ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా !

Sharing is Caring...

Subramanyam Dogiparthi ………………………….

నవలా నాయిక  వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి ఈ జీవన జ్యోతి సినిమా.  మీరు చూసే ఉంటారు .చూసినా చూడొచ్చు .ఎన్ని సార్లయినా చూడొచ్చు .అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ. అందరూ వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను.

పల్లెటూరి అల్లరి చిన్నదిగా – చాదస్తపు గృహిణిగా నటించింది ఒక పాత్ర . తోడికోడలు కొడుకు చనిపోయాక పిచ్చిదానిగా నటించింది ఒక పాత్ర . కూతురుగా ఒక పాత్ర . అంత వైవిధ్యాన్ని వాణిశ్రీ ప్రస్ఫుటంగా చూపింది. తల్లిగా నటించి తన బిడ్డని నమ్మించే క్రమంలో వాణిశ్రీ నటనను ప్రత్యేకంగా అభినందించాలి. 

సినిమాలో అన్ని పాటలూ ఆమె చుట్టూనే ఉంటాయి . ఒక్కొక్క పాటలో ఒక్కొక్క తరహా నటనను ప్రదర్శించింది . తర్వాత మెచ్చుకోవలసింది శోభన్ బాబునే . యువకుడిగా , ముసలి భర్తగా చాలా బాగా నటించారు . సత్యనారాయణ , శుభల నటన కూడా బాగుంటుంది . ముఖ్యంగా సత్యనారాయణ నటన . ఆ తర్వాత చెప్పుకోవలసింది రాజబాబు-రమాప్రభ జోడీ . వీరిద్దరిలో రాజబాబు బాగా నటించారు . ఇతర పాత్రల్లో బేబీ వరలక్ష్మి , అల్లు రామలింగయ్య , నిర్మలమ్మ , ముక్కామల అందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు .

కె విశ్వనాథ్ కెరీర్లో ఒక కళాఖండం ఈ జీవనజ్యోతి సినిమా . ప్రముఖ రచయిత్రి కె రామలక్ష్మి మూలకధకు సినిమానుగుణంగా కూర్పులు మార్పులు చేసుకుని , బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారుచేసుకోవటమే ఈ సినిమా విజయానికి ఒక కారణం . ప్రకృతి అందాలకు చిరునామా అయిన గోదావరి గ్రామాలను ఎంచుకుని , అద్భుతంగా తెరకెక్కించారు.

కాబట్టే అవార్డుల , రివార్డుల , చప్పట్ల , డబ్బుల వర్షం కురిసింది. 12 సెంటర్లలో వంద రోజులు ఆడింది.  ఉత్తమ చిత్రంగా , ఉత్తమ నటుడిగా శోభన్ బాబుకి నంది అవార్డులు వచ్చాయి . అలాగే ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు  , ఉత్తమ నటుడు , ఉత్తమ నటి  ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి . సంజోగ్ అనే టైటిల్ తో హిందీ లోకి రీమేక్ అయింది . విశ్వనాధే డైరెక్ట్ చేసారు.  జయప్రద , జితేంద్రలు నటించారు . బాలినజ్యోతి అనే టైటిల్ తో కన్నడంలో ఆమని హీరోయిన్ గా రీమేక్ అయింది . అక్కడా హిట్టయింది .

ఇక ఎంత  చెప్పుకున్నా తనివి తీరనిది కె వి మహదేవన్ సంగీతం. చిన్నివో చిన్నీ సన్నజాజుల చిన్నీ , ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు , ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో , ఎందుకంటే ఏం చెప్పను , ఎవరనుకున్నావౌరా పాటలు సూపర్ హిట్టయ్యాయి . ముఖ్యంగా ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు , చిన్నివో చిన్నీ పాటలు ఎంత శ్రావ్యంగా ఉంటాయో . 

అప్పటికి ఏడు సినిమాలు NTR హీరోగా తీసిన డి వి యస్ ప్రొడక్షన్స్ రాజు గారు ఈ సినిమాకు నిర్మాత . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో ఓ మూడు నాలుగు సార్లు చూసి ఉంటానేమో ! అంత ఇష్టమైన సినిమా నాకు . ఈ సినిమాతో నాకు మరో గుర్తు కూడా ఉంది . ఈ సినిమాలో శోభన్ బాబు వైట్ టై చూసి నేనూ వైట్ టై కుట్టించుకున్నాను.

ఇటిక రాయి రంగు పేంట్ వేస్తాడు శోభన్. అలాంటి రంగు పేంటే కుట్టించుకున్నా. మా ఫ్రెండ్స్ వైట్ టై , ఇటిక రాయి రంగు పేంటు చూసి గోల చేసేవారు . ఎవడి పిచ్చి వాడికి ఆనందం . సినిమా యూట్యూబులో ఉంది . ఈతరంలో చూడనివారు ఉంటే అర్జెంటుగా చూసేయండి . చూసినోళ్ళు మళ్ళీ మళ్ళీ చూసేయండి . అంత గొప్ప దృశ్య , సంగీత కావ్యం ఈ సినిమా . షడ్రసోపేత భోజన సమానం .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!