Things that don’t go fast…………………..
గంగా నది.. హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవ నది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.ఇప్పుడు పాపాలు పోవటం సంగతి పక్కన బెడితే.. ఆ నదిలో మునిగితే లేని పోని రోగాలన్నీ అంటుకొనే దుస్థితి దాపురించింది.
గంగా యాక్షన్ ప్లాన్ , నమామి గంగే ప్రాజెక్టులు పేరుకే పరిమితమయ్యాయని కేంద్రంపై NGT గుర్రుగా ఉంది. ఇంతకీ గంగమ్మను ప్రక్షాళన చేస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ కొన్ని పధకాలు ప్రవేశపెట్టినా సాధించిన ఫలితాలు తక్కువ.
2వేల525 కిలోమీటర్ల పొడవుతో, 6వేల921 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్న గంగలో… ఒక్కసారి స్నానమాచరిస్తే సర్వ పాపాలు పోతాయని హైందవుల విశ్వాసం. ఇండియాకి జీవనాడి లాంటి గంగానది… దశాబ్దాల పాలకుల నిర్ణక్ష్యం కారణంగా… కాలుష్య కోరల్లో చిక్కుకుంది.
ఇదే సమయంలో హిందూ సెంటిమెంటును ఓటుబ్యాంకుగా భావించే బీజేపీ ప్రభుత్వం… గంగానదిని ప్రక్షాళన చేస్తానని 2014లో వారణాసీ బరిలో నిలబడినప్పుడు.. ప్రధాని మోడీ అక్కడి ప్రజలకే కాదు…యావత్ భారత ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా గంగా ప్రక్షాళన కోసం… నమామి గంగే అనే కార్యక్రమాన్నిమోడీ ప్రభుత్వం చేపట్టింది.
దానికోసం 638 కోట్లు విడుదల చేసింది. కానీ ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చడంలో కమలం సర్కార్ వెనుకబడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గంగానది వేగంగా కలుషితమవుతున్నదని… అప్పటి ప్రభుత్వం నాలుగు దశాబ్దాల కిందే గుర్తించి… శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1986 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు.
గంగా యాక్షన్ ప్లాన్ కింద… 2016 జూన్ నాటికి కేంద్రం గంగా పరిరక్షణకు 6వేల788.78 కోట్లు మంజూరు చేసింది. అందులో 4వేల800 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గంగా పరిరక్షణకు.. అదే ఏడాది జూన్‌లో నమామి గంగే పేరిట కొత్త మిషన్ ప్రారంభించింది.
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకూ… గంగానది శుద్ధి కోసం 409 ప్రాజెక్టులు చేపట్టినట్టు గత ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికోసం 32వేల912 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది.
అయితే గంగానది ప్రక్షాళనకు కేటాయించిన నిధులన్నీ ఏమయ్యాయో తెలియదు. కానీ.. గంగ మాత్రం కాలుష్య కాసారంగానే మిగిలిపోయిందని అక్కడి ప్రజలు కాదు… అక్కడి వెళ్లిన భక్తులు సైతం అంటున్నారు.
జనాల నుంచి వస్తున్న ఆరోపణల నేపధ్యంలో.. ఎన్జీటీ గంగా ప్రక్షాళన ప్రణాళికలపై అసహనం వ్యక్తం చేసింది. గడిచిన 37 ఏండ్లుగా గంగను శుద్ధిచేస్తున్నా… అది నేటికీ కాలుష్యమయంగానే ఉండటంపై ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం నుంచి నదిని కాపాడేందుకు ప్రారంభించిన గంగా యాక్షన్ ప్లాన్ , నమామి గంగే వంటి కార్యక్రమాలేవీ విజయవంతం కాలేదని, ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.
హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే గంగానదిని… హిందువులు ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. గంగా నది ఒడ్డున వందకు పైగా నగరాలు, వేలాది గ్రామాలున్నాయి.దేశ జనాభాలో దాదాపు 40 కోట్లమంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు.
నది సమీప ప్రాంతాలు కావడంతో వ్యవసాయ, పరిశ్రమల వ్యర్థాలను నేరుగా వదులుతుండటంతో… నదీజలాలు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. ప్రస్తుతం నదిలో 50 శాతం కలుషిత నీరేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ప్రకటించింది.
దీంతో నదీ కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి 97 మానిటరింగ్ స్టేషన్‌లు ఏర్పాటుచేశారు అధికారులు. అందులో 42 స్టేషన్ల దగ్గర గంగనీరు ప్రమాదకరస్థాయిలో విషతుల్యంగా మారిపోయిందని అంటున్నారు. మొత్తం మీద జీవనది ప్రక్షాళన పనులు నత్త నడకన సాగుతున్నాయి.