ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం !

Sharing is Caring...

కేరళ లోని చెంకల్ మహేశ్వరం  శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పదికోట్ల వ్యయంతో ఈ శివలింగాన్ని నిర్మించారు.ఎనిమిది అంతస్థుల్లో నిర్మితమైన ఈ శివలింగానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. దీనిలో నూట ఎనిమిది చిన్న చిన్న శివలింగాలను ప్రతిష్ఠించారు. అరనైనాలుగు శివరూపాలు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఒక అంతస్థులో కైలాసాన్ని పునఃసృష్టించారు.

ఈ నిర్మాణంలో 8 అంతస్తులు ఉండగా  వాటిలో ఆరు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తి కేంద్రాలను సూచిస్తాయి, ఇందులో భక్తులు, యాత్రికులు , పర్యాటకులు 6 చక్రాలను ధ్యానించడానికి 6 ధ్యాన మందిరాలు ఏర్పాటు చేసారు. అన్ని అంతస్తులు ప్రతి చక్రంలోని ‘విబ్గియర్’ రంగులను ప్రతిబింబిస్తాయి. 

అవి ములాధర (ఎరుపు), స్వాధిష్ఠన (నారింజ), మణిపుర (పసుపు), అనాహత (ఆకుపచ్చ), విశుద్ధ (నీలం), అజ్నా (ఇండిగో) చివరకు సహస్రారా (వైలెట్).  శివలింగం నుంచి  పైకి వెళ్ళే మార్గం హిమాలయంలోని ఏడు కొండలకు ప్రతీకగా నిర్మితమైంది. సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటుంది. గుహలాంటి వాతావరణంలో ఆకర్షణీయమైన కుడ్యచిత్రాలు , ధ్యానం లో నిమగ్నమైన  సన్యాసుల విగ్రహాలతో అలంకరించారు. పై అంతస్తులోశివపార్వతుల నివాసమైన  ‘కైలాసం’ కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన శివుడు,,పార్వతి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి.ఈ శివలింగం నిర్మాణం కోసం ధనుష్కోటి, గోముఖం, కాశీ, బదరీనాథ్‌, రామేశ్వరం, గంగోత్రి, రుషీకేశ్‌ తదితర పవిత్ర ప్రదేశాల నుంచి నీటిని, మట్టిని  తీసుకువచ్చారు. ఈ ఆలయం ఆవరణలో భక్తులు ధ్యానం చేసుకోవడానికి మంటపాలను  ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రికి శివపార్వతుల ఆలయంలో విశేష పూజలను నిర్వహిస్తారు. అలాగే కార్తీకమాసంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలివస్తారు. కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో ఉన్న కోటిలింగేశ్వర ఆలయంలో శివలింగం ఎత్తు 108 అడుగులు కాగా  చెంకల్‌ మహేశ్వరం శివలింగం ఎత్తు 111 అడుగులు. ఈ శివలింగం ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో కెక్కింది. కేరళ రాజధాని తిరువనంతపురం కు 26 కిమీ దూరంలోనే  ఈ ఆలయం ఉంది. కేరళ వెళ్ళినపుడు తప్పక చూడాల్సిన క్షేత్రం ఇది.

ఇది కూడా చదవండి>>>>>>>>>>>>>  జటేశ్వరుని దర్శనం … అరుదైన అనుభవం ! 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!