ఎన్టీఆర్ కి డూప్ గా నటించిన ఎంజీఆర్ !

Sharing is Caring...

అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్  స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను ఎన్టీఆర్ చేసేవారు.

అయితే ఎన్టీఆర్ లా ఎంజీఆర్ పౌరాణిక పాత్రల జోలికి పోలేదు. ఆయన ఎక్కువగా మాస్ హీరో గానే అభిమానులను అలరించేవారు.ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల పోషించిన తీరు .. ఆ నటన చూసి ఎంజీఆర్ ముగ్దులై పోయేవారట.ఎన్టీఆర్ ఫ్యాన్ గా మారిపోయారట. ఎన్టీఆర్ పౌరాణిక సినిమా ఆంటే ప్రివ్యూ కి ఎంజీఆర్ కి తప్పనిసరిగా ఆహ్వానం పంపేవారట. ఇక ఈ ఇద్దరు భానుమతి, బీ. సరోజాదేవి, జయలలిత,లత వంటి హీరోయిన్స్ సరసన హీరోలుగా నటించారు.

అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎంజీఆర్ ఒక సందర్భంలో ఎన్టీఆర్ కి డూప్ గా నటించారు. అదెలా జరిగిందంటే ……. మలై కళ్ళన్  సినిమా షూటింగ్ కోయంబత్తూరులో జరుగుతోంది. తమిళ్ లో ఎంజీఆర్ హీరో. దీన్నే తెలుగులో అగ్గి రాముడు గా తీశారు. ఎన్టీఆర్ హీరో. తమిళ్ తెలుగు భాషల్లో భానుమతి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం లో పోరాట సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఎన్టీఆర్ అందుబాటులో లేరు.

దాంతో టైమ్ వేస్ట్ చేయడం ఇష్టంలేక తమ్ముడు ఎన్టీఆర్ కి డూప్ గా చేస్తా. ఆ ఫైట్స్ నాతో తీసేయండి అని నిర్మాతకు చెప్పి ఆయా సీన్స్ లో నటించారట.  సాధారణంగా హీరోలకు డూప్‌లు వుంటారు కానీ ఒక హీరో మరొకరికి డూప్‌గా చేయరు. నా తమ్ముని కోసం డూప్ గా చేశాను అని స్వయంగా ఎంజీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే పలు ఇంటర్వ్యూలలో తామిద్దరం అన్నదమ్ముల్లాంటి వారమని చెప్పేవారు. ఎన్టీఆర్ నటనను పొగిడేవారు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ ముసలి టీచర్ పాత్ర చూసి ఎంజీఆర్ ఆశ్చర్యపోయారట. 

అలాగే ఎంజీఆర్ కి ఆంధ్రాపచ్చళ్ళు అంటే భలే ఇష్టమట. గోంగూర, ఆవకాయ పచ్చళ్ళను ఎన్టీఆర్ ప్రత్యేకంగా చేయించి ఎంజీఆర్ కు పంపేవారట. ఎంజీఆర్ హైదరాబాద్ వస్తుంటే ప్రత్యేకంగా టిఫిన్ చేయించుకుని ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే వారు. ఎంజీఆర్ తమిళనాడు సీఎం అయ్యాక కూడా ఎన్టీఆర్ తో సఖ్యంగానే ఉండేవారు. దానవీర శూరకర్ణ  చిత్రం ఓపెనింగ్ కార్యక్రమం కోసం ఎంజీఆర్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ఆ సినిమాకు క్లాప్ కొట్టారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఇక ఎంజీఆర్ 1977 లో సీఎం అయితే ఎన్టీఆర్ 1983 లో సీఎం అయ్యారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు ఎంజీఆర్ ఆయనకు చాలా సలహాలు,సూచనలు  ఇచ్చారట. వాటిని తూచాతప్పక ఎన్టీఆర్ పాటించేవారట.

ఎన్టీఆర్ సీఎం అయ్యాక తన మిత్రుడు ఎంజీఆర్ అడిగిన మేరకు చెన్నై కి తెలుగు గంగ జలాలను తరలించారు. 1983 ఏప్రిల్‌ 18న ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌లు అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మాణం ఫైల్‌పై సంతకాలు చేశారు. 1985 మే 25న  నాటి  ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. 1996లో ఆ పనులు పూర్తి చేశారు. అగ్ర హీరోలుగా ఉన్న ఆఇద్దరు అన్యోన్యం గా ఉండటం చూసి మిగతా హీరోలు ఆశ్చర్యపోయేవారట.

———————- KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!