చారిత్రిక గ్రంధాల్లోనూ … ఇతిహాసాల్లోనూ ట్రాయ్ నగరం ప్రస్తావనలు ఉన్నాయి. ఆ నగర నిర్మాణం గురించి, నాశనం అవ్వడం గురించి…అనేక వర్ణనలు, వాదనలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ట్రాయ్ నగరమే ప్రస్తుతం టర్కీలో భాగంగా ఉంది. గ్రీకు పురాణాల్లో ప్రస్తావన ఉన్న ‘ట్రోజన్ వార్’ కు వేదికగా నిలిచిన ట్రాయ్ నగరం ఉనికి ఎప్పటిది? ఎక్కడిది? అసలు ట్రోజన్ వార్ జరిగిందా ? లేదా ? కేవలం కల్పితమేనా ?
మానవ చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ మగువ కొరకో, మతాధిపత్యం కోసమో జరిగాయంటారు… అలాంటి పంథాను అనుసరించినదే ‘ట్రోజన్ వార్’. ఆ భీకర యుద్ధంలో నాశనమైనదే ‘ట్రాయ్’ నగరం. అటు ఇతిహాస పరంగా, ఇటు చారిత్రక పరంగా కూడా ప్రాధాన్యత ఉన్న నగరం ఇది. గ్రీకు పురాణాల్లో ట్రాయ్ నగరం ప్రస్తావన ఉంది.
ఈ నగర వైభవం గురించి, ఇక్కడి ప్రజల జీవనశైలి గురించి ఎన్నో అతిశయోక్తులున్నాయి. గ్రీకు పురాణ గాథలను గ్రంథస్థం చేసిన హోమర్ తన ‘ఇలియడ్’ పుస్తకంలో ట్రాయ్ గురించి ప్రస్తావించాడు. ఇందులో ఆయన ట్రోజన్ వార్ గురించి, గ్రీకు వీరుల గురించి, ట్రాయ్ రాకుమారుల గురించి…వారికున్న అనేక అతీత శక్తుల గురించి రాసాడు.
హోమర్ లెక్కల ప్రకారం… క్రీస్తుపూర్వం 1194 నుంచి పది సంవత్సరాల పాటు స్పార్టా, ట్రాయ్ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ట్రాయ్ నగరం నాశనమైంది. దైవలీలగా సాగే ఈ పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ట్రాయ్ రాకుమారులు హెక్టర్, పారిస్‌లు. వీరిలో పారిస్ మానవాతీత శక్తులు ఉన్నవాడు. ఇతడు పుట్టగానే జ్యోతిష్యులు తల్లిదండ్రులను హెచ్చరిస్తారు…
ఇతడి వల్ల ట్రాయ్ నగరం సర్వనాశనమవుతుందని. దీంతో ముక్కుపచ్చలారని పసివాడినే కొండగుట్టలో వదిలివేస్తారు. కారణజన్ముడైన పారిస్ అనాథగా పెరిగి అద్భుత సౌందర్యవంతుడిగా ఎదిగి నగరానికి చేరతాడు. అలా తిరిగి వచ్చిన తమ కుమారుడిని చూసి ట్రాయ్ రాజు అతడి కోసం దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు.
ఈ నేపథ్యంలో పారిస్ తమ మిత్ర రాజ్యం స్పార్టాకు చెందిన హెలెన్‌ను ప్రేమిస్తాడు. ఆమె స్పార్టా రాకుమారుడు మెనెలస్ భార్య. పెళ్లికి వెళ్లి, మిత్రుడి భార్యను ట్రాయ్ నగరానికి తెచ్చుకుంటాడు ఈ ఘనుడు. దీంతో రగిలిపోయిన స్పార్టా రాకుమారుడు ట్రాయ్ నగరం పై దండెత్తుతాడు.
ఈ విషయంలో అతడికి ఎఖిలస్ సాయం లభిస్తుంది. ఇతడు కూడా దైవాంశ సంభూతుడే. గొప్ప యోధుడైన ఎఖిలస్ ప్రాణం కాలి మడమలో ఉంటుంది. ఈ ట్రోజన్ వార్‌లో ఎఖిలస్ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. అవమాన భారాన్ని భరిస్తూ మొదట తన భార్యను అప్పగించమని మెనెలస్ ట్రాయ్ రాకుమారులను బతిమాలుతాడు. అయినా పారిస్ వినడు.
హెలెన్ కూడా పారిస్ మాయలో పడుతుంది. దీనికి కూడా ఒక ఉపకథ ఉంది. ముగ్గురు దేవతా స్త్రీలు పారిస్ సౌందర్యాన్ని చూసి ముచ్చట పడతారు. తమలో ఎవరు అందమైన వారు అనే విషయాన్ని చెప్పమని అతడిని కోరతారు. ఎవరికి వారు అతడికి అనేక బహుమతులను ఎరగా చూపి తమనే అందగత్తెగా కీర్తించమంటారు.
కానీ అప్పటికే పారిస్ హెలెన్ మాయలో పడతాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఆఫ్రోడైట్ అనే దేవతా స్త్రీ హెలెన్ ప్రేమను దక్కేలా చేస్తానని మాట ఇచ్చి, అతనిచే అందగత్తెగా గుర్తింపు పొందుతుంది.ఆ దేవతా స్త్రీ ప్రభావంతోనే హెలెన్ పారిస్ ప్రేమలో పడుతుంది. అలా హెలెన్ కారణంగా ట్రోజన్ వార్ ప్రారంభమవుతుంది.
దాదాపు దశాబ్దకాలం కొనసాగే ఈ యుద్ధంలో చివరి వరకు ట్రాయ్ నగర వాసులదే పై చేయి గా ఉంటుంది. అయితే ‘ట్రోజన్ హార్స్’ సాయంతో స్పార్టా విజయం సాధిస్తుంది. స్పార్టా సైనికులు యుద్ధం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించి, యుద్ధ క్షేత్రంలో పెద్ద చెక్క గుర్రాన్ని ఉంచి వెళతారు. ఆ గుర్రం రహస్యాన్ని గుర్తించలేని ట్రాయ్ సైన్యం, దాన్ని ప్రత్యర్థుల ఓటమికి సూచికగా, తమకు లభించిన బహుమతిగా భావించి ట్రాయ్ నగరం నడిబొడ్డున తెచ్చి పెట్టుకుంటారు.
విందులు వినోదాల్లో మునిగి తేలి విజయానందాన్ని ఆస్వాదిస్తారు. వీరు ఈ పనిలో ఉండగా అర్ధరాత్రి వేళ ట్రోజెన్ హార్స్‌లో దాక్కొని ఉన్న స్పార్టా సైనికులు అందులోంచి బయటకు వచ్చి ట్రాయ్‌పై విరుచుకుపడి విలయతాండవం సృష్టిస్తారు.
సైనికులందరినీ చంపి, ట్రాయ్ నగరాన్ని నాశనం చేస్తారు. హోమర్ ఇలియడ్ ప్రకారం ట్రాయ్ ప్రస్థానం ఇంతటితో ముగుస్తుంది. అయితే ఇదంతా దేవతలు ఒక వ్యూహం ప్రకారం నడిపించిన కథగా హోమర్ రాశాడు. ఇడా అనే పర్వత శిఖరం నుంచి ట్రాయ్, స్పార్టా సైన్యాలు ఎలా కొట్టుకుంటాయనే విషయాన్ని చూస్తూ దేవతలు ఆనందిస్తుంటారట.
పెరుగుతున్న మానవజాతి ప్రాబల్యాన్ని అణచడానికి, మానవుడు ఏర్పరుచుకున్న సృష్టిని నాశనం చేయడానికి హెలెన్, పారిస్ లనే ఇద్దరిని పాత్రధారులుగా చేసుకుని దేవతలు పన్నిన కుట్రగా హోమర్ అభివర్ణించాడు.
నేటి టర్కీనే నాటి ట్రాయ్
హోమర్ ప్రస్తావించిన ట్రాయ్‌నగరం గురించి అనేక పరిశోధనలు సాగాయి. వీటి ఫలితంగా నాటి ట్రాయ్ నగరమే ప్రస్తుత ‘టర్కీ’అని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ట్రోజన్ వార్ ముగిసిన ఐదు శతాబ్దాల అనంతరం క్రీస్తు పూర్వం ఐదు, ఆరు శతాబ్దాల్లో హోమర్ ‘గ్రీకు పురాణ’ రచనలను సాగించాడు. వీటి ఆధారంగా ట్రాయ్ నగరం ఉనికి గురించి అనేక పరిశోధనలు సాగాయి.
హెన్రిక్ స్కీలిమన్ అనే పరిశోధకుడు 1870లో తొలిసారి ట్రాయ్ నగర ఉనికిని గుర్తించాడంటారు. సముద్ర తీరానికి కొంత దూరంలో టర్కీలో ఉన్న ఒక కొండ ప్రాంతంలో ట్రాయ్ నగర అవశేషాలను కనుగొన్నట్లు ఇతడు ప్రకటించాడు. టర్కీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ‘ట్రువా’గా గుర్తింపు ఉన్న ప్రాంతమే అలనాటి ట్రాయ్ అని, ఏదో ఒక పెద్ద అగ్ని ప్రమాదంలో అది నాశనం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డారు.
మన్‌ఫ్రెడ్ కుఫ్‌మన్ అనే పరిశోధకుడు 1988లో ట్రాయ్ గురించి తన టీమ్‌తో పరిశోధనలు చేశాడు. ఇక్కడ క్రీస్తు పూర్వం 12 వ శతాబ్దానికి చెందిని కొన్ని వస్తువులను కనుగొన్నట్లు ఇతడు ప్రకటించాడు. ట్రాయ్ నగర నిర్మాణం అనేక అంచల్లో ఉందని, ఆరవ, ఏడవ అంచలోని ట్రాయ్‌నగరాన్ని హోమర్ వర్ణించిన ట్రాయ్‌గా భావించవచ్చని ఈ చరిత్రకారుడు అంటారు. అయితే నాటి పరిస్థితులను గమనించినప్పుడు హోమర్ వర్ణనల్లో చాలా అతిశయోక్తి కనిపిస్తుందని, ఇక దైవలీలల గురించి తాను వ్యాఖ్యానించబోనని కుఫ్‌మన్ అంటారు.
సినిమాగా సూపర్ హిట్
‘ట్రాయ్’ నగర ప్రస్తావన గురించి 2004లో హాలీవుడ్‌లో ఒక సినిమా వచ్చింది. నిర్మాణపరంగా భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతికతో ఉన్న ఈ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. వూల్ఫ్‌గ్యాంగ్ పీటర్సన్ అనే దర్శకుడు హోమర్ ‘ఇలియడ్’ గ్రంథం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు.
ఇందులో ‘ఎఖిలస్’ పాత్రను హైలెట్ చేశారు. ఈ రోల్‌లో బ్రాడ్‌ఫిట్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ ఎపిక్ సినిమా అనేక అవార్డులను గెలుచుకుంది. యూత్‌కు ఇష్టమైన సినిమాగా నిలిచింది. క్రీస్తు పూర్వం 1200 వందల సంవత్సరాల నాటి నాగరికత గురించిన ఈ సినిమాకు క్యాస్ట్యూమ్స్ విభాగంలో ఆస్కార్ దక్కింది.
———————- జీవన్‌రెడ్డి . బి