విశ్వనాయకుడు దూసుకుపోగలరా ?

Sharing is Caring...

ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. “మక్కల్ నీది మయం” పార్టీ పెట్టాక తొలిసారి ఎన్నికల బరిలోకి కమల్ దిగారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసిన  కోయంబత్తూరులో ఆపార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం కోయంబత్తూరు సౌత్ స్థానం తనకు సురక్షితమైనదని భావించి కమల్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అప్పటి లోకసభ ఎన్నికలో పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్ మూడో స్థానంలో నిలిచారు. 1.45 లక్షల (11.6 శాతం) ఓట్లు మహేంద్రన్ సాధించారు..అలాగే చెన్నైలోని రెండు లోకసభ స్థానాల్లో కూడా ఎంఎన్ఎమ్ పార్టీకి బాగానే ఓట్లు వచ్చాయి.

ఇక కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్‌లో కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. మయూరా జయకుమార్ కోయంబత్తూర్ సౌత్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గా బరిలో ఉన్నారు.2016 అసెంబ్లీ ఎన్నికలలో ఎఐఎడిఎంకె ఈ సీటును వరుసగా రెండోసారి గెలుచుకుంది.కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచి 42369 ఓట్లు సాధించగా 17 వేల పైచిలుకు ఓట్లతో అన్నాడీఎంకే విజయం సాధించింది. పొత్తులోభాగంగా డీఎంకే ఈ సీటును మళ్ళీ కాంగ్రెస్ కే ఇచ్చింది. అధికార పార్టీ పై వ్యతిరేకత తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

అన్నాడీఎంకే ఈసారి కోయంబత్తూర్ సౌత్ సీటు బిజెపి కి కేటాయించింది. ఎఐఎడిఎంకె, బిజెపి వ్యతిరేక ఓట్లలో కమల్ హాసన్ కు కొంతమేరకు పడవచ్చు.పెద్ద స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి చీల్చుకుంటే మటుకు కమల్ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎఐఎడిఎంకె ఎమ్మెల్యే అమ్మాన్ కె అర్జునన్‌ పట్ల ఉన్న వ్యతిరేకత బిజెపికి  మైనస్ కావచ్చు.  కోయంబత్తూర్ సౌత్ సీటులో కమల్  ను, కమలం పార్టీని అధిగమించాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

ఇక బీజేపీ ఈ ప్రాంతంపై కొంత పట్టు సాధించింది.. 2019 లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ స్థానం నుంచి బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పోటీలో ఉన్నారు.ఆమెకు లాయర్ గా మంచి పేరు ఉంది. ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఆమెది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కి ఇక్కడ 5177 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016 ఎన్నికల నాటికీ అవి 33,113 ఓట్లకు పెరిగాయి. 16లో కూడా వనతి శ్రీనివాసనే పోటీ చేశారు.పొత్తులో లేనప్పుడే అన్ని ఓట్లు సాధించిన బీజేపీ అన్నాడీఎంకే తో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో అన్నా డీఎంకే కు 59788 ఓట్లు వచ్చాయి. అవన్నీ గంపగుత్తగా బదిలీ కాకపోయినా కొంతమేరకు అయినా పడతాయని భావిస్తున్నారు. వనతి బలమైన గౌండర్ కమ్యూనిటీకి చెందినవారు. ఇక్కడ వారి ఓటు బ్యాంక్ పెద్దదే. ఈ క్రమంలో బీజేపీ నేతలు విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇక్కడ బీజేపీ కమల్ హాసన్ ను నాన్ లోకల్ అభ్యర్థి అని ప్రచారం చేస్తున్నాయి. ఆయన సినీ గ్లామర్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.మాజీ ఎమ్మెల్యే దొరైస్వామి దినకరన్ పార్టీ తరపున బరిలో ఉన్నారు. మైనార్టీ ఓటర్లు కీలకం కానున్నారు. అన్నాడీఎంకే కు అనుకూలంగా ఉండే చిన్నవ్యాపారులు ,కూలీలు ఈ సారి బీజేపీ కి ఓటు వేస్తారో లేదో సందేహమే. మొత్తం మీదా ఎటు నుంచి ఎటు చూసినా కమల్ గెలుపు అంత సులభం కాదు. పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. 

—————–KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!