ఓపిగ్గా చూడాలి .. కుంజాలీ మరక్కార్ !

Sharing is Caring...

భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పదహారవ శతాబ్దం నాటి కథ. పోర్చుగీసు వారు వ్యాపారం పేరిట ఇండియా కొచ్చి స్థానిక రాజులపై పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను వేధిస్తున్నరోజుల నాటి కథను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు.పోర్చుగీసు వారితో పోరాడిన  కుంజాలీ మరక్కార్ అనే యోధుడి పాత్రలో మోహన్ లాల్ నటించారు.

20 ఏళ్ళ నుంచి ఈ పాత్రను పోషించాలని అనుకుంటే ఇప్పటికి సాధ్యమైందని ఆమధ్య ఒక ఇంటర్వ్యూ లో మోహన్ లాల్ చెప్పారు. థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తన తల్లిని.. కాబోయే భార్యను చంపిన పోర్చుగీసు సైనికాధిపతులపై  కుంజాలీ పగ తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పరుచుకుని రాజ్యంలోని మోసగాళ్ల నుంచి ధనం.. ధాన్యం దోచుకుని పేదలకు పంచుతుంటాడు.

ఈ క్రమంలోనే స్థానిక రాజు చేత ఒక సైనికాధిపతిగా నియమితుడు అవుతాడు. తర్వాత పోర్చుగీసు వారిని ఎలా ఎదుర్కొన్నాడనేది ప్రధాన కథాంశం. యువ మరక్కార్ గా మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించారు. 100 కోట్ల వ్యయంతో తీసిన ఈ సినిమాలో అర్జున్ .. సునీల్ శెట్టి ..ప్రభు . మంజు వారియర్ వంటి నటీనటులను పెట్టుకున్నారు. కానీ వారి  పాత్రలు నామమాత్రం గా ఉండిపోయాయి.

మధ్యలో కీర్తి సురేష్ .. జే జె జక్రిత్ ల ప్రేమ కథ ఓ మాదిరిగా సాగుతుంది. కథను కీలక మలుపు తిప్పే ఉప కథ వీరిది. ఈ కథను ఇంకా ఆసక్తికరంగా తీయవచ్చు. ఈ హిస్టారికల్ సినిమాలో భారీ తనం ఉంది గానీ ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు లేవు. దీంతో సినిమా బోరు కొడుతోంది. బిగినింగ్ -ఎండింగ్ బాగున్నాయి. మధ్యలోనే కథ నత్తనడక నడుస్తుంది. మూడు గంటల సినిమాను చూడాలంటే చాలా ఓపిక అవసరం.

పాత్రలు ఎక్కువ కావడం మూలాన కూడా గందర గోళం నెలకొంది. సముద్రంలో పోర్చుగీసు సైనికులతో జరిపే యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే క్లైమాక్స్ కి ముందు జరిగిన యుద్ధ దృశ్యాలను బాగానే  చిత్రీకరించారు. సినిమా నేపథ్యానికి తగిన విధంగా 16వ శతాబ్దం నాటి పరిస్థితులను, అప్పటి వాతావరణాన్ని ఎలివేట్ చేశారు. 

మోహన్ లాల్ ఒక్కరే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈసినిమాలో చాలా లావుగా కనిపించారు. ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో మోహన్ లాల్ తనదైన శైలిలో నటించారు.కుంజాలీ పాత్ర కూడా పూర్తి స్థాయిలో ఎలివేట్ కాలేదు.”కాయంకుళం కొచ్చున్ని” లో ఇలాంటి పాత్రనే మోహన్ లాల్ చేశారు. ఈ రెండు సినిమాలకు అక్కడక్కడా పోలికలున్నాయి. ఈ బయోపిక్ లో వక్రీకరణ ఉందని కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. 

కుంజాలీ జీవిత కథకు కొంత కల్పన జోడించారు. అయితే అది ఆసక్తికరంగా లేదు. మరింత కసరత్తు జరిగిఉంటే బాగుండేది.  బలహీనమైన థ్రెడ్ మూలంగా సినిమా ఆకట్టుకునే విధంగా రూపొందలేదు. సినిమా నిడివి కూడా తగ్గించవచ్చు. అనవసరమైన సీన్లు చాలానే ఉన్నాయి. తిరునా వక్కరసు కెమెరా పని తనం అద్భుతంగా ఉంది. అధునాతన టెక్నాలజీని బాగా వాడుకున్నారు. రోనీ రాఫెల్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పాటలు పెద్ద గొప్పగా లేవు. అమెజాన్ 70 కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేసిందని టాక్. వర్కవుట్ అవుతుందో లేదో ? ఒక సారి అయితే చూడొచ్చు. 

—-KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!