కుంభమేళా సంస్కృతి ఇప్పటిది కాదా ?

Sharing is Caring...

Kumbhamela ……………………

వచ్చే ఏడాది అంటే 2025 జనవరిలో ప్రయాగ్‌రాజ్ లో పెద్ద ఎత్తున కుంభమేళా జరగనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 పూర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు ఈ కుంభ మేళా జరుగుతుంది. పవిత్రమైన ఈ మహా కుంభ పర్వంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమం లో కుంభమేళా ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం.

ప్రపంచం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువునే  ‘కుంభమేళా’ అంటారు.  వేదకాలం నుంచి ఈ కుంభమేళాలు జరుగుతున్నాయని పురాణాలు చెబుతున్నాయి. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో గ్రీకుల నాగరికత నుంచి కుంభమేళాను స్వీకరించారని కూడా అంటారు.

యునెస్కో కూడా ఈ కుంభమేళాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం ‘కుంభం’ అనేది ఒక రాశి. ‘మేళా’ అంటే కలయిక లేదా జాతర. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.

దక్షిణ భారతంలో పుష్కరాలు, పుష్కర స్నానాలు నదులపేరు మీద వస్తాయి.కానీ ఈ కుంభస్నానాలనేవి కేవలం ఉత్తరదేశపు తీర్థాలకే సొంతం. సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ వేడుకను జరుపుతారు. ఈ కుంభస్నానాలు ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలోనే జరుగుతాయి.

దక్షిణాదిలో నదీ తీరాల వద్ద పుష్కరాలు గురు గ్రహ సంచారంలో ఒక్కొక్క రాశి ప్రవేశంతో ప్రారంభమవుతాయి. ఇవి పన్నెండు రోజుల వరకూ జరుగుతాయి. అయితే ఈ కుంభస్నానాలు మాత్రం ఖగోళీయ గ్రహగతుల ఆధారంగా మొదలవుతాయి. కుంభ స్నానాలు ఆచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం.

క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు కలబడుతుండగా ఆ కలశంలో నుంచి ఒలికి నాలుగు చుక్కల అమృతం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయట. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాల్లో ఒకచోట ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది.

దీనిని సాధారణ కుంభమేళా అంటారు. ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళా అనీ, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అని అంటారు. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత చేసేదాన్ని మహా కుంభమేళా అంటారు.అంటే 144 సంవత్సరాలకు ఒకసారి చేసే కుంభమేళాను మహా కుంభమేళా అని వ్యవహరిస్తారు. ఈ కుంభమేళాల కి ఎన్నో లక్షలమంది అఘోరాలు, సాధువులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. 

చరిత్ర ప్రకారం 629-645 మధ్య కాలంలో హర్షవర్ధనుడి హయాంలో  భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్, గ్జుయాన్జాంగ్ రచనల్లో కుంభమేళాకు సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. హరిద్వార్‌లో 1892లో జరిగిన కుంభమేళాలో పాల్గొన్నవారికి పెద్ద ఎత్తున కలరా సోకింది.

దీంతో తర్వాత కాలంలో అధికారులు నిర్వహణ ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1903లో దాదాపు నాలుగు లక్షల మంది కుంభమేళాకు హాజరయ్యారు. 1998, ఏప్రిల్ 14న హరిద్వార్‌లో కుంభమేళాకు పది మిలియన్లకు పైగా భక్తులు వచ్చారు. 2013 లో జరిగిన మహాకుంభమేళాకు దాదాపు 60 మిలియన్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవడం  గొప్ప విషయం. 

కుంభమేళా అంటే హిందువులందరికీ పండగే. ముఖ్యంగా పితృతర్పణాలు వదిలేందుకు, పూజలు చేసేందుకు దేశం నలుమూలల నుంచీ ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఈ మేళా భిన్న సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుగా గోచరిస్తుంది. ఆ భిన్నత్వాన్నికనులారా తిలకించేందుకు ,పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తులతో ఈ ప్రాంతమంతా జనసంద్రం గా మారుతుంది.

వీరందరికి  మామూలు హోటళ్లలో గదులు దొరికే అవకాశం ఉండదు. అందుకని ప్రభుత్వమే  ప్రైవేటు భాగస్వామ్యంతో ‘టెంట్ సిటీ’ ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి.సౌకర్యాలను బట్టి గుడారాల అద్దె నిర్ణయిస్తారు. వీటిని ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ సారి కూడా అలాంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నది. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!