సంచలన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala …………………………….

లయన్ యు. విశ్వేశ్వర్రావు అనో విశ్వశాంతి విశ్వేశ్వరరావు అంటేనో తప్ప ఆయన్ను జనం గుర్తుపట్టరు. తెలుగు సినిమా రంగంలో కాస్త భిన్నమైన వ్యక్తిత్వం ప్రదర్శించిన నిర్మాత దర్శకుల్లో విశ్వేశ్వర రావు ఒకరు. తెలుగు తెర మీద రాజకీయ చిత్రాలు తీసిన వారు చాలా అరుదు. ఆ కొద్ది మందిలో ఉప్పలపాటి విశ్వేశ్వర్రావు ఒకరు. విశ్వేశ్వర్ రావు గారి స్వగ్రామం నిమ్మకూరు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో చదువు తదితరాలన్నీ గుడివాడ, ఏలూరు, విజయనగరంలలో సాగాయి. విశ్వేశ్వర్రావు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అభిమాని. సోషలిస్టు బావాలను ఇష్టపడే వ్యక్తి. 

విజయనగరం కాలేజీలో డిగ్రీ సాదించిన విశ్వేశ్వర్రావు కొంతకాలం గుడివాడలో జ్యోతి ట్యుటోరియల్స్ నడిపారు. ప్రసిద్ద నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య, దర్శక నిర్మాత క్రాంతికుమార్ తదితరులు విశ్వేశ్వరరావు దగ్గర చదువుకున్నవారే.

విశ్వేశ్వరరావు గారి బావగారు…ఆ తర్వాత మామగారు అయిన నందమూరి నాగయ్య గారు విశ్వేశ్వర్రావులో ఉన్న కళాకారుడి గురించి కాజ వెంకట్రామయ్య అనే ఎగ్జిబిటర్ కు చెప్పారు. ఆయన ద్వారా విశ్వేశ్వరరావు సినీ రంగ ప్రవేశం చేశారు. కాజ వెంకటరామయ్య అంటే గుడివాడ శరత్ టాకీసు యజమాని.అలా మద్రాసు చేరిన విశ్వేశ్వరరావు పి. పుల్లయ్య దగ్గర కన్యాశుల్కం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు.

అయితే సినిమా పరిస్థితులు నచ్చక సమాచార శాఖలో ఉద్యోగంలో చేరదామనుకున్నారు విశ్వేశ్వరరావు. తిన్నగా వెళ్లి ఆశాఖలో పనిచేస్తున్న త్రిపురనేని గోపీచంద్ ను కలిసారు. అయితే ఆయన్ను తిరిగి సినిమాల్లోకే పంపారు త్రిపురనేని గోపీచంద్. తిరిగి వచ్చాక మళ్లీ పుల్లయ్య గారి దగ్గరే వెంకటేశ్వర మహత్యం, జయభేరి చిత్రాలకు పని చేశారు. నెమ్మదిగా డబ్బింగ్ చిత్రాల మీద దృష్టి సారించారు. బాలనాగమ్మ, విప్లవ స్త్రీ చిత్రాలు డబ్ చేసి సక్సెస్ అయ్యారు.

మేనకోడలు పద్మిని సజెషన్ తో తన బ్యానర్ కు విశ్వశాంతి అని నామకరణం చేశారు. అలా నిర్మాతగా మారారు. కంచుకోట సినిమాతో స్ట్రెయిట్ ప్రొడ్యూసర్ అయ్యారు. జానపదాలంటే కేవలం మంత్ర తంత్రాలు మాత్రమే ఉంటాయి అని ఆయన అనుకోలేదు.అయితే జానపదాల్లోనూ రాజకీయాలు చర్చించవచ్చు అనేది విశ్వేశ్వరరావు అభిప్రాయం. నిజానికి ఆ ప్రయత్నాలు అంతకు ముందూ నడిచాయి. జయసింహ, బందిపోటు సినిమాలే అందుకు ఉదాహరణలు.

టెక్నికల్ గా హై వ్యాల్యూస్ తో తెరకెక్కిన కంచుకోట సంచలన విజయం సాధించింది. ఎన్.టి.ఆర్ కు ప్రజానాయకుడి ఇమేజ్ తెచ్చిన చిత్రాలన్నీ విశ్వేశ్వర్రావు సారధ్యంలో వచ్చినవే కావడం విశేషం. జయప్రకాశ్ నారాయణ్ తో పాటు కమ్యునిస్ట్ పార్టీల ప్రభావం కూడా బలంగా ఉండడంతో విశ్వేశ్వర్రావు తీసిన చిత్రాలన్నీ రాజకీయ చిత్రాలుగానే కనిపిస్తాయి.

బలమైన రాజకీయ విమర్శ ఆయన చిత్రాల్లో తప్పనిసరిగా ఉండేది. విశ్వేశ్వర్రావు మహాకవి శ్రీశ్రీకి కూడా సన్నిహితుడు. విశ్వేశ్వర్ రావు తీసిన చిత్రాల్లో సాధారణంగా ఒక్కపాటైనా శ్రీశ్రీతో రాయించుకునేవారు. పెత్తందార్లులో మానవుడా ఓ మానవుడా లాంటి పాటలు రాయాలంటే శ్రీశ్రీ రావాలి కదా. మరో వైపు ప్రజానాట్యమండలితో ఉన్న సంబంధ బాందవ్యాల రీత్యా నాజర్ తో బుర్రకథలు చెప్పించి తన సినిమాలో వాడుకునేవారు విశ్వేశ్వరరావు. పెత్తందార్లు, నిలువుదోపిడీ రెండు చిత్రాల్లోనూ నాజర్ బుర్రకథ ఉంటుంది.

పెత్తందార్లు తర్వాత ఎన్.టి.ఆర్ తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు విశ్వేశ్వరరావు. సమాజ పురోభివృద్దికి పెను ఆటంకంగా మారిన బ్లాక్ మార్కెట్ వ్యవహారాన్ని దాని వెనక ఉన్న రాజకీయ నాయకుల కుళ్ళు ను  బయట పెట్టడం కోసం ఓ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు విశ్వేశ్వరరావు. దేశోద్ధారకులు టైటిల్ తో వచ్చిన ఆ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది.

‘దేశోద్ధారకులు’ మాత్రం నిజంగా ప్రత్యేకం అనిపించే రేంజ్‌లో సీఎస్‌రావు ఈ చిత్రాన్ని మలిచారు. ఎన్టీఆర్ నటించిన తొలి రంగుల రాజకీయ వ్యంగ్య చిత్రమిది. ఆయన తొలి రంగుల సాంఘిక చిత్రం కూడా ఇదే. ఈ సినిమాలో బ్రౌన్ దొరగా ఎన్టీఆర్ చేసే వ్యాపార ప్రసంగాలు ఇప్పటికీ రిలవెంట్ గా అనిపిస్తాయి.

దేశోద్దారకులు చిత్రానికి మహారధితో పాటు మోదుకూరి జాన్సన్ కూడా మాటలు రాశారు. విశ్వేశ్వరరావు తో  పొసగక  మహారధి నిష్కృమిస్తే…ఆ స్థానంలో జాన్సన్ ని తీసుకున్నారనేది ఇండస్ట్రీలో కొందరు పెద్దలు చెప్పిన మాట. తను రాసిన డైలాగ్స్ మారిస్తే మహారధి ఒప్పుకునే వారు కాదు. సరిగ్గా అక్కడే ఇద్దరికీ పేచీ వచ్చిందనేది వారి విశ్లేషణ.జాన్సన్ కేవలం మాటలు రాయడమే కాదు. స్వాగతం దొరా పాటను కూడా రాశారు.

ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎన్టీఆర్ ఇంటికి పిల్చి మరీ విశ్వేశ్వరరావును కోప్పడ్డారు. అంత డబ్బులు పెడుతున్నావ్ .. అంతంత సెట్స్ వేస్తున్నావ్ కాస్ట్యూమ్స్ కోసం బొంబాయి నుంచీ టైలర్లను రప్పించావు. ఇదంతా అనవసరమైన ఖర్చు … సర్వనాశనం అయిపోతావ్ అని బెదిరించారు. ఇంతకాలం తెలుగు సినిమా టచ్ చేయని ఏరియాల్లో కూడా మన సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం .. కనుక నాకు నమ్మకం ఉంది .. మీరు ప్రొడక్షన్ లో కల్పించుకోకండి అని వివరించారు విశ్వేశ్వర్రావు. సరే నీ కర్మ అన్నారు ఎన్టీఆర్. 

విశ్వేశ్వరరావు చెప్పినట్టే దేశోద్ధారకులు సూపర్ హిట్ అయి భారీ లాభాలు తెచ్చింది … దేశోద్ధారకులు తర్వాత మరో భారీ చిత్రం తీస్తారు విశ్వేశ్వరరావు గారు అని అంతా అనుకుంటున్న సమయంలో ఎన్.టి.ఆర్ ప్రధాన పాత్రలో ఓ న్యూవేవ్ సినిమా అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు విశ్వేశ్వరరావు. తీర్పు పేరుతో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

తీర్పు తర్వాత అదే వరసలో మార్పు, నగ్నసత్యం, కీర్తి కాంత కనకం, పెళ్లిళ్ల చదరంగం, హరిశ్చంద్రుడు చిత్రాలు నిర్మించారు విశ్వేశ్వరరావు. నగ్నసత్యం రమీజాబీ కేసు నేపథ్యంలో సాగుతుంది. హరిశ్చంద్రుడు లో మాదాల రంగారావుకు ప్రత్యేక పాత్ర ఇచ్చారు. అంతే కాదు … మాదాల రంగారావు తీసే సినిమాలకు తన వంతు సహకారం అందించేవారు. తన విశ్వశాంతి బ్యానర్ లోనే మాదాలతో విప్లవశంఖం సినిమా కూడా తీశారు.

ఆయన కమ్యూనిస్టు కాకపోయినా … వారితో దగ్గరగా ఉండేవారు. కోస్తా జిల్లా కమ్మ కుటుంబాల్లో కమ్యూనిస్టులు కాని వాళ్లు చాలా తక్కువగా ఉండేరోజులవి. 1983 నుండి మారుతున్న పరిస్థితులలో ఇమడలేక చలనచిత్రాలకు దూరంగా ఉంటున్నారు విశ్వేశ్వర రావు. రిటైర్మెంట్ తర్వాత కూడా సినిమా రంగానికి తన వంతు సేవలు అందించారు.

హైద్రాబాద్ ఫిలింనగర్ నిర్మాణం, లలితకళాతోరణం ఏర్పాటు నిర్ణయాల వెనుక విశ్వేశ్వరరావు ఉన్నారు.ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల విశ్వేశ్వరరావు చాలా విషయాల్లో సలహాలూ సూచనలూ చేసేవారు. పట్టించుకున్నారా లేదా అనేది వారి ఇష్టం అనేవారాయన. ఎన్టీఆర్ తో బంధుత్వం కూడా ఉంది. విశ్వేశ్వర్ రావు గారి అమ్మాయిని తన కుమారుడికి చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమ అంతా హైదరాబాద్ వచ్చేసినా … తను మాత్రం మద్రాసులోనే ఉండిపోయారు.

విశ్వేశ్వరరావు గారు తన సినిమాల్లో పాటలు కూడా రాశారు. కంచుకోటలో అద్దరేతిరికాడ అత్తమ్మ నాకూ కల్లోన కనిపించె మావో … అనే ఎల్.ఆర్ ఈశ్వరి పాట ఆయన రాశారు. అలాగే … తీర్పు మార్పు హరిశ్చంద్రుడు లాంటి సినిమాల్లో పాటలు శ్రీశ్రీతో కొన్ని రాయించుకుని మిగిలినవి తనే రాసుకున్నాడు. నిలువుదోపిడీ సినిమాలో చుక్కమ్మత్త అనే పాట కూడా వారే రాశారు. దేశోద్దారకుల్లో ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు పాట వారు రాసినదే.

ఇంకో విశేషం ఏమంటే … మార్పు సినిమాలో రామోజీరావు గారు జడ్జి పాత్రలో నటించడం … తెలుగు సినిమా మార్కెట్ ను పెంచిన , తెలుగు సినిమాకు జాతీయ పురస్కారాలు సాధించిన విశ్వేశ్వర్రావు మరణంతో పాత సినిమాల చరిత్రలు … అప్పటి నటీనటులు వాళ్ల గొడవలూ,  సాంకేతిక నిపుణుల మధ్య గొడవలూ అన్నీ చెప్పగలిగిన ఓ సోర్స్ పోయినట్టైంది.కోవిద్ సెకండ్ వేవ్ తీసుకెళ్లిపోయిన విశ్వేశ్వర్రావు తెలుగు సినిమా చరిత్రకు ఆఖరు సాక్షి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!