ఏడాది క్రితం ఆగిన చోట నుంచే తిరిగి మునిపల్ ఎన్నికలు మొదలు పెట్టాలని ఎస్ ఈ సి నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.కొందరు ఈ విధానమే కరెక్ట్ అంటున్నారు. మరికొందరేమో కమీషనర్ నిర్ణయం వైసీపీ కి అనుకూలంగా ఉండొచ్చు అంటున్నారు. విపక్షాలైతే ముఖ్యంగా టీడీపీ అయితే ఖచ్చితంగా నిమ్మగడ్డ నిర్ణయం వైసీపీకి లాభం చేకూరుస్తుందని దుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకే కాబోలు నిన్నటివరకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ ను పొగిడిన ప్రతిపక్షాలు ఇవాళ ఎడా పెడా విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇదివరలో విపక్షాలన్నీ ఏకగ్రీవాలను రద్దు చేసి, తిరిగి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డను కోరాయి. బీజేపీ కూడా ఏకగ్రీవాలను రద్దుచేయాలని, వైసీపీ తమ అభ్యర్ధులను బెదిరించి నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలకు పాల్పడిందని ఫిర్యాదు చేసింది. అయితే నిమ్మగడ్డ ఆ ఫిర్యాదులను పట్టించుకోకుండా గత ఏడాది ఎక్కడయితే ఎన్నికలు ఆగాయో … అక్కడి నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించడం విపక్షాలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. నిమ్మగడ్డ నిర్ణయం వల్ల తిరిగి నామినేషన్ వేసే అవకాశం ఉండదు. పలుచోట్ల విపక్షాల అభ్యర్థుల నామినేషన్లు పలు కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి. కొన్నివందల వార్డుల్లో విపక్షాలకు అభ్యర్థులే లేరు.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి మునిసిపాలిటీలలో 32 వార్డులు, కడప జిల్లా పులివెందుల, రాయచోటిలలో 42 వార్డులు, గుంటూరు జిల్లా మాచర్లలో 10 వార్డులలో సింగల్ నామినేషన్లు దాఖలు అయ్యాయి.ఇదేవిధంగా మరి కొన్ని చోట్ల కూడా ఉండొచ్చు. ఈ పరిణామం వైసీపీ కి అనుకూలం కావచ్చు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు ఎవరైనా ఫిర్యాదు ఇస్తే వారికి నామినేషన్ అవకాశం కల్పిస్తామని కమీషనర్ చెప్పడం మంచిదే. అయితే ఎంతమంది ముందుకు వచ్చి అలా చెప్పగలరు అనేది సందేహమే.
ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారు ఒత్తిళ్లకు నిమ్మగడ్డ లొంగిపోయారంటూ సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కమీషనర్ విఫలమయ్యారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. నిమ్మగడ్డ నిర్ణయాన్ని వైసీపీ స్వాగతించడం ఊహించని విషయం. అదలా ఉంటే పనిలోపనిగా జడ్పి ఎన్నికలు కూడా నిర్వహించమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమీషనర్ ను అడిగినట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. కమీషనర్ నిర్ణయం ఎలాఉంటుందో చూడాలి.