కథల పోటీలో ఎంపికైన సస్పెన్స్ స్టోరీ !

Sharing is Caring...

” నా పేరు సురేష్ !  మిమ్మల్ని చూడగానే నాలో ప్రేమ పుట్టింది. దానికి కారణం నాకు తెలీదు. నా ప్రేమను మీరు అంగీకరించాలి.మిమ్మలని వివాహం చేసుకుంటాను ” అంటూ ఎదురుగా నిలుచుని చెబుతున్న ఆ అందమైన యువకుడిని కన్నార్పకుండా చూడసాగింది పరిమళ . నవ్వొచ్చింది ఆమెకి. ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు తటపటాయించి నెమ్మదిగా అడిగింది. ” నా గురించి అన్నీ తెలుసుకునే ఇలా ప్రపోజ్‌చేస్తున్నారా ? ” అని .

” అన్నీ తెలుసుకునే వచ్చాను ” స్థిరంగా చెప్పాడు సురేష్. ఒక్కసారిగా ఆలోచనలు చుట్టు ముట్టాయి ఆమెకి . ‘ తన గురించి ఏదేదో ఊహించుకుంటూ అతడు ఈ విధంగా ప్రపోజ్ చేసి ఉంటాడు. తను కూడా చాలా ఆలోచించాలి. అప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ‘ అనుకుంది. బాగా ఆలోచించి చివరికి సురేష్ ని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

పరిమళకు సురేష్ తో పెళ్ళయింది. కొత్త కాపురం ప్రారంభించారు. కానీ అతనో పెద్ద పేరసైట్‌ అని , కేవలం డబ్బు, సెక్స్‌కోసమే తనని పెళ్ళి చేసుకున్నాడని కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకుని బాధ పడ సాగింది  పరిమళ. రోజూ అతడు విపరీతంగా తాగి తనని టార్చర్‌పెడుతున్నా నిశ్శబ్దంగా భరించ సాగింది.
 —
రాత్రి పన్నెండు.. చిన్నగా ఏదో శబ్దం అవడంతో సురేష్ అలర్ట్ అయ్యాడు.  ఎవరో మనిషి నడిచి వస్తున్నట్లు శబ్దం. మొదట సారిగా భయపడ సాగాడు సురేష్. క్రమంగా ఆ ఆకారం అతడి దగ్గరగా వచ్చింది.
” ఏరా … నా భార్యని టార్చర్‌ చేస్తున్నావ్‌…ఎంత ధైర్యం రా నీకు “
” భార్యా ! అదెవరు ? ” అనుమానంగా అడిగాడు
” పరిమళ …పరిమళ నా భార్య. ఆమెకి ఏదైనా హాని తలపెడితే నీ అంతు చూస్తాను…జాగ్రత్త ” అని చెప్పి ఆ ఆకారం అదృశ్యమయింది.  
ఆ మాటలకు సురేష్ అదిరిపడ్డాడు. ‘పరిమళ తన భార్య కదా ? మరి వీడెవడో వాడి భార్య అంటాడేంటి ? అంతా కంఫ్యూజన్ గా ఉంది.ఇది పరిమళ తోనే తేల్చుకోవాల్సిన విషయం ‘అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు.  ఆమెని గట్టిగా అడిగాడు
” అవును … నాకు ఇంతకు ముందే పెళ్ళి అయింది. నా భర్త కేన్సర్ తో చనిపోయాడు  ” చిరాగ్గా చెప్పింది పరిమళ.
” అంటే నీ మొదటి మొగుడు ఆత్మగా మారి నన్ను హింసిస్తున్నాడన్న మాట ” భయంగా అన్నాడు
” ఏమో నాకు తెలీదు …బహుశా అది నీ భ్రమ కావచ్చు ” అంది పరిమళ
          * * *  
ఆ సాయంత్రం …పోలీస్ స్టేషన్ లో ఫోన్ రింగ్ అవసాగింది. కానిస్టేబుల్ రిసీవర్ ఎత్తి ” హలో …ఎవరూ ? ” అన్నాడు ” నేను…సురేష్ ని …దె య్యం..దెయ్యం… నన్ను చంపాలని చూస్తోంది…. ”  అంటూ ఏదో  చెబుతుండగా లైన్ కట్ అయింది. అనుమానం వచ్చి కానిస్టేబుల్ సురేష్ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ప్రాణాలు పోయిన సురేష్ శవమై పడి ఉన్నాడు. పోస్ట్ మార్టం లో ‘ ఏదో భయంకరమైన దృశ్యం చూసి అతని గుండె ఆగిపోయింది ‘ అని వ్రాసి కేస్ క్లోజ్ చేసేసారు పోలీసులు.
  * * *
పరిమళ మనసులో ఎన్నో సందేహాలు. సురేష్ అంతగా  భయపడి పోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఒక్క సారిగా ఒంటరి తనం ఆవహించింది. ఆమెకు తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు . వాళ్ళ దగ్గర పుట్టగానే వదిలేసిన తన కూతురు ‘ అక్షర ‘ కూడా గుర్తొచ్చింది… తను అప్పుడప్పుడు వస్తూ ఉండేది. అందంగా పెరిగిన అక్షర ని చూసి ఎంతో సంతోష పడేది పరిమళ.
గతానికి సంబంధించిన ఆలోనల్లో మునిగి తేలుతుండగా కాలింగ్ బెల్ మోగ సాగింది. వెళ్ళి తలుపు తీసింది పరిమళ.ఎదురుగా అక్షర !

” రామ్మా …రా లోనికి ” అంటూ ప్రేమగా ఆహ్వానించి వేడి వేడి కాఫీ కప్పులో పోసి తెచ్చింది పరిమళ. దాన్ని సిప్ చేస్తూ ” ఇంతకీ సురేష్ ఎలా చనిపోయాడనుకుంటున్నావమ్మా? ” అడిగింది అక్షర.
” ఏమో నమ్మా నాకూ అంతు బట్టడం లేదు. డాక్టర్లేమో హార్ట్ ఎటాక్ అని చెప్పారు. హార్ట్ ఎటాక్ రావల్సినంత దృశ్యం అతనేం చూసాడో నాకు అర్థం కావడం లేదు ” చెప్పింది పరిమళ.
” నాకు తెలుసమ్మా ” అంటూ బాంబ్ పేల్చింది అక్షర.

” మైగాడ్ ! నీకెలా తెలుసు ? ” విపరీతంగా ఆశ్చర్యపోయింది
” ఆ రోజు..అంటే నీ ఇప్పటి భర్త సురేష్ చనిపోయిన రోజు .. నిన్ను చూడాలనిపించి ఇక్కడికి వచ్చానమ్మా .. నీ కూతురు ని అని చెప్పాను. కానీ ఆ నీచుడు సురేష్ ఆకలి గొన్న పులిలా నా మీద దాడి చేసాడు.. వావి వరుసలు మరిచి నన్ను బలాత్కరించాలని చూసాడు. ఇంతలో ఏమయిందో ‘ దెయ్యం.. దెయ్యం ‘ అంటూ గట్టిగా అరిచి పడిపోయాడమ్మా.. నేను భయపడి వెంటనే వెళ్ళిపోయాను ” నెమ్మదిగా చెప్పింది.

” అవునా..అసలు ఈ దెయ్యం గొడవ ఏంటమ్మా.. ” అంటూ ఆశ్చర్యపోయింది పరిమళ
” అదేనమ్మా …నాకూ అర్థం కాలేదు చనిపోయిన నాన్న ఇలా ఆత్మ గా మారి వస్తున్నాడేమో ..మనల్ని సదా కాపాడుతున్నాడేమో ..” సందేహం వెలిబుచ్చింది అక్షర.
ఇంతలో ..సెల్ ఫోన్ రింగ్ అయింది. పరిమళ లిఫ్ట్ చేసి ” హలో..” అంది. 

” నేను..ప్రభాకరాన్ని …మీ మొదటి భర్త స్నేహితుడిని …గుర్తుపట్టారా..? ” అటునుండి వినపడిన స్వరం. ” ఓ ..మీరా.. చెప్పండి ” అంది పరిమళ
” నా స్నేహితుడు చనిపోతూ మీ బాగోగులు చూడమని నాకు చెప్పాడు..అందుకే నేను బ్రతికుండి కూడా దెయ్యం గా మారాల్సి వచ్చింది..మళ్ళీ నా అవసరం పడినప్పుడు వస్తాను ” అని నవ్వి ఫోన్ పెట్టేసాడు. ‘ దెయ్యం ‘ ఎవరో అర్థమైంది వాళ్ళీద్దరికీ.హేపీగా నవ్వుకున్నారు!!!
 
                  ——-00000———  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!