భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు మానవతను చాటుకున్నారు. ముంబయిలో అరుదైన వ్యాధితో మంచాన పడిన ఐదు నెలల చిన్నారి విషయం తెలిసి చలించిపోయారు. ఆ చిన్నారి పేరు తీరా కామత్ … స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారిని ఆదుకొనేందుకు ఎందరో దాతలు ముందుకొచ్చి విరాళాలు కూడా అందించారు. క్రౌడ్ ఫండింగ్ రూపంలో రూ.16కోట్ల మేరకు తల్లిదండ్రులు సమీకరించారు. అయితే ఆ వ్యాధి చికిత్స కు అవసరమైన ఔషధాలు విదేశాల్లోనే ఉన్నాయి. వాటిని దిగుమతి కి బోలెడు ఖర్చుఅవుతుంది. ఆ మందులపై జీఎస్టీ, ఎక్సైజ్ సుంకం కలిపి అదనంగా మరో రూ.6.5 కోట్లు ఖర్చుఅవుతుంది. దీంతో ఆ తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయారు. అంత సొమ్ము కావాలంటే ఎవరిస్తారని దిగులుపడ్డారు. ఈ క్రమంలోనే ఆ మందులపై దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరుతూ పాప తల్లిదండ్రులు ప్రధానికి లేఖ రాశారు.
బాలిక తల్లిదండ్రుల వినతి మేరకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫఢణవీస్ కూడా స్పందించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. మోడీ వెంటనే స్పందించి చిన్నారి తీరా కామత్ చికిత్సకు అవసరమైన ఔషధాల దిగుమతి విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే ఔషధాల దిగుమతి పై పడే సుంకాలు రూ.6.5 కోట్ల ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఇంజెక్షన్ దిగుమతి అయి .. పాప చికిత్సకు జరుగుతోంది. ప్రస్తుతం పాప క్షేమంగా ఉంది. అరుదైన జన్యుసంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు పెద్ద మనసుతో సాయం చేసిన ప్రధానికి పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియ జేశారు.
కాగా నాలుగేళ్ళ క్రితం ఒక చిన్నారి విషయంలోకూడా మోడీ ఇలాగే స్పందించారు. తనకు వైద్యం చేయించాలని పుణె నగరానికి చెందిన ఆరేళ్ల చిన్నారి వైశాలి యాదవ్ ప్రధానికి నేరుగా లేఖ రాసింది. తనకు గుండెలో రంధ్రం ఉందని ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు సర్జరీ చేయాలన్నారని…. తమ కుటుంబానికి అంత స్థోమత లేదని … నోట్‌బుక్‌లో నుంచి ఒక పేజీ చించి తన అనారోగ్యం, పేదరికం గురించి ప్రధానమంత్రికి వివరించింది. దానికి తన స్కూల్ ఐడీ కార్డును జత చేసి పోస్ట్ చేసింది.
ఐదు రోజుల్లో స్పందించిన మోడీ చిన్నారికి ఆపరేషన్ చేయించాలని జిల్లా కలెక్ట్రర్‌ను ఆదేశించారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ పాప ఆపరేషన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. తన లేఖకు సాక్షాత్తూ దేశ ప్రధాని స్పందించడంతో ఆ చిన్నారి చాలా సంబర పడింది. మీడియాతో తన సంతోషాన్ని పంచుకుంది.

