Divorce rate is increasing....................................
మనదేశంలో వివాహాబంధం క్రమేణా బలహీన పడుతోంది.గతం లో మాదిరిగా వివాహబంధంలో ఈ నాటి జంటలు ఎక్కువ కాలం ఇమడ లేకపోతున్నారు. ఒకప్పుడు మన దేశం లో విడాకులు తీసుకునే వారి సంఖ్య బహు తక్కువ గా ఉండేది.ఇటీవల కాలంలో విడాకుల కల్చర్ బాగా పెరిగి పోయింది.
ప్రపంచంలో విడాకుల రేటు ఎక్కువగా ఉన్న దేశం అమెరికా. అక్కడ 45 శాతం పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. ఇక మన దేశానికి వస్తే.. 1990 వరకూ ఒక్క శాతం కన్నా తక్కువగా విడాకులు తీసుకునే వారి సంఖ్య ఉండేది. అయితే..2000 నుంచి విడాకులు తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మన దేశంలో విడాకుల రేటు 7 శాతం దాటి పోయిందని అంచనా.
ఒక దశాబ్దకాలంలో విడాకుల్లో ఇంత వృద్ధి రేటు కనిపించడం దురదృష్టకరం. ఒక్కమాటలో చెప్పాలంటే.. కష్టమైనా, నష్టమైనా కలిసి ఉండాలనే సూత్రానికి భార్యాభర్తలిద్దరూ తిలోదకాలు ఇచ్చేస్తున్నారు.సర్దుబాటు ధోరణి ఇద్దరిలో ఉండటం లేదు..ఒకరు సర్దుబాటు కి ముందుకొచ్చినా రెండోవారు ససేమిరా అంటున్నారు.
పెద్దలకు తెలీకుండానే తెగతెంపులు చేసుకుంటున్నారు. విడాకులు తీసుకోవడాన్ని ఎవరూ నామూషీ గా భావించడం లేదు.పెద్దలు ఎవరైనా మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని వారినే బెదిరించడం ఫాషన్ గా మారి పోయింది.కొందరైతే పెళ్లి పెటాకులుగా మారగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇదిలా వుంటే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే కొద్దీ విడాకుల రేటు పెరిగిపోతోంది. అయితే, ఇందులో మహిళలను మాత్రమే తప్పుపట్టలేం. మగవాళ్ల పాత్ర కూడా ఉంది. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మగాడు మారడం లేదు.
కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడే మహిళల శ్రమను గుర్తించే పరిస్థితుల్లో లేడు. పేద కుటుంబాల నుంచి మధ్య తరగతి కుటుంబాల వరకు మహిళల శ్రమకు గుర్తింపు లేదు.అది లేక పోగా వారి కష్టాన్ని మగాడు దోచుకుంటున్నఉదాహరణలు కోకొల్లలు.ఈ క్రమం లోనే మగాళ్ళ వైఖరితో విసిగి మహిళలు విడాకులు వైపు మొగ్గు చూపుతున్నారు.
మధ్యతరగతి .. ఉద్యోగ వర్గాలలో ఇలాంటి కేసులు ఎక్కువ. మరి పెద్ద పెద్ద సెలెబ్రిటీలు … సినీ తారల కేమైంది. ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? అంటే అక్కడ కూడా కొంచెం అటు ఇటుగా పైన చెప్పుకున్న కారణాలే కనబడతాయి. ఇంకా ఇగో .. స్వేచ్ఛ ఎక్కువ కావడం .. విశృంఖలత్వం .. ఒకరిపై మరొకరికి అనుమానాలు .. చేసుకున్నప్పుడు ఉన్న ఆకర్షణ తర్వాత తగ్గిపోవడం .. మల్టిఫుల్ రిలేషన్స్ ఇవన్నీ కారణాలే అని చెప్పుకోవచ్చు.
ఇటీవలే కాలంలో విడిపోయిన సెలెబ్రిటీలలో జెఫ్ బెజోస్ … మెకంజీ స్కాట్ ,బిల్ గేట్స్ …మిలెండాలు …తాజాగా అమీర్ ఖాన్ ..కిరణ్ రావు లు ఉన్నారు. అమీర్ ఖాన్ అయితే తొలుత రీనా దత్తాను పెళ్లి చేసుకుని 15 ఏళ్ళు కాపురం చేసి విడాకులు తీసుకుని … తర్వాత కిరణ్ రావును చేసుకున్నాడు. ఆమె తో 15 ఏళ్ళు సంసారం చేసాక విడిపోయాడు. ఇపుడు 56 ఏళ్ళ వయసులో మరో తార ను పెళ్లి చేసుకోవచ్చు అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
విదేశీయులను వదిలేస్తే సెలెబ్రిటీలు గా మన తారలు వివాహబంధం గురించి ఏ విధంగా ఫీలవుతున్నారో కానీ నెట్ జనులు మాత్రం వీరిపై దుమ్మెత్తి పోస్తున్నారు. అమీర్ ఖాన్ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తల్లి తండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లల పై తీవ్రంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించకుండా ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు.
————KNM