Sheik Sadiq Ali …………..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం సమీపంలోని నల్లగుట్టలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడ వెలసిన సున్నపు గుహలు తెలంగాణా మరెక్కడా కనిపించవు. ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక రాతి పనిముట్ల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గుట్టలు ఒకనాటి ఆదిమానవుల ఆవాసమే అని చరిత్రకారులు భావిస్తున్నారు.
భూమికి 300 అడుగుల ఎత్తులో ఈ గుట్టలున్నాయి. శిఖరంపై చుట్టూ రాళ్లగోడ, గుట్టను నలువైపులా తొలుస్తూ లోపలికంటా గుహలు. సున్నపు తేట, అరుదైన అటవీ జంతువులు, కీటకాలు, పక్షులు గండ శిలలతో ఈ సున్నపు గుహలు నిండి ఉన్నాయి. గుహలోపల సున్నపు రాయితో ఏర్పడిన పైకప్పు చూపరులను ఆకట్టుంటుంది.గుహలోని కి వెళ్లాలంటే భయమేస్తుంది. ఒళ్లు జలదరిస్తుంది.
మొదట్లో కొంత వెలుతురు ఉన్నప్పటికీ లోపలికి వెళ్లే కొద్దీ చీకటి. గుహల మధ్యలో పైకి పైకి సొరంగాలు ఉండటంతో కొన్నిచోట్ల కొంత వెలుతురు ఉంటుంది. గుహ లోపల కెళితే గుండుసూది వేసినా స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్ధం.ఆ నిశ్శబ్దానికే ఎవరికైనా జంకు పుడుతుంది. గుహ లోపల 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తో వాతావరణం కొంత చల్లగా ఉంది.గుహ లోపల రెండు దారులు గుట్ట బయటకు దారి చూపుతాయి. మిగతాదారులు గుట్ట అంతర్భాగం వైపునకు తీసుకువెళతాయి.
చిమ్మ చీకటిలో గబ్బిలాల అరుపులు, కీటకాల కిచకిచలు భయం పుట్టిస్తాయి. కొన్నిచోట్ల గుహలు 10, 50, 100 అడుగుల విస్తీర్ణంతో ఉన్నాయి. కొన్నిచోట్ల గుండ్రంగా, మరొకొన్ని చోట్ల పొడవైన గదుల్లా కనిపిస్తాయి. ఈ గుహల్లో సున్నం ,ఇతర పదార్ధాలతో నిర్మించిన స్థంబాలు, నిలువెత్తు గుంజలు కనిపిస్తాయి. ఇంకా ఎగిరే పక్షులు, నగిషీ లు, నేలమీద వాలిన డేగ, సింహం, మానవముఖం వంటి అందమైన రూపాలతో బొర్రా గుహలను, బెలూం గుహలను మైమరిపిస్తాయి.
లోపల నీటి ప్రవాహాల జాడలు, నత్తగుల్లలు ఉన్నాయి. వర్షపు నీటిలో ఉండే సహజమైన ఆమ్లం కొండరాళ్లలో నిక్షిప్తమైన సున్నాన్ని కరిగించి వేయడంతో ఈ గుట్టల్లో గుహలు ఏర్పడి ఉంటాయని చరిత్రకారుల అంచనా. గుట్టపై నుంచి కారిన సున్నపు అవక్షేపాలు (కాల్షియం కార్బొనేట్) గట్టిపడి గోడల పై పలు ఆకృతులు ఏర్పడ్డాయి. అలాగే రాళ్లను తొలుచుకుంటూ పెరిగిన చెట్లు కనిపిస్తాయి.
ఇక్కడ మంచు శివలింగం తరహాలోనే సున్నపు శివలింగం కనిపిస్తుంది. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ శివలింగం కింది భాగం నుంచి ఒక సొరంగం ఉంది. ఇది గుహ బయటి వరకు రహస్య మార్గంలా కనిపిస్తుంది. కాకతీయుల కాలంలోనో, అంతకుముందు రాజులో ఈ గుహలను ఉపయోగించుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. ఓ చోట శివుడి ఝటాఝూటం, నంది, ఏనుగు కుంభ స్థలాలు, ఆవు పొదుగు, నాట్య భంగిమలు, గాండ్రించే సింహం, పులుల ఆకృతులు, సముద్రపు తాబేలు వంటి ఆకృతులు కూడా కనిపిస్తాయి.
నల్లగుట్టకు పడమటి వైపున ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతిగోడలతో కోట వంటి కట్టడం ఉంది. అక్కడే మానవ నిర్మితమైన రాతిగోడలు ఉన్నాయి. గుట్టపై నుంచి గుహలోపలికి దారి తీసే సొరంగాలు చాలానే ఉన్నాయి. నీటి వనరుల జాడలు కనిపించాయి. ఈ ప్రాధమిక ఆధారాలను బట్టి నల్లగుట్టలోని సున్నపుగుహల్లో ఆదిమానవులు నివాసం ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
ఇలాంటి సున్నపు రాతిగుహలు ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్,హర్యానా, మేఘాలయ, మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ , అండమాన నికోబార్ దీవులలో ఉన్నాయి. పురావస్తు పరిశోధకులు రంగంలోకి దిగితే ఈ గుహలు … పరిసరాల్లో మరెన్నో అద్భుతాలు కనిపిస్తాయి . చారిత్రిక ఆనవాళ్లు లభిస్తాయి. ప్రభుత్వం ఈ గుహలను అభివృద్ధి చేస్తే బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా మారుతుంది. అదనపు హంగులు కల్పిస్తే ఈ గుహలు పర్యాటకులను విశేషరీతిలో ఆకట్టుకుంటాయి.