హిమాలయ శిఖరాల అంచుల్లో …..

Sharing is Caring...

Thopudu Bandi Sadiq Ali …………………….. The experience of climbing those hills

హిమాలయాలు ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్పిస్తుంటాయి.రాయిని,రాయిని పట్టుకొని ఒక్కో అడుగు అతి కష్టంగా వేస్తూ,ఏ క్షణంలో కాళ్ళు శక్తిని కోల్పోతాయో,ఎప్పుడు చెయ్యి పట్టు తప్పి పోతుందో చెప్పలేం. దాహంతో నాలుక పిడుచ కట్టుకు పోతుంటే ఎప్పుడు స్పృహ తప్పి పోతామో తెలియని మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి.

సర్వశక్తులూ ఒడ్డి నాలుగైదు గంటలు ప్రయాణం చేసి శిఖరాగ్రానికి చేరితే ఎదురుగా సువిశాల మైదానం . రివ్వున వీచే గాలులు. స్వాగతం పలికే పూలు,గుసగుసలు విన్పించే చిత్రమైన హిమాలయ గడ్డి పొదలు. అది అక్షరాలలో  ఇమడని అనుభవం.

శిఖరం చేరటమే కష్టం …కిందికి దిగటం చాలా సులభం అనే లోకోక్తిని ధిక్కరిస్తూ , ఎక్కటం చాలా కష్టం.  అదే దారిలో దిగటం దాదాపు అసాధ్యం అనే కొత్త అనుభవాన్ని నేర్పింది నా పాండవ్ ఖోలి ప్రయాణం. మనకు అర్ధమయ్యే భాషలో ప్రకృతి మాట్లాడుతుంది అన్నది కూడా నాకు అక్కడే అనుభవం లోకి వచ్చింది.

కుకాచిన్ లో బాబాజీ గుహ సందర్శనం అనంతరం అక్కడి నుంచి శిఖరాగ్రాన ఉన్న పాండవ్ ఖోలీకి ప్రయాణం ఒక అపురూపమైన అనుభవం.వాస్తవానికి అక్కడికి వెళ్ళడానికి రెండు దారులున్నాయి.ఒకటి మెట్లదారి. రెండోది పర్వత మార్గం.అత్యంత కఠిన మైన మార్గం ఇది.

కావాలనే దీన్ని ఎంచుకున్నాం.ఎందుకంటే మెట్లదారిలో కనిపించని ఎన్నో అద్భుతాలు ఈ మార్గంలో ఉంటాయని మాకు గైడ్ గా వ్యవహరించిన వ్యక్తి చెప్పాడు.ఇంత దూరం వచ్చి ఏ అద్భుతాన్నీ మిస్ అవ్వకూడదని పర్వత మార్గాన్ని ఎంచుకున్నాం.ఈ మార్గంలో దారీ తెన్నూ ఉండవు.కేవలం కొన్ని బండగుర్తులు మాత్రమే ఉంటాయి.అవి ఆ పర్వత వాసులకే తెలుస్తాయి.

అతను చూపిన దారిలో అతన్ని అనుసరిస్తూ ముందుకు సాగాం.అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం అది.చేతిలో ఓ కర్ర తప్ప ఎలాంటి రక్షణ సాధనాలు లేవు.చిత్ర విచిత్రమైన ఆకారాల్లోని రాళ్లు, వందల సంవత్సరాల వయసు ఉండి ఏపుగా పెరిగిన చెట్లు, చిన్నచిన్న తటాకాలు ఇవే గుర్తులు.  ఈ గుర్తుల ఆధారంగానే మా ప్రయాణం ముందుకు సాగింది.నిట్టనిలువు పర్వతం,పక్కకు తిరిగి చూస్తే అనంత అగాధం లాంటి లోయ.ఎక్కడో అట్టడుగున ఉధృతంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహ శబ్దం.ప్రతీ అడుగు రొమాంచితమే.

కొన్నిచోట్ల ఏటవాలు మైదానాలు,అందులో గుబురుగా పెరిగిన చెట్లు.ఎంత దట్టంగా ఉంటాయి అంటే సూర్యరశ్మి నేలపైన పడదు.నాచు పేరుకుపోయి ఉంటుంది.అడుగు తీసి అడుగు వేస్తే జర్రున జారిపోతుంటుంది.కొన్ని చోట్ల మోకాలు లోతు బురదలో కూరుకుపోతుంటాం.అక్కడక్కడ చీకటి గుహలు,జంతువుల అరుపులు,పక్షుల ధ్వనులు విన్పిస్తుంటాయి.

ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నా దారితప్పటం ఖాయం.ముందువాళ్ళూ,వెనుకవాళ్ళూ కనిపించరు. మార్గం ప్రమాదకరమైనదే అయినా అదో రొమాంచిత అనుభవం.ఆద్యంతం ఉత్కంఠభరితం. నాలుగైదు గంటలు అలా ప్రయాణించిన తర్వాత శిఖరాగ్రాన ఉన్న సువిశాల గడ్డి మైదానంలోకి అడుగు పెడతాం.అక్కడ ఏపుగా పెరిగిన గడ్డి గాలికి సంగీతం విన్పిస్తోంది.

రంగురంగుల పూలు కనువిందు చేస్తాయి.ఆ ప్రాంతమే పాండవ్ ఖోలీ. దూరంగా ఒక ఆశ్రమం అతిధుల కోసం ఎదురు చూస్తుంటుంది.పక్కనే పెద్ద పెద్ద లోయలు.ఐదారు వరుసల హిమాలయ పర్వత శ్రేణులు.ఆ పర్వతాలు చైనా భూభాగంలో ఉన్నాయని చెప్తూ మమ్మల్ని ఆశ్రమంలోకి తీసుకెళ్లాడు.

ఫైర్ బ్రాండ్ సాధ్వి ఉమాభారతి,సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ ఆశ్రమంలో ఆతిధ్యం స్వీకరించారు అని చెప్పాడు.బయటి ప్రపంచంలో ఎంతటి గొప్పవారైనా ఇక్కడిదాకా చేరారంటే వారు సామాన్యులే, సత్యాన్వేషులే, జ్ఞాన పిపాసులే అని చెప్పారు అక్కడి ఆశ్రమ నిర్వహకులైన స్వామీజీ. ఈ ప్రాంతంలో పాండవులు కొంత కాలం ఉన్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని పాండవ ఖోలీ అంటారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!