New Experiment in Space ………………………………………..
జీరో గ్రావిటీ వాతావరణంలో కోతులు ఎలా పెరుగుతాయి ? అవి ఎలా పునరుత్పత్తి చేస్తాయో అధ్యయనం చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాలను చైనా చేస్తోంది.
తాజాగా గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా?అసలు అంతరిక్షంలో సంభోగం సాధ్యమేనా? అనేది తెలుసుకోవడానికి కొత్త ప్రయోగం చేయబోతోంది. ఇందుకోసం కోతులను అంతరిక్షంలోకి పంపించాలని చైనా నిర్ణయించింది.
‘చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. చైనా సొంతంగా ‘తియాంగాంగ్’ పేరిట స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టేషన్లోని వెంటియన్ మాడ్యుల్ లోకి కోతులను పంపించనున్నారు. గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేనిచోట వాటి ప్రవర్తనను అధ్యయనం చేస్తారు.
భార రహిత స్థితిలో వాటి మధ్య సంభోగం, ఆడ కోతుల్లో పునరుత్పత్తి జరుగుతాయో లేదో తెలుసుకుంటారు. చేపలు, నత్తలు వంటి చిన్న జీవులను అధ్యయనం చేసిన తర్వాత, “ఎలుకలు , మకాక్‌లు (కోతులు)తో కూడిన కొన్ని అధ్యయనాలను నిర్వహించ బోతున్నామని చైనా శాస్త్ర వేత్త జాంగ్ అంటున్నారు. ఈ ప్రయోగాలు మైక్రోగ్రావిటీ, ఇతర అంతరిక్ష వాతావరణాలకు జీవుల అనుసరణపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడతాయని జాంగ్ చెబుతున్నారు.
చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ప్రస్తుతం భూమి నుంచి 388.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇందులోని వెంటియన్ మాడ్యుల్ లో ప్రస్తుతం చేపలు, నత్తలు వంటి చిన్న జీవులు జీవించడానికి అవకాశం ఉంది. కానీ అవసరమైతే పెద్ద జీవులకు తగ్గట్లుగా పరిణామం పెంచుకొనేలా మాడ్యూల్ ను డిజైన్ చేశారు.
గతంలో రష్యా కూడా కొన్ని ఎలుకలను అంతరిక్షంలోకి పంపింది. అవి భూమ్మీదకు వచ్చాక గర్భం దాల్చలేదని అప్పట్లో తేలింది. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల పునరుత్పత్తి అవయవాలు దెబ్బతింటాయని, సెక్స్ హార్మోన్స్ లో గణనీయమైన క్షీణత ఉంటుందని గతంలో జరిగిన కొన్ని ప్రయోగాలలో తేలినట్టు పరిశోధకులు గుర్తించారు.
ఇక చంద్రుడు, అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకొనే దిశగా ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అంతరిక్షంలో కోతుల పునరుత్పత్తిపై చైనా చేస్తున్న ప్రయోగాల ఫలితాలు కీలకంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు.