది ( తౌనచిత్త సమాధానం ముమూక్షూణాం ప్రకాశ్యతే ).

సంగ్రహంగా చెప్పాలంటే ఓంకారం భగవంతుడి అభిదానం (పేరు), అభిదేయం (పేరుతో పిలువబడేది). కాబట్టి అభిదాన, అభిదేయాలు ఒక్కటే. అంటే ఓంకారమే భగవత్ స్వరూపం. భగవత్ స్వరూపమే ఓంకారం. ఓంకార లక్ష్యార్థమూ, వేదాంత మహావాక్య లక్ష్యార్థమూ ఒక్కటే. ఓంకార్ తత్వాన్ని వివేకజ్ఞానంతో తెలుసుకొని ఉపాసించేవాడే బ్రహ్మవిదుడు. స్వస్వరూప బ్రహ్మప్రాప్తికి అర్హుడు.

మూలం : అగ్ని మహా పురాణం.
చెణుకులు :
కొలతలకు సంబంధించి మనం వాడే మెట్రిక్ సిస్టమ్ (కి. మీ, మీ., సెం.మీ, మి.మీ… ) మొదట 1791లో ఫ్రాన్స్ లో ప్రతిపాదించబడింది. ఆచరణకు నోచుకొనేటప్పటికి 1837వ సం.  వచ్చింది.కానీ, మన సనాతన విజ్ఞానం అప్పటికి కొన్ని వేల  సంవత్సరాల క్రిందటే అంగుళంలో పంతొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల వంతు వరకు వివరించగలిగారంటే మీరు నమ్మగలరా…?!!!

1 అంగుళం   = 8 యవములు
1 యవము =  30 యూకములు
1 యూక = 30 నిష్కములు
1 నిష్కము = 30 కేశాగ్రములు
1 కేశాగ్రము = 30 త్రసరేణువులు
1 త్రసరేణువు = 30 పరమాణువులు.
మూలం : మార్కండేయ మహా పురాణం

ఇది కూడా చదవండి >>>>>>>  గ్రహాంతర వాసులను చేరుకోగలమా

 


 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!