Only he can do some characters ……..…………………………
“చూడు పిన్నమ్మా పాడు పిల్లడు… పైన పైన పడత నంటాడు.” ఈ పాట వినగానే ఎవరికైన చప్పున గుర్తుకొచ్చేది నటుడు మాడా. వ్యక్తుల ప్రవర్తనలో ఏదైనా తేడా ఉంటే వెంటనే వారిని మాడా అని పిలుస్తారు. ఆ స్థాయికి వెళ్ళింది మాడా పాపులారిటీ. అది మాడా పాత్ర ప్రభావం.
చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమా లో ‘పేడి’ పాత్ర మాడాకు అంత పాపులారిటీ తెచ్చిపెట్టింది.మాడా అనేది ఆయన ఇంటిపేరు. ఆయన పూర్తిపేరు మాడా వెంకటేశ్వరరావు. మాడా తొలుత బాపు దర్శకత్వం వహించిన ‘అందాల రాముడు’ సినిమాల్లో నటించారు. 1973లో ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా లో పాత్ర ద్వారా మాడాకు పెద్ద గా గుర్తింపు రాలేదు.
ఆ తర్వా త వచ్చిన సినిమా మాడా కు మంచి గుర్తింపు తెచ్చింది. అదే ముత్యాలముగ్గు. 1975 లో విడుదల అయిన ‘ముత్యాల ముగ్గు’ లో రెండు నిమిషాల పాటు కనిపించే బ్రోకర్ పాత్రలో నటించి ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
ఆ సినిమాలో కాంట్రాక్టర్ పాత్ర పోషించిన రావు గోపాలరావు దగ్గరకు వచ్చి… ‘చేయి తీసేస్తే ఎంత,? కాలు తీసేస్తే ఎంత? చేయీ కాలు కలిపి తీసేస్తే ఎంత? …ఈ విషయంలో మీకు నాకు ఒక కాంప్రొమైజైషన్ కుదిరితే… నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను.”అంటూ సుదీర్ఘ మైన డైలాగ్ అలవోకగా చెబుతారు మాడా.
అవతల ఉంది డైలాగ్ కింగ్ రావుగోపాలరావు అని జంకకుండా … వెరైటీ గా మాటిమాటికీ చిటికెలు వేస్తూ త్రిబుల్ ఫైవ్ ప్యాకెట్ పట్టుకుని మాట్లాడుతూ మాడా ప్రేక్షకుల మనసును చూరగొన్నారు. దర్శక రచయితలు బాపు రమణలు ఊహించిన దానికంటే అద్భుతమైన నటనను చూపారు మాడా. రెండు నిమిషాల పాత్ర అయినప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోయిన క్యారెక్టర్ అది. అప్పట్లో మాడా చెప్పిన డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఎక్కడ కెళ్లిన అవే వినిపించేవి.
ఇక ఆ తర్వాత 1977 లో వచ్చిన సినిమా ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’… దాసరి నారాయణరావు ఈ సినిమా దర్శకుడు. అప్పటికే చిల్లర కొట్టు చిట్టెమ్మ’ నాటకం గా బాగా పాపులర్ అయింది. దాన్ని తెరపైకి ఎక్కించారు దాసరి. సినిమాల్లోకి రాకముందు ప్రముఖ నటీమణులు వాణిశ్రీ ,ప్రభ ఈ చిల్లర కొట్టు చిట్టెమ్మ పాత్రను స్టేజి పై ఎన్నోసార్లు ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్నారు.
సినిమాలో జయచిత్ర చేసింది ఆ పాత్రను. ఇదే సినిమా లో ‘పువ్వుల కొమ్మయ్య’ అనే నపుంసకుని పాత్రలో మాడా నటించారు. అనే కంటే జీవించారు అంటే బాగుంటుంది. ఈ చిల్లరకొట్టు చిట్టెమ్మ లో మాడా మీద చిత్రీకరించిన ‘చూడు పిన్నమ్మా… పాడు పిల్లోడు ’… పాట మాడాకే కాదు దాన్ని పాడిన బాల సుబ్రహ్మణ్యానికి కూడా బ్రహ్మాండమైన పేరు తెచ్చిపెట్టింది.
సినిమాలో ‘సువ్వీ కస్తూరి రంగా’ అనే మరో పాటకూడా జయచిత్ర మాడాలపై చిత్రీకరించారు. ఇందులోనే మాడా చెప్పిన డైలాగులు కూడా బాగా పాపులర్ అయ్యాయి. “నక్కలు బొక్కలు వెతుకుతై… కుక్కలు చెప్పులు వెతుకుతై” “చిత్రాల మొగుడు ఉత్తరమేస్తే … చింత తోపుల్లో చిక్కుకున్నదట” “ఇంటింటి ముందు ఇటుకల పొయ్యి .. మా ఇంటి ముందర మట్టి పొయ్యి” “దుంగలు మొయ్యాలా … దూలాలు మొయ్యాలా?”
మాడాకు చూడు పిన్నమ్మ పాట ద్వారా అంత ఖ్యాతి తెచ్చిన పాట రచయిత దాసం గోపాల కృష్ణ .. నాటక రచయిత ..సినిమా రచయిత కూడా ఆయనే. పాత్రను హైలెట్ చేసిన దర్శకుడు దాసరిని కూడా మెచ్చుకోవలసిందే. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే మరోవైపు అదే పాత్ర ఆయనలోని ప్రతిభను పరిమితం చేసింది అని కూడా అంటారు సినీ విశ్లేషకులు.
ప్రేక్షకులు మెచ్చారు కదా అని అలాంటి పాత్ర వస్తే చాలు మాడాను పిలిచే వారు. వాటితో పాటు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద హీరోల స్నేహితుల, శిష్యుల పాత్రల్లో మాడా కనిపిస్తూ తన స్టేటస్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పక్కన రాజబాబు వేయాల్సిన పాత్రలను ఒక దశలో మాడా లేదంటే నగేశ్ మాత్రమే చేసేవారు.
మాడా ఇతర హాస్య నటులతో పోల్చితే తక్కువ సినిమాల్లో నటించినా తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారనే చెప్పాలి. ముఖ్యంగా ఇ.వి.వి సినిమాల్లో మాడా పేరు తరచూ వినిపించేది … ‘నేనేమైనా ఆడా మగా కాని మాడానా’ …. అనే డైలాగులు పడేవి. సాధారణ జన బాహుళ్యంలో కూడా ‘థర్డ్ జండర్’ను ఉద్దేశించడానికి ‘మాడా’ అనే మాటను వాడుతున్నారు అంటే అది మాడా చేసిన క్యారెక్టర్ ప్రభావం.
ఈ విషయంలో మాడా ప్రతిభను మెచ్చుకోవాలి. అయితే మాడా ప్రతిభకు తగిన పాత్రలు తర్వాత కాలంలో రాలేదు. మాడా చిత్రపరిశ్రమలో అందరితో కలివిడిగా ఉండేవారు. తూర్పుగోదావరి జిల్లా దుళ్ల గ్రామంలో 1950 అక్టోబర్ 10న జన్మించిన మాడా.. 300 పైగా సినిమాల్లో నటించారు. 2015 లో మాడా వెంకటేశ్వరరావు కన్నుమూసారు.
———KNM