పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి. నంద ప్రయాగ నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో కర్ణ ప్రయాగ ఉంది. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశాన్ని కర్ణప్రయాగ అంటారు. రెండు కొండల నడుమ ఈ నదీ పాయ కనిపిస్తుంది. ఈ పర్వతాలపైనే కర్ణుని సమాధి స్థలం కూడా ఉంది. కర్ణుడు తపస్సు చేసుకున్నప్రదేశం కూడా ఇదే.
కర్ణుడు సూర్యుని కొరకై తపస్సు చేసి కవచకుండలాలు ఇక్కడే పొందాడని అంటారు. పురాణ కథనాల ప్రకారం మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు తన కవచకుండలాలను ఇంద్రుడికి దానంగా ఇస్తాడు. యుద్ధంలో రథ చక్రం విరిగి కింద పడి పోయిన కర్ణుని పైకి కృష్ణుని సలహా మేరకు అర్జునుడు అంజాలిక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు .
ఈ అంజాలిక ను కర్ణుని దగ్గరకు చేరనీయకుండా అతను చేసుకున్న పుణ్యం ఫలితంగా యముడు కాపలాగా వుంటాడు. ఆ విషయం గ్రహించిన కృష్ణుడు వృధ్ద బ్రాహ్మణుని వేషంలో వెళ్లి కర్ణుని పుణ్యాన్ని దానంగా అడుగుతాడు. వృధ్దబ్రాహ్మణుని సాక్షాత్తు కృష్ణునిగా గుర్తించిన కర్ణుడు తన శరీరానికి ఉత్తరక్రియలు అలకనంద పిండారి గంగల సంగమ ప్రదేశం లో జరిపించవలసినదిగా ప్రార్ధించి … తన పుణ్యాన్ని దానం ఇస్తాడు.
కర్ణుని దానగుణానికి మెచ్చి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇస్తాడు. పుణ్యం లేకపోవడంతో యముని రక్షణ వలయం మాయమౌతుంది . అంజాలిక అస్త్రం కర్ణుని ప్రాణాలను హరిస్తుంది. మహాభారత యుధ్దానంతరము కర్ణునకు ఇచ్చిన మాట ప్రకారం కృష్ణుడు కర్ణుని భౌతిక దేహానికి ఉత్తరక్రియలు ఈ ప్రదేశంలో చేసాడు అంటారు.
సంగమ ప్రదేశంలో ఘాట్లు ఉన్నాయి. భక్తులు అక్కడ తర్పణాలు వదులుతుంటారు. అందువల్ల ఈ ప్రాంతానికి కర్ణప్రయాగ అనే పేరు వచ్చింది. శకుంతల దుశ్యంతులు ఇక్కడే కలిసేరని అంటారు. ఇక్కడే స్వామి వివేకానంద 18 రోజులు ధ్యానం చేశారని చెబుతారు. కొండపై ఉమా దేవి ఆలయాన్ని చూడవచ్చు. కర్ణ ప్రయాగ పట్టణమే. మునిసిపల్ కేంద్రం. హోటల్ , రవాణా సదుపాయాలు బాగానే ఉంటాయి.